రైల్వే స్టేషన్‌ వద్ద పార్కింగ్‌ కష్టాలు

ABN , First Publish Date - 2023-01-25T23:36:07+05:30 IST

గద్వాల రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణీకుల వాహనాల పార్కింగ్‌కు కష్టాలు తప్పడం లేదు.

రైల్వే స్టేషన్‌ వద్ద పార్కింగ్‌ కష్టాలు
షెడ్డు సరిపోక పోవడంతో ఆరుబయట పార్క్‌ చేసిన ద్విచక్రవాహనాలు

- రెండు షెడ్లు ఉన్నా సరిపోని పరిస్థితి

- ఎండ, వానల్లోనే వాహనాలు

- షెడ్డు విస్తరించాలని ప్రయాణికుల విజ్ఞప్తి

గద్వాల అర్బన్‌, జనవరి 25 : గద్వాల రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణీకుల వాహనాల పార్కింగ్‌కు కష్టాలు తప్పడం లేదు. పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేసిన షెడ్లతో రైల్వే శాఖకు ఆదాయం సమకూర్చడం తప్ప, తమకు ప్రయోజనం ఉండటం లేదని ప్రయాణికులు వాపోతు న్నారు. పార్కింగ్‌ కోసం పేరుకు రెండు షెడ్లు ఉన్నా, మూడేళ్ల కాలపరిమితితో ఇద్దరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టినా వాహనాలకు మాత్రం తగిన రక్షణ లేకుండా పోయిందం టున్నారు. వానాకాలంలో వర్షానికి తడుస్తూ, వేసవిలో ఎండకు ఎండుతూ వాహనాలు పాడైతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థానాదీశులు దానంగా ఇచ్చిన వంద ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నా దానిని సరైన రీతిలో వినియోగించుకోలేక పోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

విస్తరణకు నోచుకోని షెడ్లు

రైల్వేస్టేషన్‌ వద్ద పార్కింగ్‌కు ఎప్పటికప్పుడు ధర పెంచుతూ పోతున్నా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా షెడ్లు ఏర్పాటు చేయకపోవడం సమస్యగా మారింది. ప్రస్తుతం బైక్‌ పార్కింగ్‌కు మొదటి రెండు గంటలకు ఆరు రూపాయలు, రెండు నుంచి ఆరు గంటల్లోపు రూ.12, ఆరు గంటల నుంచి 24 గంటల వరకు రూ.24 వసూలు చేస్తున్నారు. కార్లకు మొదటి రెండు గంటలకు ఎనిమిది రూపాయలు, రెండు నుంచి ఆరు గంటల్లోపు రూ.16, ఆరు గంటల నుంచి 24 గంటల వరకు రూ.32 జీఎస్‌టీతో కలిపి వసూలు చేస్తున్నారు. అలాగే ఉద్యోగ అవసరాల కోసం కర్నూలు, హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌ పట్టణాలకు నిత్యం వెళ్లి వచ్చే వారికి ద్విచక్ర వాహనం పార్కింగ్‌కు రూ.150, కారుకు రూ.300 తీసుకుంటున్నారు. అంత డబ్బు ఇచ్చిన వాహనాలకు రక్షణ లేకుండా పోయిందని ప్రయాణికులు చెప్తున్నారు. 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన షెడ్లను పార్కింగ్‌ అప్పగించినా, వాహనాల సంఖ్యకు సరిపోవడం లేదు. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రైల్వేస్టేషన్‌లో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టినా, పార్కింగ్‌ షెడ్‌లను మాత్రం విస్తరించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్కింగ్‌ షెడ్లను విస్తరించాలని వాహనదారులు కోరుతున్నారు.

రెండు షెడ్లను అప్పగించాం

మున్నాజీరావు, కమర్షియల్‌ ఇన్స్‌పెక్టర్‌ : పుష్కరాల సమయంలో ప్రయాణికులు వేచి ఉండటం కోసం ఏర్పాటు చేసిన రెండు షెడ్లను ఇటీవలే వాహనాల పార్కింగ్‌ కోసం కాంట్రాక్టర్‌కు అప్పగించాం. వాహనాల రద్దీ పెరిగినప్పుడు నీడ కోసం తాత్కాలికంగా గ్రీన్‌మ్యాట్‌ను వారి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిం చాం. ఈ వెసలుబాటును కాంట్రాక్టు ఒప్పందం లోనే స్పష్టంగా పేర్కొన్నాం.

Updated Date - 2023-01-25T23:36:08+05:30 IST