గులాబీమయమైన పేట

ABN , First Publish Date - 2023-01-24T23:18:11+05:30 IST

సింగారం చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా, ఎర్రగుట్ట, పాత బస్టాండ్‌ చౌరస్తాలతో పాటు డివైడర్ల మధ్య గులాబీ తోరణాలు, బీఆర్‌ఎస్‌ జెండాలను, నాయకుల భారీ కటౌట్‌లతో గులాబీమయంగా మారింది.

గులాబీమయమైన పేట
బహిరంగ సభకు ర్యాలీగా వెళ్తున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు

నారాయణపేట/టౌన్‌, జనవరి 24 : సింగారం చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా, ఎర్రగుట్ట, పాత బస్టాండ్‌ చౌరస్తాలతో పాటు డివైడర్ల మధ్య గులాబీ తోరణాలు, బీఆర్‌ఎస్‌ జెండాలను, నాయకుల భారీ కటౌట్‌లతో గులాబీమయంగా మారింది. బహిరంగ సభ ప్రాంగణంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ప్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మంత్రి కేటీఆర్‌ పర్యటన ఇలా

ఉదయం 11.06 గంటలకు హెలిక్యాప్టర్‌లో మంత్రులు కేటీఆర్‌, మహామూద్‌ అలీతో పాటు ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి సింగారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, కలెక్టరేట్‌ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, ఎస్పీ వెంకటేశ్వర్లు మంత్రి కేటీఆర్‌కు, హోం మంత్రికి పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి బస్సులో జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి చేరుకొని కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డిని కుర్చిలో కూర్చోబెట్టి బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వహాక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అభినందించారు. అనంతరం సింగారం చౌరస్తాలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయ భవన నిర్మాణానికి సంబంధించి 9 శిలాఫలకాలకు శంకుస్థాపనలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ ముందు రూ.8 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవనాన్ని ప్రారంభించి, స్టాల్స్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి ఎర్రగుట్టకు చేరుకొని సఖీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కొండారెడ్డిపల్లి చెరువు దగ్గరికి వెళ్లి గంగా పూజ చేశారు. అక్కడి నుంచి సత్యసాయి కాలనీలో ఉన్న సీనియర్‌ సిటిజన్‌ పార్కును ప్రారంభించి, సిటిజన్‌ పార్కులో మునిసిపల్‌ పాలకవర్గం సభ్యులతో కలిసి మంత్రి కేటీఆర్‌ ఫొటోలు దిగారు. మధ్యాహ్నం జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి చేరుకొని భోజనం అనంతరం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలాకి 3.30 గంటలకు చేరుకున్నారు. ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి బస్సులో మంత్రి కేటీఆర్‌ హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, అబ్రహం, అదనపు కలెక్టర్లు పద్మజారాణి, కార్పొరేషన్‌ చైర్మన్లు నిజాంపాషా, ఇంతియాజ్‌, దేవరి మల్లప్ప, శ్రీనివాస్‌, సాయిచరణ్‌, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ భాస్కర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె అనసూయ, వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అంజలి, ఆర్డీవో రాంచందర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు విజయ్‌సాగర్‌, చెన్నారెడ్డి, కృష్ణ కోర్వార్‌, సుదర్శన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీపాద్‌, గందె చంద్రకాంత్‌, బండి శివరాంరెడ్డి, శ్రీపాద్‌, వేపూరి రాములు, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు భీమయ్య గౌడ్‌ పాల్గొన్నారు.

మంత్రి నిరంజన్‌రెడ్డి రాక కోసం గంటన్నర నిరీక్షణ

మక్తల్‌ రూరల్‌ : మంత్రి నిరంజన్‌రెడ్డి నారాయణపేటకు వస్తుండగా కారుకు స్వల్పంగా ప్రమాదం జరిగింది. మక్తల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జక్లేర్‌ సర్కిల్‌లో వరికోత మిషన్‌ అదుపు తప్పి మంత్రి వాహనంపైకి రావడంతో డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించారు. ఈ ఘటనలో మంత్రి ప్రయాణిస్తున్న కారు డోరుకున్న సైడ్‌ అద్దానికి హర్వెస్టర్‌ రాడ్‌ తగలడంతో సైడ్‌ అద్దం పగిలిపోయినట్లు సమాచారం. అక్కడి నుంచి నారాయణపేటకు వచ్చే వరకు కొంత సమయం పట్టింది. దీంతో మంత్రి నిరంజన్‌రెడ్డి రాక కోసం సుమారు గంటన్నర పాటు మంత్రి కేటీఆర్‌ నిరీక్షించాల్సి వచ్చింది. నర్వ మండలం పెద్దకడ్మూరుకు చెందిన ఓ రైతు హర్వెస్టర్‌గా గుర్తించారు. కాగా ప్రమాదానికి కారణమైన హర్వెస్టర్‌ను మక్తల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఎండలోనే నిరీక్షించిన జనం..

నారాయణపేట క్రీడా మైదానంలో మంత్రి కేటీఆర్‌ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజాప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎండలోనే నిరీక్షించారు. సాయిచంద్‌ ధూంధాం ఆట పాటలతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులను స్టెప్పులు వేయిస్తూ ఉత్సాహాన్ని నింపారు. మరోవైపు కొందరు భారీ కటౌట్‌ల కింద నీడకు కూర్చోగా, మరోవైపు మునిసిపల్‌ కాంప్లెక్స్‌పై కూర్చొని బహిరంగ సభలో ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ ప్రసంగాలను విన్నారు.

భారీ పోలీస్‌ బందోబస్తు..

మంత్రుల పర్యటనే నేపథ్యంలో ఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్‌ నుంచి బస్సు కాన్వాయ్‌ మార్గంతో పాటు కల్వర్టుల దగ్గర, ప్రారంభోత్సవ స్థలాలు, పరిసరాల్లో పోలీసులు బందోబస్తుతో ప్రత్యేక నిఘా ఉంచి పర్యవేక్షించారు.

Updated Date - 2023-01-24T23:18:11+05:30 IST