రుణమాఫీ ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2023-01-26T01:20:45+05:30 IST

రెండోసారి అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్‌ 2018 ఎన్నికల సందర్భంగా ప్రకటించింది.

రుణమాఫీ ఇంకెప్పుడు?

- ప్రభుత్వ సాయం వడ్డీకే చెల్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రెండోసారి అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్‌ 2018 ఎన్నికల సందర్భంగా ప్రకటించింది. ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా సర్కారు హామీు అమలుకు నోచుకోక పోవడంతో రుణమాఫీపై ఆశలు పెట్టుకున్న రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. పాత రుణం చెల్లించక, కొత్త రుణం లభించక మళ్లీ ప్రైవేట్‌ అప్పులవైపు ఎదురు చూడాల్సి వస్తోంది. విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేసిన సొమ్ము కాస్త వడ్డీ కిందికిపోయి అప్పు అప్పుగానే మిగలడమే కాకుండా నాలుగు సంవత్సరాల వడ్డీ అసలుకు సమానంగా పెరిగింది.

2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల పంట రుణాలన్నిటిని మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 36లక్షల 66వేల మంది రైతులకు సంబంధించిన 19,198 కోట్ల 38 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయాల్సి ఉం టుందని అంచనా వేసింది. అయితే ఆ తర్వాత ఏమను కుందో ఏమో కానీ ఏకమొత్తంగా కాకుండా విడతల వారిగా రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 2020 సంవత్సరం లో 25 వేల వరకు ఉన్న పంట రుణాలను, 2021లో 25 నుంచి 50వేల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు విడుదల చేసింది. 2021 ఆగస్టు మాసంలో రెండో విడత రుణమాఫీని చేసిన ప్రభుత్వం 2022లో మూడో విడత, నాల్గవ విడత రుణాలను మాఫీ చేసే విషయాన్ని పట్టించుకోలేదు.

జిల్లాలో 50 వేల నుంచి లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు 70,353 మంది

దీంతో 2018-19లో రైతులు తీసుకున్న లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాలన్నీ బకాయిలుగా మారిఫోయాయి. జిల్లాలో లక్ష వరకు పంట రుణాలు తీసుకున్న రైతులు 91,991 మంది ఉన్నారు. వీరికి సుమారు 500 కోట్ల రూపాయలు మాఫీ అవుతాయని లెక్కలు వేశారు. 2020లో రూ. 25 వేల వరకు పంట రుణాలు తీసుకున్న 6,538 మంది రైతులకు రూ. 9 కోట్ల 75 లక్షలు మాఫీ చేశారు. ఆ తర్వాత 2021 ఆగస్టులో రూ. 50 వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేశారు. 15,100 మంది రైతులకు సంబంధించిన రూ. 52 కోట్ల రుణాలు ఈ దఫాలో మాఫీ కావలసి ఉండగా అందులో కూడా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న 70,353 మంది రైతులు రుణమాఫీ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరి రుణాలు మాఫీ కావాలంటే ప్రభుత్వం సుమారు 400 నుంచి 420 కోట్ల రూపా యల వరకు విడుదల చేయాల్సి ఉన్నది.

డిఫాల్టర్లుగా రైతులు

ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో అప్పులు చెల్లించకుండా ఉండి రైతులు డిఫాల్టర్లుగా మారిపోయి మరో రుణం పొందడానికి అర్హత కోల్పోతూ ఆందోళన చెందుతున్నారు. తాము రుణం చెల్లిస్తే ప్రభుత్వ రుణమాఫీ నిధుల విడుదల చేసిన సందర్భంలో తమకు రాకుండా పోతా యని భావించిన రైతులు రుణాలను పెండింగ్‌లో ఉంచడంతో వడ్డీలు పెరిగి తడిసిమోపడవుతున్నాయి. మాఫీ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు లక్ష రూపాయల అప్పు వడ్డీతో కలిసి లక్షన్నర వరకు పెరిగింది. ఎన్నికలు జరుగడానికి పది నెలల కాలం మిగిలి ఉండగా ముందుగానే ఎన్నికలు జరుగవచ్చనే వార్తలు వస్తున్నాయి.

రాజకీయ పరిస్థితులు ఇలా ఉండగా ప్రభుత్వం మాత్రం మిగిలి ఉన్న రెండు విడతల రుణమాఫీ వ్యవహారాన్ని ఎప్పుడు పూర్తి చేస్తుందో వెల్లడించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఊహించని విధంగా ఎన్నికలు వస్తే రుణ మాఫీ జరుగకుండా పోయి అప్పుమొత్తం చెల్లించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసి ఎన్నికల హామీని నిలుపుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కారణం గానే తాము అప్పు చెల్లించకుండా ఉండి అదనపు వడ్డీభారాన్ని మోయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించకపోతే అప్పోసప్పో చేసి ముందే రుణాలు చెల్లించుకునే వారమని, అప్పుడు ఈ అదనపు వడ్డీ భారం తమపై పడేది కాదని, బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్లుగా మిగిలి పోకుండా ఉండేవారమని వాపోతున్నారు.

Updated Date - 2023-01-26T01:20:45+05:30 IST