మిషన్‌ భగీరథపై భగ్గుమన్న సభ్యులు

ABN , First Publish Date - 2023-01-25T23:16:08+05:30 IST

మూడు నెలలుగా మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతూ ప్రజలకు తాగునీరందడం లేదని, సభ్యులు ముక్త కంఠంతో అధికారులను నిలదీశారు.

మిషన్‌ భగీరథపై భగ్గుమన్న సభ్యులు
ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్న ప్రజాప్రతినిధులు

నారాయణపేట రూరల్‌, జనవరి 25 : మూడు నెలలుగా మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతూ ప్రజలకు తాగునీరందడం లేదని, సభ్యులు ముక్త కంఠంతో అధికారులను నిలదీశారు. బుధవారం నారాయణపేట ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ మిషన్‌ భగీరథ నీటి సరఫరా సక్రమంగా అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామాల్లో ఇది వరకు ఉన్న సింగిల్‌ ఫేస్‌ మోటార్ల ద్వారా నీరందుతుండగా వాటిని సైతం అధికారులు నిలిపి వేశారన్నారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక తాగునీటి కోసం కేవలం భగీరథపై ఆధారపడాల్సి వచ్చిందని, కానీ సరఫరాలో మాత్రం మూడు రోజులకోమారు ఆటంకాలు ఎదురౌతున్నాయన్నారు. అదే విధంగా రైతులకు 24 గంటల కరెంటు అందడం లేదని, త్రీఫేస్‌ విద్యుత్‌ సమయ పాలన లేకుండా అందిస్తున్నారన్నారు. ఉదయం 4గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉందని అధికారులు చెప్తున్నారని, అందులో సైతం ఎల్‌సీల పేరిట కోతలు విధిస్తున్నారని వాపోయారు. విద్యుత్‌ స్తంభాలకై డీడీలు కట్టినా ఇవ్వడం లేదన్నారు. ఏబీ స్విచ్చులు ఏర్పాటు చేయాలన్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని కోటకొండ పీహెచ్‌సీ, అమ్మిరెడ్డిపల్లి గ్రామాలతో పాటు మిగతా గ్రామాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. అనంతరం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రమాణం చేశారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ సుగుణ, జడ్పీటీసీ సభ్యురాలు పి.అంజలి, జడ్పీకోఆప్షన్‌ తాజుద్దీన్‌, ఎంపీడీవో ఎల్‌.ఎన్‌.రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:16:11+05:30 IST