దొరకునా.. ఇటువంటి సేవ

ABN , First Publish Date - 2023-01-25T23:10:41+05:30 IST

రామదాసు జయంతిని పురస్కరించుకొని ముందుగా గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణంలోని రామదాసు విగ్రహానికి అర్చక స్వాములు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.

దొరకునా.. ఇటువంటి సేవ
భక్తరామదాసుకు పూజలు నిర్వహిస్తున్న వైదిక సిబ్బంది

భద్రాద్రిలో ఘనంగా వాగ్గేయకారోత్సవాలు ప్రారంభం

కన్నుల పండువగా శోభాయాత్ర

‘యధార్థ రామాయణం హరికథ’ పుస్తక ఆవిష్కరణ

భద్రాచలం, జనవరి 25: భద్రాచల పుణ్యక్షేత్రంలో భక్తరామదాసు జయంతి ప్రయుక్త వాగ్గేయకారోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తరామదాసు చిత్రపటంతో శోభాయమానంగా శోభాయాత్ర సాగింది. స్థానిక చిత్రకూట మండపంలో ఈ ఉత్సవాలు ప్రారంభం కాగా ఈ సందర్భంగా మల్లాది సూరిబాబు, మల్లాది బ్రదర్స్‌ పర్యవేక్షణలో భద్రాచల రామదాసు నవరత్న కీర్తనలతో వందలాదిమంది సంగీత కళాకారులు భక్తరామదాసుకు నీరాజనం పలికారు. 29వరకు ఈ వాగ్గేయకారోత్సవాలను భద్రాచలం దేవస్థానం, హైదరాబాద్‌కు చెందిన శ్రీచక్రా సిమెంట్స్‌, నేండ్రగంటి అలివేలు మంగ, సర్వయ్య చారిటబుల్‌ ట్రస్టు, విశాఖపట్నం నాధసుధా తరంగిణి కల్చరల్‌ ట్రస్టు, విజయవాడ సామగాన లహరి కల్చరల్‌ ట్రస్టుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

పంచామృతాలతో రామదాసుకు అభిషేకం

రామదాసు జయంతిని పురస్కరించుకొని ముందుగా గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణంలోని రామదాసు విగ్రహానికి అర్చక స్వాములు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అంతకు ముందు మూలవరులకు రామదాసు పేరిట ప్రత్యేక అష్టోత్తరం నిర్వహించారు. అనంతరం భక్తరామదాసు చిత్రపటంతో గిరిప్రదిక్షణ నిర్వహించి ముందుగా విస్తాకాంప్లెక్స్‌ వద్ద ఉన్న తూము నరసింహాదాసు, కల్యాణ మండపం వద్ద ఉన్న భక్తరామదాసు విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంగీత కళానిధి డా.నేదునూరి కృష్ణమూర్తి, మల్లాది సోదరులు రూపొందించిన నవరత్న కీర్తనలను సంగీతకళాకారులు ఆలపించారు. ఒక్కొక్క కీర్తన ముగిసిన అనంతరం స్మామివారికి ప్రత్యేకహారతిని సమర్పించారు. డా. మల్లాది రవికుమార్‌ రూపొందించిన ‘యదార్థ రామాయణం హరికథ’ పుస్తకాన్ని ప్రముఖ సంగీత విద్వాంసులు మల్లాది సూరిబాబు, శ్రీచక్రా సిమెంట్స్‌కు చెందిన నేండ్రగంటి కృష్ణమోహన, భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీ, చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్య రంగరాజన, దేవస్థానం ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు ఆవిష్కరించారు. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి భద్రాచల రామదాసు కీర్తనలకు విశేష ప్రాచుర్యం తెచ్చారని భక్తరామదాసు జయంతి ఉత్సవంలో పాల్గొన్న ప్రముఖ సంగీత కళాకారులు మల్లాది సూరిబాబు, శ్రీరామ్‌కుమార్‌, రవికుమార్‌ తదితరులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో బి.శివాజీ దంపతులు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన, ఏఈవోలు శ్రవణ్‌కుమార్‌, భవానీరామకృష్ణారావు, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్‌, నిరంజనకుమార్‌, భక్తరామదాసు వారసులు కంచర్ల శ్రీనివాసరావు, శ్రీ చక్రా సిమెంట్స్‌ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన, విజయకుమార్‌, వ్యాఖ్యాత పన్నాల విజయనరసింహ ప్రభాకర శర్మ పాల్గొన్నారు.

నేలకొండపల్లిలోనూ ఘనంగా జయంత్యుత్సవాలు

నేలకొండపల్లి : భక్తరామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలో భక్తరామదాసు జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత బుధవారం ఉదయడం భక్తరామదాసు ధ్యాన మందిరంలో గోపూజ, అనంతరం నగర సంకీర్తన నిర్వహించారు. ధ్యానమందిరం వద్ధ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, ఖమ్మం కలెక్టర్‌ పీవీ గౌతమ్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ భక్తరామదాసు ధ్యాన మందిరం అభివృద్ధికి సుమారు రూ.కోటి వరకు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ పంచాయతీలకు ప్రకటించిన రూ.10కోట్లలో కొంతమొత్తం ధ్యాన మందిరం అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకుంటానన్నారు. కలెక్టర్‌ గౌతమ్‌ మాట్లాడుతూ నేలకొండపల్లిలో కొత్త ఆడిటోరియం నిర్మాణాన్ని నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది రామదాసు జయంత్యుత్సవాలు కొత్త ఆడిటోరియంలోనే నిర్వహించాలన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి భక్తరామదాసు సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌ వద్ద ఉన్న భక్తరామదాసు విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో నేలకొండపల్లి సర్పంచ్‌ రాయపూడి నవీన్‌, జడ్పీ ఉపాధ్యక్షురాలు మరికంటి ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:11:35+05:30 IST