విద్యుత్‌ బిల్లుల బకాయి రూ.1.95 కోట్లు

ABN , First Publish Date - 2023-02-01T23:27:59+05:30 IST

విద్యుత్‌ బిల్లుల బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోతుండటం అధికారులకు తలనొప్పిగా మారింది. గద్వాల పట్టణంలో వినియోగదారుల నుంచి సంస్థకు రావాల్సిన బిల్లులు 2023, జనవరి 30 నాటికి రూ.1.95 కోట్లకు చేరింది.

విద్యుత్‌ బిల్లుల బకాయి రూ.1.95 కోట్లు
గద్వాల ఉప విద్యుత్‌ కేంద్రం (టౌన్‌ ఫీడర్‌)

- వసూళ్ల ఒత్తిడిలో విద్యుత్‌ సిబ్బంది

- బకాయిల్లో ప్రభుత్వ కార్యాలయాలు

గద్వాల అర్బన్‌, ఫిబ్రవరి 1 : విద్యుత్‌ బిల్లుల బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోతుండటం అధికారులకు తలనొప్పిగా మారింది. గద్వాల పట్టణంలో వినియోగదారుల నుంచి సంస్థకు రావాల్సిన బిల్లులు 2023, జనవరి 30 నాటికి రూ.1.95 కోట్లకు చేరింది. దీంతో బిల్లుల వసూలు కోసం ఉన్నతాధికారుల నుంచి స్థానిక అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి ఎక్కువైంది. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు దినపత్రికల ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, మూడు రోజులుగా ఆటోలపై మైక్‌లను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బిల్లులు కూడా పెద్ద మొత్తంలో బకాయిలు ఉండడం గమనార్హం.

కేటగిరీల వారీగా...

పట్టణ విద్యుత్‌ వినియోగదారుల్లో మొదటి కేటగిరిలోని గృహ వినియోగదారుల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రూ.65 లక్షల బకాయిలున్నాయి. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు వంద యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తుండగా, ఆపై వాడే వినియోగానికి చెల్లించే బిల్లులు సైతం వసూలు కావడం లేదు. పైగా ఉచిత పథకానికి సంబంధించిన నిధులు సైతం విద్యుత్‌శాఖకు అందడం లేదు. రెగ్యులర్‌గా వచ్చే గృహ వినియోగదారుల నుంచి రూ.30 లక్షలు పెండింగ్‌లో ఉండగా, డోర్‌లాక్‌ (యూడీసీ) ఉన్న ఇళ్లకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు రూ.60 లక్షలకు చేరాయి. పరిశ్రమల విభాగం నుంచి ప్రతీ నెల క్రమం తప్పకుండా రూ.70 లక్షలు వసూలు అవుతుండడం అధికారులకు కొంత ఊరటనిస్తోంది. కాగా, పట్టణ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన బిల్లులు రూ.45 లక్షలు పెండింగ్‌లో ఉండటం సిబ్బందికి తలనొప్పిగా మారింది. బకాయిల వసూలు కోసం ఉన్నతాధికారుల నుంచి సిబ్బందిపై ఒత్తిడి ఎక్కువవు తోంది. పెండింగ్‌ బిల్లులు పేరుకుపోతే తమకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు, ఇంక్రిమెంట్లు కట్‌ చేస్తారని కింది స్థాయి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది.

వినియోగదారులు సహకరించాలి

పట్టణంలోని అన్నిరకాల వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలి. బకాయిలు పేరుకుపోతుండటంతో విద్యుత్‌ నిర్వహణ సంస్థకు భారంగా మారింది. ఈక్రమంలో గడువులోగా చెల్లింపులు చేయనివారికి అనివా ర్యంగా సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. ఇందుకు కిందిస్థాయి సిబ్బందిని తప్పు పట్టినా ప్రయోజనం ఉండదు.

- శ్రీనివాసులు, పట్టణ ఏఈ

Updated Date - 2023-02-01T23:28:00+05:30 IST