మున్సిపల్‌ పన్నుశాతం తగ్గింపునకు కృషి: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2023-01-25T23:33:06+05:30 IST

చేర్యాల, జనవరి 25: చేర్యాల పట్టణ ప్రజలపై భారం పడకూడదన్న ఉద్దేశంతో తమ పాలకమండలి ప్రథమ ప్రాధాన్యతతో పన్నుల తగ్గింపునకు కృషిచేస్తున్నదని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి అన్నారు.

మున్సిపల్‌ పన్నుశాతం తగ్గింపునకు కృషి: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌
కమిషనర్‌ రాజేంద్రకుమార్‌తో కలిసి సీసీ డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌ స్వరూపారాణి

చేర్యాల, జనవరి 25: చేర్యాల పట్టణ ప్రజలపై భారం పడకూడదన్న ఉద్దేశంతో తమ పాలకమండలి ప్రథమ ప్రాధాన్యతతో పన్నుల తగ్గింపునకు కృషిచేస్తున్నదని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి అన్నారు. బుధవారం ఆమె చేర్యాలలో విలేకరులతో మాట్లాడారు. మేజర్‌ గ్రామపంచాయతీ నుంచి మున్సిపల్‌ అప్‌గ్రేడ్‌ అవుతున్న సమయంలో అప్పటి స్పెషల్‌ ఆఫీసర్‌ ఇంటి పన్నును ఒకశాతంగా నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక అందిచాడని, తాము పదవీ చేపట్టగానే ఇంటి పన్నుభారాన్ని తగ్గించేందుకు 0.25 శాతానికి తగ్గిస్తూ తీర్మానం చేసి పన్నులు వసూలు చేస్తున్నామన్నారు. తమ హయాంలోనే పన్నులు పెంచారని పలువురు నాయకులు పేర్కొనడం పూర్తిగా అవాస్తమవని గుర్తించాలని సూచించారు. 0.25 నుంచి మరింతగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయాన్ని పట్టణ ప్రజలు గమనించి అసత్య ప్రచారాన్ని విస్మరించాలని కోరారు. అంతకుముందు ఆమె పట్టణంలోని 8వ వార్డులో జరుగుతున్న సీసీ డ్రైనేజీ నిర్మాణం పనులను పరిశీలించారు. 2వ వార్డులో బుధవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌, కౌన్సిలర్‌ చెవిటి లింగం, కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్‌, మంగోలు చంటి, నాయకులు ఎండీ.ఎక్బాల్‌ పాల్గొన్నారు.

పన్నుల భారం తగ్గించాలని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన

చేర్యాల, జనవరి 25: పన్నులభారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం చేర్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక గాంధీచౌక్‌ నుంచి కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు రామగల్ల పరమేశ్వర్‌, ఆముదాల మల్లారెడి, అందె అశోక్‌, ఆది శ్రీనివాస్‌, పుర్మ ఆగంరెడ్డి, అవుశర్ల యాదయ్య, కొమ్ము నర్సింగరావు తదితరులు మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో మరెక్కడా లేనివిధంగా చేర్యాల మున్సిపల్‌లో అత్యధికంగా ఇంటిపన్నులు వసూలు చేస్తున్నారని, ఈ విషయమై అధికార పార్టీ కౌన్సిలర్లు తీర్మాణించడం తగదన్నారు. నిరుపేదలు ఎంతోమంది తినడానికే ఇబ్బందులు పడుతుండగా, ఇంటిపన్నులను ఇష్టానుసారం పెంచి ముక్కుపిండి వసూలు చేయడం సబబుకాదన్నారు. పట్టణ ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాల దృష్ట్యా ఆస్తిపన్ను శాతాన్ని తగ్గించి పూర్వ పద్ధతిని కొనసాగించాలని, లేనియెడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ రాజేంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ చెవిటి లింగం, నాయకులు ముస్త్యాల యాదగిరి, ఈరు భూమయ్య, ఉడుముల భాస్కర్‌రెడ్డి, మల్లేశం, కళావతి, చిరంజీవులు, శ్రీనివాస్‌, బద్దిపడిగ నర్సింహారెడ్డి, బాల నర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:33:07+05:30 IST