అభ్యంతరాల నడుమ దుకాణాల వేలం

ABN , First Publish Date - 2023-01-24T23:54:52+05:30 IST

పట్టణంలోని ఐడీఎస్‌ఎంటీ దుకాణాల బహిరంగ వేలం మంగళవారం పలు అభ్యంతరాలు, అవాంతరాల నడుమ కొనసాగింది. మొత్తం 73 దుకాణాల కోసం అధికారులు వేలం నిర్వహించేందుకు సిద్ధం కాగా, 396 మంది వ్యాపారులు పోటీ పడ్డారు.

అభ్యంతరాల నడుమ దుకాణాల వేలం
అదనపు కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగిన దుకాణాల పాత యజమానులు

- వాయిదా వేయాలని పాత యజమానుల డిమాండ్‌

- అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌తో వాగ్వాదం

- 73 దుకాణాలకు 396 మంది వ్యాపారుల పోటీ

గద్వాల టౌన్‌, జనవరి 24 : పట్టణంలోని ఐడీఎస్‌ఎంటీ దుకాణాల బహిరంగ వేలం మంగళవారం పలు అభ్యంతరాలు, అవాంతరాల నడుమ కొనసాగింది. మొత్తం 73 దుకాణాల కోసం అధికారులు వేలం నిర్వహించేందుకు సిద్ధం కాగా, 396 మంది వ్యాపారులు పోటీ పడ్డారు. పాత బస్టాండ్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో ఆరు, మునిసిపల్‌ కార్యాలయం వెనుకభాగంలో 19, కూరగాయల మార్కెట్‌ సమీపంలో తొమ్మిది, సీబ్లాక్‌లో 39 దుకాణాలున్నాయి. వాటిలో ఎస్సీలకు ఏడు, ఎస్టీలకు రెండు, మహిళా స్వయం సహాయక బృందాలవారికి నాలుగు, దివ్వాంగులకు ఒకటి, నాయిబ్రహ్మాణ, రజక కులాలవారికి రెండు చొప్పున మొత్తం 16 దుకాణాలను రిజర్వేషన్‌ కేటగిరీ కింద కేటాయించారు. మిగతా 57 దుకాణాలకు జనరల్‌ విభాగంలో వేలం నిర్వహించారు. సీబ్లాక్‌ దుకాణాలకు ఎక్కువగా డిమాండ్‌ ఉండటంతో వేలంలో వాటికి నెలసరి అద్దె రూ.53 వేలకు పైగా లభించింది. ఇదే బ్లాక్‌లోని ఎస్సీ రిజర్వు దుకాణానికి పోటీ ఎక్కువగా ఉండటంతో, అధికారులు నిర్ధారించిన రూ.525కు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగి రూ.51,800 లభించింది. కాగా, వేలం ప్రక్రియ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా, రాత్రి 8.30 గంటల వరకు 43 దుకాణాలకు మాత్రమే పూర్తయ్యింది. మిగతా దుకాణాలకు మరో రెండు గంటల్లో వేలం పూర్తిచేస్తామని మునిసిపల్‌ కమిషనర్‌ కే.నరసింహ తెలిపారు.

వాయిదా వేసే ప్రసక్తే లేదు

దుకాణాల వేలానికి సంబంధించి తాము న్యాయస్థానాన్ని ఆశ్రయుంచామని, కోర్టు స్టేటస్‌కో ఆర్డర్‌ ఇచ్చినందున వేలం వాయిదా వేయాలంటూ ప్రస్తుతం ఆయా దుకాణాల్లో వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారు డిమాండ్‌ చేశారు. వేలం నిర్వహణను పర్యవేక్షిస్తున్న అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌తో వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన ఆయన, న్యాయస్థానం ఆదేశాలకనుగుణంగానే వేలం నిర్వహిస్తున్నామని, వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానం సూచన మేరకు చివరి గడువు లాగా దరఖాస్తు చేసుకోని (న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారు) 42 మందికి వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పడంతో వేలం కొనసాగింది.

వేలం హాలు వద్ద రభస

దుకాణాల వారీగా బహిరంగ వేలం నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక హాల్‌ ఏర్పాటు చేసి ఒక్కో దుకాణం వారీగా దరఖాస్తుదారులను ఆహ్వానిస్తున్నండగా, కొందరు దరఖాస్తుదారులను లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు హాలు వద్ద రభస జరిగింది. కోర్టు ఆదేశం మేరకు వేలం వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ, కొంతమంది కలెక్టర్‌కు, కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో కొంతమంది మైక్‌సెట్ల వైర్లను తొలగించగా, దరఖాస్తుదారులను లోనికి ఆహ్వానించేందుకు సిబ్బంది అవస్థలు పడ్డారు. దీంతో పాటు డిమాండ్‌ బాగా ఉన్న పలు దుకాణాలకు దరఖాస్తుదారులు రింగ్‌గా మారారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

Updated Date - 2023-01-24T23:54:54+05:30 IST