‘గోళ్లపాడు’ పార్కులకు తెలంగాణ వైతాళికుల పేర్లు
ABN , First Publish Date - 2023-01-24T23:40:24+05:30 IST
ఒకప్పుడు మురికికూపంగా ఉన్న గోళ్లపాడు ఛానెల్‌ను ఆధునికీకరించి ఏర్పాటు చేస్తున్న పార్కులకు తెలంగాణ వైతాళికుల పేర్లు పెడుతున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.

11కిలోమీటర్ల మేర ఛానెల్‌పై 10 పార్కుల ఏర్పాటు
ప్రజలకు ఆహ్లాదం పంచేలా తీర్చిదిద్దుతున్నాం
ఆధునికీకరణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
ఖమ్మంకార్పొరేషన, జనవరి 24 : ఒకప్పుడు మురికికూపంగా ఉన్న గోళ్లపాడు ఛానెల్‌ను ఆధునికీకరించి ఏర్పాటు చేస్తున్న పార్కులకు తెలంగాణ వైతాళికుల పేర్లు పెడుతున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి ఆ ఛానెల్‌పై జరుగుతున్న ఆధునికీకరణ పనులు, పార్కుల నిర్మాణాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఒకప్పుడు వ్యర్థాలు, మురుగునీటితో కంపుకొట్టిన ఈ గోళ్లపాడు ఛానెల్‌ను ఆధునికీకరిస్తున్నామని, ఇందులో మొత్తం 10పార్కులు నిర్మిస్తున్నామని, ఇప్పటికే వాటిలో ఐదు పూర్తయ్యాయన్నారు. ఈ పార్కులకు రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ వైతాళికులు ఫ్రొఫెసర్ జయశంకర్ సార్, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్‌బాపూజీ, మంచికంటి రాంకిషనరావు, మహమ్మద్ రజబ్అలీ, వనజీవి రామయ్యకు సముచిత గౌరవమిస్తూ వారి పేర్లు పెట్టామన్నారు. ఈ చానెల్ ఆధునికీకరణ పనులతో త్రీ టౌన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, దీంతో గతంలో ఇక్కడ ఉండేందుకు ఇష్టపడని వారు.. ఇప్పుడు చిన్న స్థలం ఉంటే చాలని కొనేందుకు పోటీ పడుతున్నారన్నారు. ఆధునీకరణ పనులతోపాటే పార్కుల్లో బాస్కెట్ బాల్, షటిల్, మెగా చెస్‌బోర్డు, ేస్కటింగ్ రింక్స్, గ్రీనరీ, చిల్డ్రన్స్ పార్క్స్, ఆట వస్తువులు, పంచతత్వ పార్క్, ఫౌంటైన్స్, వాకింగ్ ట్రాక్స్, తాగు నీరు, ప్రజా మరుగుదొడ్లు, ఆకర్షణీయమైన ముఖద్వారాలు, పట్టణ ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణం, ఓపెన్ జిమ్‌లు తదితర వసతులను కల్పించి ప్రజలకు ఆహ్లాదం పంచనున్నామన్నారు. త్వరలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ పార్కులను ప్రారంభిస్తామన్నారు. సుమారు 11కిలోమీటర్ల మేర ఉన్న గోళ్లపాడుఛానల్ కింద భారీ పైప్లైన్లు వేసి అండర్‌గ్రౌండ్ వ్యవస్థ ద్వారా నగరంలోని వాన, మురుగు నీరు మున్నేరులో కలిసేలా ప్రణాళికలు చేసి పూర్తి చేశామన్నారు. దీనితో వాననీటితో మున్నేరు ఒడ్డున సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌ను(ఎ్‌సటీపీ) నెలకొల్పి అక్కడ నీరుశుద్ధి చేసి నగర ప్రజలు అందించే అద్భుత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్‌సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ఈఈ రంజిత్‌కుమార్, అర్బన తహసీల్దార్ శైలజ, పలువురు కార్పొరేటర్లు, నాయకులున్నారు