ఇంకెన్నాళ్లకు?

ABN , First Publish Date - 2023-01-25T23:42:18+05:30 IST

హుస్నాబాద్‌లో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయాల భవనం(ఐవోసీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తి కావడం లేదు. ఐదు నెలలుగా ఈ పనులు కూడా నిలిచిపోయాయి.

ఇంకెన్నాళ్లకు?

ఐదేళ్లయినా పూర్తికాని హుస్నాబాద్‌ ఐవోసీ నిర్మాణం

నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో చేతులెత్తేసిన కాంట్రాక్టరు

ఐదు నెలలుగా నిలిచిన పనులు

మళ్లీ టెండర్‌ ప్రకియ చేపట్టి మరో కాంట్రాక్టర్‌కు పనుల అప్పగింత

ఈసారైనా సకాలంలో పూర్తి చేసేనా?

పలు ప్రభుత్వ శాఖలకు కార్యాలయాలు లేక ఇబ్బందులు

హుస్నాబాద్‌, జనవరి 25 : హుస్నాబాద్‌లో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయాల భవనం(ఐవోసీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తి కావడం లేదు. ఐదు నెలలుగా ఈ పనులు కూడా నిలిచిపోయాయి.

30 శాఖల కార్యాలయాలు

అన్ని కార్యాలయాలు ఒకే గొడుగు కిందకు తీసుకరావాలనే ఉద్దేశంతో హుస్నాబాద్‌ పట్టణం కిషన్‌నగర్‌లో మూడెకరాల స్థలంలో రూ.17 కోట్లతో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవనానికి 2018 జూలైలో మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు పనులను పూర్తి చేయాల్సి ఉండగా ఐదేళ్లవుతున్నా పూర్తికాలేదు. ఐవోసీ భవనంలో దాదాపు 30 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల నిర్వహణ ఉంటుంది. డివిజన్‌ స్థాయి కార్యాలయాలతో పాటు హుస్నాబాద్‌ మండల కార్యాలయాలు కూడ ఇందులోనే నిర్మిస్తున్నారు. పోలీస్‌, మున్సిపల్‌ కార్యాలయాలు మినహా రెవెన్యూ డివిజన్‌, వ్యవసాయం, మిషన్‌ భగీరథ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, మండల పరిషత్‌ వంటివి ఇందులోనే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉద్యానవన, పంచాయతీ అధికారి, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ వంటి శాఖలకు కార్యాలయాలు లేక సంబంధిత అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ భవన నిర్మాణం జరిగితే ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు.

రూ.5 కోట్ల పనులకు మళ్లీ టెండర్‌

భవన నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.12 కోట్ల పనులు జరిగాయి. కాంట్రాక్టర్‌కు ఈ బిల్లులను చెల్లించారు. కరోనా ప్రభావంతో మధ్యలో పనులు నిలిచిపోయాయి. అప్పుడు గడువులోగా కాంట్రాక్టర్‌ పనులు చేయకపోవడంతో అధికారులు పలుమార్లు వారికి నోటీసులు పంపించారు. తదనంతరం మళ్లీ పనులను ప్రారంభించి 60 శాతం వరకు పూర్తిచేయగలిగారు. జీ ప్లస్‌ 2 పద్ధతిలో నిర్మిస్తున్న ఈ భవనానికి కింద పార్కింగ్‌కు కేటాయించగా మొదటి, రెండో అంతస్తులో కార్యాలయాల గదులను నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తులో ఇంకా 20 శాతం పనులు మిగిలి ఉన్నాయి. అయితే ఇసుక, కంకర, ఇనుము ఇతర నిర్మాణ సామగ్రి రేట్లు పెరగడంతో కాంట్రాక్టర్‌ మిగిలిన పనులు చేయలేనని చేతులెత్తేశారు. దీంతో ఐదు నెలలుగా పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అధికారులు మిగిలిన రూ.5 కోట్ల పనులకు మళ్లీ టెండర్లు పిలిచారు. ప్రస్తుతం టెండర్‌ ప్రక్రియ పూర్తయి మరో కాంట్రాక్టర్‌ ఈ పనులు చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.17 కోట్లతో పనులు పూర్తయ్యే అవకాశాలు లేవని, మరో రూ.3కోట్లు అయితేనే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ నిధులను మంజూరు చేయాలని కోరుతున్నారు.

ఆర్డీవో కార్యాలయం తరలింపునకు బ్రేక్‌

హుస్నాబాద్‌ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ వెనుక భాగాన కొంత కూల్చి వేసి ఆ స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడ మార్కెట్‌ పనులు జరుగుతుండటంతో రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కార్యాలయం అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నది. ఆర్డీవో కార్యాలయాన్ని సమీకృత భవనానికి తరలించాలని ఆరు నెలల క్రితమే నిర్ణయించారు. కాని ఆ పనులు పూర్తికాకపోవడంతో తరలింపు నిలిచిపోయింది.

వారంలో పనులు ప్రారంభమవుతాయి

నిలిచిపోయిన సమీకృత భవన నిర్మాణ పనులు వారం రోజుల్లో ప్రారంభం అవుతాయి. దాదాపు రూ.12 కోట్ల పనులు జరిగిన తరువాత కాంట్రాక్టర్‌ పనులు చేయనని చెప్పడంతో మిగతా రూ.5 కోట్ల పనులకు టెండర్లు పిలిచాం. ఆ ప్రక్రియ కూడ పూర్తయ్యింది. వేగంగా పనులు చేసి మూడు నెలల్లో పూర్తి చేస్తాం.

-సదాశివరెడ్డి, పంచాయతీరాజ్‌ డీఈ

Updated Date - 2023-01-25T23:42:18+05:30 IST