సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2023-02-07T01:25:07+05:30 IST

ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసింది.

సంక్షేమానికి పెద్దపీట

- మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 3 వేలకు పెంపు

- క్రమబద్ధీకరణపై కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు

- ఏప్రిల్‌ నుంచి క్రమబద్ధీకరిస్తామని ప్రకటన

- రాష్ట్ర బడ్జెట్‌పై నేతల భిన్నాభిప్రాయాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమ శాఖలకు పెద్దఎత్తున కేటాయింపులు చేసిన ప్రభుత్వం ప్రత్యేకించి దళితబంధు, రైతుల రుణమాఫీకి నిధులకు కేటాయించడం గమనార్హం. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు ఇస్తామని, అందులో నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లు, సీఎం కోటా కింద 25 వేల ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో పేద, మధ్య తరగతి వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతామని, వచ్చే ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్ధీకరిస్తామని, సెర్ప్‌ ఉద్యోగుల వేతన స్కేల్‌ను సవరిస్తామని ప్రకటించడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. గత ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ బడ్జెట్‌లో కూడా బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడంతో నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బడ్జెట్‌లోనూ ప్రభుత్వం అంకెల గారడీని ప్రదర్శిస్తున్నదని, ఇది బడాయి బడ్జెట్‌ తప్ప చేతల బడ్జెట్‌ కాదని ప్రతిపక్షాలు, అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతను ఇస్తూ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అని బీఆర్‌ఎస్‌ది చేతల ప్రభుత్వమని అధికార పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఈ బడ్జెట్‌లో జిల్లాకు సంబంధించి ప్రత్యేక కేటాయింపులు ఏమి లేకపోవడం గమనార్హం. సోమవారం రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అసెంబ్లీలో 2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి పద్దులు సమానంగానే పెట్టారు. బీసీల సంక్షేమానికి రూ. 6,229 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ. 36,750 కోట్లు, గిరిజనుల సంక్షేమానికి రూ. 15,233 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ. 2,200 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ. 12 వేల కోట్లు, వ్యవసాయానికి రూ. 26,831 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ. 26,885 కోట్లు, దళితబంధు పథకానికి రూ. 17,700 కోట్లు, విద్యా శాఖకు రూ. 19,093 కోట్లు, వైద్య శాఖకు 12,161 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ. 31,426 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 11,372 కోట్లు కేటాయించారు. రైతుల రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు, సొంత ఇంటి నిర్మాణాలకు రూ. 7,890 కోట్ల పద్దు పెట్టారు.

- సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు..

సొంత ఇంటి నిర్మాణానికి మూడ లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించడంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రతీ నియోజకవర్గానికి రెండు వేల ఇళ్ల చొప్పున, ముఖ్యమంత్రి కోటా కింద 25 వేల ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో పెద్దపల్లి జిల్లాలో ఈ ఏడాది ఆరు నుంచి ఏడు వేల ఇళ్ల వరకు మంజూరయ్యే అవకాశాలున్నాయి. అయితే గత బడ్జెట్‌లోనూ సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కానీ అమలు చేయలేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయించిన మేరకు ఈసారైనా ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. దళితబంధు పథకాన్ని కొనసాగించేందుకు గానూ 17,700 కోట్లు కేటాయించిన ప్రభుత్వం నియోజకవర్గానికి 1,100 యూనిట్లను కేటాయించారు. ఇప్పటి వరకు మొదటి విడత కింద నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం రెండో విడత కింద 500 యూనిట్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. బడ్జెట్‌లో 1100 చొప్పున యూనిట్లు కేటాయించినప్పటికీ, అమలు చేస్తేనే దళితుల కల ఫలించనున్నది. మధ్యాహ్నా భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనం కింద నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తుండగా, దీనిని మూడు వేల రూపాయల రూపాయలకు పెంచుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించి ఏడాది గడుస్తున్నది. కానీ ఇంత వరకు అమలు చేయలేదు. మళ్లీ బడ్జెట్‌లో మూడు వేలు ఇస్తామని ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.

Updated Date - 2023-02-07T01:25:11+05:30 IST