నడిగడ్డకు ఆధ్యాత్మిక శోభ

ABN , First Publish Date - 2023-01-25T00:04:00+05:30 IST

ప్రముఖ దైవ క్షేత్రాల్లో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, జరుగుతున్న ప్రత్యేక పూజలు, హోమా లతో నడిగడ్డ ప్రాంతం ఆధ్యాతిక శోభను సంతరించు కున్నది.

నడిగడ్డకు ఆధ్యాత్మిక శోభ
అయిజలో జోగులాంబ అమ్మవారిని మెట్టినింటికి తీసుకెళ్తున్న గ్రామా పెద్దలు

- పెద్ద రేవులలో ఆంజనేయస్వామి, ఉత్తనూరులో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

- భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణం, విశేష పూజలు

ధరూరు/ అయిజ/ గద్వాల రూరల్‌/ గద్వాల టౌన్‌, జనవరి 24 : ప్రముఖ దైవ క్షేత్రాల్లో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, జరుగుతున్న ప్రత్యేక పూజలు, హోమా లతో నడిగడ్డ ప్రాంతం ఆధ్యాతిక శోభను సంతరించు కున్నది. ధరూరు మండల పరిధిలోని పెద్ద చింతరేవుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభ వంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రధాన అర్చకుడు ఆద్య కేశవాచారి ఆధ్వర్యంలో ధ్వజారోహణం, అంకురార్పణ నిర్వహించారు. అనంతరం పుట్టుమన్ను తీసుకొచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గిరిరావు, అర్చకుడు మద్వాచారి, వామనాచారి, కిష్టాచారి పాల్గొన్నారు.

28న కబడ్డీ ఇన్విటేషన్‌ పోటీలు

బ్రహోత్సవాల్లో భాగంగా ఈ నెల 28, 29 తేదీల్లో పెద్దచింతరేవులలో తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ ఇన్వి టేషన్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ. 30,116, రూ. 20,116, రూ.15,116 అందించనున్నారు. నాలుగవ బహుమతి విజేతకు 10,116 రూపాయలు ఇవ్వనున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పద్మవెంకటేశ్వర్‌ రెడ్డి, ఎంపీపీ నజిమున్సీసా బేగం, వైఎస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డిలు చేతుల మీదుగా అందిస్తారని తెలిపారు. నాగర్‌దొడ్డి వెంకట్రామిరెడ్డి మ్యాట్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు.

- అయిజ మండల పరిధిలోని ఉత్తనూర్‌లో ధన్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటలకు సుప్రభాతసేవతో ఉత్సవాలను ప్రారంభించారు. తోమాలసేవ, బిందెసేవ, పంచామృతాభిషేకం నిర్వహించారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, యాగశాల ప్రవేశం, వాస్తు హోమం, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, అంకురార్పణ భేరీపూజ, ధ్వజారోహణం, దేవత ఆహ్వానం తదితర విశేష పూజలు చేశారు.

జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

గద్వాల మండలంలోని జమ్మిచేడ్‌ జములమ్మ దర్శనానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. ఈ నెల 31వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఒక వారం ముందుగానే అమ్మవారిని కొలిచేందుకు భక్తులు క్యూకట్టారు. తెల్లవారుజామున నుంచి భక్తులు దర్శనానికి తరలిరాగా, సాయంత్రం అయిన రద్దీ తగ్గలేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ పరిసరాల్లో షామియానాలు వేసుకొని నైవేద్యాలను సిద్ధం చేసుకొని అమ్మవారికి సమర్పించారు. బైనోళ్ల చప్పళ్లు, పూనకాల నడుమ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ చైర్మన్‌ కుర్వ సతీష్‌కుమార్‌, పాలకమండలి సభ్యులు మేడికొండ జానకిరాములు, అభిలాష్‌, మాధవి కామ్లే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

మెట్టినింటికి చేరిన జములమ్మ

జములమ్మ అమ్మవారు పుట్టింటి నుంచి మెట్టినింటికి మంగళవారం చేరుకున్నారు. మంగళవారం ఉదయం పుట్టిల్లు అయిన మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ నాగన్‌గౌడు ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్‌పై జములమ్మ, పరశురాముడుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. తూముకుంట రహదారిలోని ఆలయానికి అమ్మవారిని చేర్చారు. ఏరువాక పౌర్ణమి వరకు అక్కడే ఉంటారని, ప్రతీ శుక్రవారం, మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తారని పురోహితుడు వెంకటేశ్‌ తెలిపారు. కార్యక్రమంలో నాగన్‌గౌడు, సవారిగౌడు, ప్రతాప్‌, కృష్ణ, నిర్మల్‌ పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో చండీ యాగం

గద్వాల మండల పరిధిలోని నదీ అగ్రహారంలోని సీతా రామచంద్రస్వామి దేవస్థానంలో నవచండీ మహా యాగాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ... అమ్మవారి అను గ్రహంతో గద్వాల ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్‌ జంబు రామన్‌ గౌడ, కౌన్సిలర్‌ నాగరాజు, త్యాగరాజు, బిఆర్‌యస్‌ పార్టీ నాయకులు రంజిత్‌, అర్చకులు ప్రాణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:04:00+05:30 IST