వేతన జీవులకు ఊరట.. ఉపాధిహామీకి కోతలు

ABN , First Publish Date - 2023-02-02T01:10:59+05:30 IST

కేంద్ర బడ్జెట్‌ వేతన జీవులకు ఊరటనిచ్చింది.

వేతన జీవులకు ఊరట.. ఉపాధిహామీకి కోతలు

- వ్యవసాయానికి తగ్గిన కేటాయింపులు

- సింగరేణికి రూ.1650 కోట్ల బడ్జెట్‌

- కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కేంద్ర బడ్జెట్‌ వేతన జీవులకు ఊరటనిచ్చింది. ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చేందుకు పరిమితిని 5 నుంచి 7లక్షలకు పెంచి వేతన జీవులకు ఊరటను కల్పించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు భరోసా కల్పించలేకపోయారు. ఆ పథకానికి గత ఏడాది కంటే బడ్జెట్‌లో 13 వేల కోట్ల రూపాయలు కేటాయింపులు తగ్గించడంతో ఆయా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద బడ్జెట్‌ పెంచినప్పటికీ, ఆ పథకం ఫలాలు రాష్ట్ర ప్రజలకు ఇప్పటివరకు అందకపోవడం విచారకరం. సింగరేణి సంస్థ ప్రతి ఏటా ప్రకటించే వార్షిక బడ్జెట్‌నే కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్‌లో సింగరేణికి 1650 కోట్లు కేటాయించామని ప్రకటించడం విమర్శలకు దారితీస్తున్నది. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 45.03 లక్షల కోట్ల రూపాయలతో పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌ ద్వారా జిల్లాకు ప్రత్యేకించి కేటాయింపులు లేకపోవడం గమనార్హం. మున్నెన్నడూ లేని విధంగా రైల్వేకు అత్యధిక ప్రాధానం ఇచ్చారు. గత ఏడాది 77,271కోట్లు కేటాయించగా, ప్రస్తుతం 2.41లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. తద్వారా రామగుండం నుంచి మణుగూర్‌ వరకు ప్రతిపాదించిన రైల్వేలైన్‌కు బడ్జెట్‌ కేటాయించే అవకాశాలు ఉండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాఽధిహామీ పనులకు వెళ్లే కూలీలకు భరోసా కల్పించలేదు. ఉపాధిహామీ పథకానికి గత ఏడాది 73 వేల కోట్లు కేటాయించి 89,400 కోట్లు వెచ్చించారు. దీనిని దృష్టిలో పెట్టుకోకుండా 60వేల కోట్లకు తగ్గించడం విమర్శలకు దారితీస్తున్నది. రైతులకు 20వేల కోట్ల రుణాలు ఇస్తామని ప్రకటించడంతో పాటు శ్రీఅన్న పథకం ద్వారా చిరు, తృణ ధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. పరపతి సంఘాలను డిజిటలైజేషన్‌ చేయడంతో పాటు మత్స్యసంపదను పెంపొందించేందుకు ప్రత్యేకించి 6వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. మహిళలు, బాలికల కోసం సమ్మాన్‌ బచత్‌ పత్రం పథకాన్ని తీసుకవచ్చారు. ఈ పథకం రెండేళ్ల వరకు ఉంటుంది. రూ.2లక్షల వరకు డిపాజిట్‌ చేసుకునే అవకాశం కల్పిస్తూ 7.5శాతం స్థిరవడ్డీని అందించనున్నారు. ఈ పథకం మహిళలకు ప్రయోజనం చేకూర్చనున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలకు పెంచడంతో మధ్య తరగతి ఉద్యోగులకు పన్ను నుంచి మినహాయింపు పొందనున్నారు. జిల్లాలో అనేక మందికి తద్వారా లాభం చేకూరనున్నది. పన్ను స్లాబ్‌లను కూడా ఐదింటికి తీసుకవచ్చారు. పీఎం ఆవాస్‌ యోజన పథకానికి 48 వేల కోట్ల నుంచి 79 వేల కోట్లకు బడ్జెట్‌ పెంచారు. ఈ పథకం ద్వారా 2.67 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అయితే ఈ పథకం రాష్ట్రంలో ప్రత్యక్షంగా అమలుకావడం లేదు. దీని ఫలాలు ఎవరికి అందకపోవడంతో ఇళ్ల నిర్మాణాలపై పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలవుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌పై వివిధ పార్టీలకు చెందిన నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే..

ఫ అన్ని వర్గాలకు ఊరటనిచ్చేది..

- గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ, మాజీ ఎమ్మెల్యే

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాలకు ఊరటనిచ్చేలా ఉంది. వేతన జీవులకు ఆదాయ పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచడం మధ్య తరగతి ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రుణాలను పెంచారు. తృణ ధాన్యాలు, చిరుధాన్యాలు పండించే వారికి ప్రోత్సహకాలు ప్రకటించారు. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. రైల్వేశాఖకు రూ.2.41 లక్షల కోట్లు అత్యధికంగా కేటాయించారు. సింగరేణి సంస్థకు రూ. 1650 కోట్లు, బీబీనగర్‌ ఎయిమ్స్‌, గిరిజన యూనివర్శిటీలకు బడ్జెట్‌ కేటలాయించడం హర్షణీయం. టీవీలు, సెల్‌ఫోన్‌లు, కెమెరాల ధరలు తగ్గడం వల్ల సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి రానున్నది.

ఫ ఉపాధిహామీలో కోతలు

- సీహెచ్‌ విజయరమణారావు, కాంగ్రెస్‌, మాజీ ఎమ్మెల్యే

గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఆశాదీపంలా ఉన్న యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో కోతలు విధించడం అన్యాయం. కార్పొరేట్‌ సంస్థలపై ఉన్న ప్రేమ పేదలపై లేకపోవడం ఇందుకు నిదర్శనం. వేతన జీవులకు ఊరట కలిగించినప్పటికీ, వ్యవసాయరంగానికి బడ్జెట్‌ కేటాయింపులు తగ్గిపోవడం విచారకరం. నిరుద్యోగ సమస్యలను రూపుమాపేందుకు చర్యలు లేకపోవడం, విద్యా, వైద్య రంగానికి కేటాయింపులు తగ్గడం వల్ల పేదలకు ఒనగూరేదేమి లేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా పెద్ద ఎత్తున బడ్జెట్‌ కేటాయిస్తున్నామని చెబుతున్న కేంద్రం ఆ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసింది లేదు. బడ్జెట్‌ అంతా అంకెల గారడీయే. వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బడ్జెట్‌ను రూపొందించారు.

ఫ ఏ రంగానికి కూడా మేలు చేయనిది..

- ఈద శంకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌, మాజీ ఐడీసీ చైర్మన్‌

కేంద్ర బడ్జెట్‌ అంతా గందరగోళంగా ఉంది. ఏ రంగానికి కూడా మేలు చేసే విధంగా కనబడడం లేదు. ఎప్పటిలాగానే తెలంగాణపై వివక్షతను ప్రదర్శించింది. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు ప్రకటించకపోవడం విచారకరం. రైల్వే బడ్జెట్‌ను కూడా ఇందులోనే కలపడం వల్ల అయోమయానికి దారి తీస్తున్నది. ఉపాధిహామీ పథకం కేటాయింపుల్లో కోతలు విధించి కూలీలకు అన్యాయం చేశారు. ఎనిమిదేళ్లలో 157 మెడికల్‌ కళాశాలను ఏర్పాటుచేసిన కేంద్రం రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నర్సింగ్‌ కళాశాలలు అంటున్నారు. అందులో తెలంగాణ ఉంటాయో, ఉండవో తెలియని పరిస్థితి. పేద, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసే విధంగా బడ్జెట్‌ లేకపోగా అంకెల గారడిని తలపిస్తున్నది.

ఫ బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా ఉంది..

- తాండ్ర సదానందం, సీపీఐ జిల్లా కార్యదర్శి

కేంద్ర బడ్జెట్‌ బడా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేలా ఉంది. పేద, గ్రామీణ కూలీలు, నిరుద్యోగులు భరోసా కల్పించే విధంగా కేటాయింపులు లేవు. ద్రవ్యోల్బణం తగ్గింపు గురించి పరిష్కార మార్గాలు చూపలేదు. ఉపాఽధి హామీ పథకాన్ని నమ్ముకున్న కూలీల నోట్లో మట్టి కొడుతున్నారు. గత ఏడాది కంటే బడ్జెట్‌ను తగ్గించడాన్ని చూస్తే కేంద్రానికి పేదలపై ఎంత ప్రేమ ఉందో కనబడుతున్నది. ఇది పూర్తిగా పేద, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేక బడ్జెట్‌ అని, అంకెల గారడీ తప్ప మరేమి లేదు.

ఫ కార్పొరేట్లకు అనుకూలమైనది..

- ముత్యంరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది. దేశంలోని పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పన్నుల భారాలను మోపేదిగా ఉంది. ప్రజలకు అత్యంత అవసరమైన ఉపాధి, విద్య, వైద్య రంగాలకు సరిపడా కేటాయింపులు లేకపోవడం విచారకరం. దేశ సంపద సృష్టికర్తలు, ఉత్పత్తి వర్గాలైన రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల సమస్యలను ప్రస్తావించకుండా వారి అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు కేటాయింపులు లేవు. దేశ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తోడ్పడే విధంగా లేదు. పూర్తిగా తిరోగమన విధానాలతో బడ్జెట్‌ను రూపొందించారు.

Updated Date - 2023-02-02T01:11:03+05:30 IST