సాగునీటి ప్రాజెక్టులకు రూ. 33.41 కోట్లు

ABN , First Publish Date - 2023-02-07T00:30:48+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో ప్రధానమైన నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది.

సాగునీటి ప్రాజెక్టులకు రూ. 33.41 కోట్లు

రాష్ట్ర బడ్జెట్‌లో సంగారెడ్డి జిల్లాకు కేటాయింపులు

సింగూరుకు రూ.17.87 కోట్లు, నల్లవాగుకు రూ.15.54 కోట్లు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఫిబ్రవరి 6 : సంగారెడ్డి జిల్లాలో ప్రధానమైన నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో సింగూరు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.17.87 కోట్లను కేటాయించింది. ప్రాజెక్టు నిర్వహణ, ప్రధానకాల్వలు, పంపిణీ కాల్వల అభివృద్ధి, ఇందుకోసం అవసరమయ్యే భూసేకరణకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అలాగే, నల్లవాగు ప్రాజెక్టు కోసం రూ.15.54 కోట్లను కేటాయించారు. ప్రాజెక్టుకు సిమెంట్‌ లైనింగ్‌, షెట్టర్లు, పంపిణీ కాల్వల అభివృద్ధి తదితర పనులను చేపట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.

192 మంది సెర్ప్‌ ఉద్యోగులకు ఊరట

సెర్ప్‌ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన స్కేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 1 నుంచే అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయంతో జిల్లాలో 192 మంది సెర్ప్‌ ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు.

‘దళితబంధు’ అందేనా?

దళితబంధు మూడో విడతలో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున దళిత కుటుంబాలకు సాయం చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కానీ గత రెండు విడతలను పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. తొలిసారి దళితబంధు ప్రకటించిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో సంగారెడ్డి జిల్లాలో 444 మంది ప్రయోజనం పొందారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 1,500 మందిని ఎంపిక చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సాయం అందించలేదు. తొలుత చెప్పిన మాటను మార్చిన ప్రభుత్వం నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేస్తామని ప్రకటించి.. ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేయలేదు.

ఇంటికి సాయంపై పాత మాటే!

సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని 2022-23 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు జిల్లాలో 300 మంది దరఖాస్తు చేసుకున్నా ఒక్కరికీ సాయం అందలేదు. వచ్చే బడ్జెట్‌లోనూ పాత విషయాన్నే పునరుద్ఘాటించగా ఈసారైనా నిధులిస్తారో లేదు గ్యారెంటీ లేదు. దీంతో ఈ పథకంపై ఆశలు అంతంతే!

Updated Date - 2023-02-07T00:30:49+05:30 IST