వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-02-07T00:52:49+05:30 IST

అధికారులు వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు అన్నారు.

వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి
ఈఆర్సీ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో తన్నీరు శ్రీరంగారావు

గనేశ్‌నగర్‌, ఫిబ్రవరి 6: అధికారులు వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు అన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం విద్యుత్‌ వినియోగదారులతో ఈఆర్సీ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారులు సమస్యలు పరిష్కరించకపోతే సీజీఆర్‌ఎఫ్‌కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేస్తే వారు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారని, సమస్యకు బాధ్యులైన అధికారికి జరిమానా విధిస్తారని చెప్పారు. విద్యుత్‌ వినియోగదారులతో ఉద్యోగులు మర్యాదగా మాట్లాడాలని సూచించారు. రైతులు ఆటోమెటిక్‌ స్టార్టర్లు తొలగించి కెపాసిటర్లు బిగించుకోవాలన్నారు. యాసంగిలో పంటలు ఎండకుండా అధికారులు విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. డీటీఆర్‌ల వద్ద మీటర్లు బిగించాలని, అదేవిధంగా ట్రాన్స్‌ ఫార్మర్స్‌ కాలిపోతే సంస్థ డబ్బులతోనే రిపేర్‌ చేసి బిగించాలన్నారు. వినియోగదారుడు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా అక్‌నాలెడ్జ్‌మెంట్‌ ఇచ్చే వ్యవస్థను విద్యుత్‌ అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈఆర్సీ ముద్రించిన విద్యుత్‌ పంపిణీదారుల పని తీరు-ప్రమాణాలు అనే పుస్తకం ప్రతీ విద్యుత్‌ అధికారి, ఉద్యోగి చదవాలని సూచించారు. వినియోగదారులు పొదుపుగా విద్యుత్‌ను, నీటిని వినియోగించాలని సూచించారు. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటల పాటు సరఫరా చేయాలని ఆదేశించినా, పీక్‌ అవర్స్‌లో విద్యుత్‌ వద్దంటూ రైతు సంఘాల నాయకుల చేసి సూచన మేరకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. ఏసీడీ చార్జీలకు, ప్రభుత్వానికి సంబంధంలేదని, ఈఆర్సీ అనుమతితోనే పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్నాయన్నారు. ముందస్తుగా నోటీసు ఇవ్వకపోవడం పంపిణీ సంస్థల తప్పేనని స్పష్టం చేశారు. ఏసీడీ చార్జీలు వసూలు చేయడానికి నెల ముందు ఇంటి యజమానికి నోటీసులు ఇవ్వాలన్నారు. వినియోగదారులకు విద్యుత్‌ శాఖ సిబ్బంది మర్యాద ఇవ్వకపోతే 040-23311127 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌ సత్యనారాయణగౌడ్‌, భారతీయ కిసాన్‌ సంఘ్‌ ప్రతినిధి జోగినిపల్లి సంపత్‌రావు, పారిశ్రామిక వేత్త సామల రవికుమార్‌, కార్మిక నాయకుడు పొలాల కిశోర్‌, కార్పొరేటర్లు పేద్దపల్లి జితేందర్‌, గంట కళ్యాణి శ్రీనివాస్‌, నేతికుంట యాదయ్య, గంద మాధవి మహేశ్‌, చాడ బుచ్చిరెడ్డి, భూమాగౌడ్‌, అర్నకొండకు చెందిన కె అనిత, చెర్లబూత్కూర్‌ ఎంపీటీసీ బుర్ర తిరుపతిగౌడ్‌, బీసీ నాయకులు రాచకొండ సత్యనారాయణ, దేశారాజ్‌ల్లికి చెందిన సత్యనారాయణరెడ్డి, భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు పి సంజీవరెడ్డి, సర్పంచ్‌లు డాక్టర్‌ రామకృష్ణ, మేఘరాజు, రేక కొమురయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:52:53+05:30 IST