బొగ్గుట్ట బీఆర్‌ఎ్‌సలో ‘అవిశ్వాస’ చిచ్చు

ABN , First Publish Date - 2023-02-07T01:14:44+05:30 IST

బొగ్గుట్టగా పేరున్న ఇల్లెందు బీఆర్‌ఎ్‌సలో వర్గ విబేధాలు తారస్థాయికి చేరా యి. ఆ వివాదాలు చినికిచినికి గాలివానగా మారి.. ఏకంగా మునిసిపల్‌ చైర్మన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ)పై అవిశ్వాస తీర్మానానికి దారితీశాయి.

బొగ్గుట్ట బీఆర్‌ఎ్‌సలో ‘అవిశ్వాస’ చిచ్చు
కొత్తగూడెం కలెక్టర్‌ కార్యాలయంలో ధర్నా చేస్తున్న ఇల్లెందు కౌన్సిలర్లు

ఇల్లెందు, ఫిబ్రవరి6: బొగ్గుట్టగా పేరున్న ఇల్లెందు బీఆర్‌ఎ్‌సలో వర్గ విబేధాలు తారస్థాయికి చేరా యి. ఆ వివాదాలు చినికిచినికి గాలివానగా మారి.. ఏకంగా మునిసిపల్‌ చైర్మన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ)పై అవిశ్వాస తీర్మానానికి దారితీశాయి. ఆయనపై అవిశ్వాసం ప్రకటిస్తూ మునిసిపాలిటికి చెందిన 15మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన నోటీసును సోమవారం కలెక్టర్‌ అనుదీ్‌పకు అందించడంతో ఆ చిచ్చు తీవ్రమైంది. తీర్మానంపై సిలివేరు అనిత, వాంకుడోత తార, చేరుపల్లి శ్రీనువాస్‌, తోట లలితశారద, పత్తిస్వప్న, పాబోలు స్వాతి, చీమల సుజాత, సందా బిందు, కొండపల్లి సరిత, శ్యామల మాధవి, కొక్కు నాగేశ్వరరావు, గిన్నారపు రజిత, కడకంచి పద్మ, మొగిలిలక్ష్మి, కుమ్మరి రవీందర్‌ సంతకాలు ఉండగా.. కలెక్టర్‌కు నోటీసు అందించిన వారిలో మొగిలిలక్ష్మి, రవీందర్‌ లేరు. అంతేగాక తాము అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేయలేదని, గతంలో వార్డుల్లో అభివృద్ధి పనులకోసం కౌన్సిలర్ల ఉమ్మడి వినతిపత్రంపై మాత్రమే సంతకాలు చేశామని వారు ఇల్లెందులో విలేకరుల ఎదుట పేర్కొన్నారు. అయితే కౌన్సిలర్ల మధ్య కొద్ది నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు భగ్గుమంటుండటం, రెండు రోజులుగా అవిశ్వాస ప్రయత్నాలు చేస్తుండటం, ఒక్కో కౌన్సిలర్‌కు రూ.10లక్షల చొప్పున ఆఫర్లు లాంటి విషయాలపై ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం కథనాన్ని ప్రచురించింది. అయితే కొద్ది నెలలుగా నెలకొన్న బీఆర్‌ఎ్‌సలోని ఇరువర్గాల కౌన్సిలర్ల మధ్య విబేధాలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ పలుమార్లు కౌన్సిలర్లను సమావేశపరిచినా ఫలితం లేకుండా పోయింది. పైగా మునిసిపల్‌ వైస్‌ చైర్మన జానీపాషా, చైర్మన డీవీ భూముల వివాదాలను తెరపైకి తేవడం, మహిళా కౌన్సిలర్లను కించపరుస్తున్నారంటు ఆరోపణలు చేయడంతో ఆ విబేధాలు మరింత ముదిరాయి. రెండు రోజులుగా అవిశ్వాసంపై ప్రచారం జరగుతున్నా బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం స్పందించకపోవడంతో ముసలం మరింత పెరిగిందన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలపై చర్చించి సమస్యను పరిష్కరించేందుకు మంగళవారం ఇరువర్గాల కౌన్సిలర్లు హైదరాబాద్‌ రావాలని ఎమ్మెల్యే హరిప్రియ ఆహ్వానించారు. ఇప్పటికే బీఆర్‌ఎ్‌సపై ధిక్కారస్వరం వినిపించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయసమ్మేళనాలు నిర్వహిస్తూ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో.. ఇల్లెందు మునిసిపల్‌ వ్యవహారం బీఆర్‌ఎ్‌సలో తీవ్రదుమారం రేపుతోంది.

డబ్బు సంచులతో ఇల్లిల్లు తిరుగుతూ.

డీవీపై అవిశ్వాసానికి సహకరించాలని కోరుతూ కొందరు షాడో కౌన్సిలర్లు, ఒక ప్రముఖ వ్యాపారి ఆదివారం రాత్రంతా ఇల్లిల్లు తిరిగారని, రూ.10లక్షల ఆఫర్‌లో భాగంగా తొలుత రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు పంపకాలు చేశారని, కొందరు కౌన్సిలర్లు తమకు ఇష్టం లేదని చెప్పినా బేరాలాడారని సమాచారం. వారు ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు డబ్బుమూటలతో పట్టణంలో తిరిగారని, ఓ కౌన్సిలర్‌ పాల్వంచలో తమ బంధువుల వివాహనికి వెళ్లగా అక్కడికీ వెళ్లి మరీ మద్దతు కోరారని తెలిసింది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల కౌన్సిలర్ల మద్దతు కోసం ప్రయత్నించగా.. ఫలించలేదని తెలిసింది.

పాపపు సొమ్ము వద్దన్నా : మొగిలి లక్ష్మి

ఇల్లెందుటౌన్‌ : చైర్మనపై అవిశ్వాసానికి సంతకం చేస్తే రూ.10లక్షలు ఇస్తామని కొందరు తమ ఇంటికి వచ్చారని, ఆ పాపపు సొమ్ము వద్దని తిరస్కరించామని 20వవార్డు కౌన్సిలర్‌ మెగిలిలక్ష్మి సోమవారం ఓప్రకటనలో తెలిపారు. తాము అమ్ముడుపోమని చెప్పానని, తాను తీర్మానంపై సంతకం చేయకపోయినా చేసినట్టు ప్రచారం జరుగు తోందన్నారు. సీఎం ఇటీవల ప్రకటించిన రూ.25కోట్లలో ప్రతివార్డుకు రూ.25లక్షలు ఇవ్వాలంటూ చేసిన వినతిపత్రంలో చేసిన సంతకాన్ని తీర్మానానికి జతచేశారన్నారు.

ఇల్లెందు మునిసిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాసం!

కలెక్టర్‌కు తీర్మాన పత్రం అందజేసిన 11మంది కౌన్సిలర్లు

కొత్తగూడెం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6: ఇల్లెందు మునిసిపల్‌ చైర్మన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ)పై కొందరు కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సమష్టిగా నిర్ణయాలు తీసుకొని పట్టణాభివృద్దికి సహకరిస్తానని చెప్పిన డీవీ అందుకు భిన్నంగా ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడుతున్నారని, మహిళా కౌన్సిలర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం పలువురు కౌన్సిలర్లు కలెక్టర్‌ అనుదీ్‌పకు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. అయితే ఆ పత్రాన్ని తీసుకున్న కలెక్టర్‌.. తాము ఇచ్చిన లేఖను సీసీకి ఇచ్చారని, ఆ లేఖను తీసుకుని సీసీ అక్కడి నుంచి వెళ్లిపోయారని, దీంతో తమను కలెక్టర్‌ తమను మభ్యపెట్టే ప్రయత్నం చేశారంటూ కౌన్సిలర్లు కలెక్టరేట్‌ ఎదుట బైటాయించారు. ఈ సందర్బంగా వరు మాట్లాడుతూ మున్సిపల్‌ చైర్మన డీవీ మహిళా కౌన్సిలర్లను అపహాస్యం చేస్తూ, ప్రశ్నించిన కౌన్సిలర్లను బెదిరిస్తూ, బినామీ కాంట్రాక్టర్లతో టెండర్లువేసి కమీషన్లు దండుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నాడని ఆరోపించారు. జరగబోయే అభివృద్ధిపై ఎజెండా కానీ, కౌన్సిలర్లకు తెలియజేయకుండానే ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇలాంటి అక్రమ విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ కారణంగా మెజారిటీ కౌన్సిలర్లమంతా చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. దీనికి కలెక్టర్‌ వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. అయితే ఇల్లెందు మునిసిపాలిటీలో మొత్తం 24మంది కౌన్సిలర్లు ఉండగా.. అవిశ్వాసానికి 15మంది మద్దతు పలికారని సమాచారం. కానీ కలెక్టర్‌కు లేఖ ఇచ్చేందుకు వచ్చిన వారిలో 11మంది కౌన్సిలర్లున్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో 3,6,12,13,14,15,16,18,19,24,29 వార్డుల కౌన్సిలర్లు నాగేశ్వరరావు, శారద, అనిత, పద్మ, బింధు, సుజాత, రజిత, స్వాతి, స్వప్న, తార, సరిత ఉన్నారు.

Updated Date - 2023-02-07T01:14:45+05:30 IST