ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2023-01-26T00:46:02+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధం అయ్యింది. రెండు రోజులుగా జిల్లా కేంద్రంలో విద్యా శాఖ అధికారులు, సిబ్బంది ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు.

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధం
సర్టిఫికెట్ల పరిశీలన కోసం వచ్చిన ఉపాధ్యాయులు

- రెండు రోజులుగా కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన

- 27న షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధం అయ్యింది. రెండు రోజులుగా జిల్లా కేంద్రంలో విద్యా శాఖ అధికారులు, సిబ్బంది ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. ఈనెల 24, పీజీ హెచ్‌ఎంగా పదోన్నతి పొందేందుకు అర్హతగల స్కూల్‌అసిస్టెంట్‌ ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను, స్కూల్‌అసిస్టెంట్‌ ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు అర్హతగల ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను బుధవారం పరిశీలించారు. వీటి ఆధారంగా విద్యా శాఖాధికారులు సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ జీవోలు ఈనెల 27వ తేదీన వెలువడే అవకాశాలున్నాయని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు గత ఏడాది జీవో 317 ద్వారా స్థానికత ఆధారంగా ఆయా జిల్లాల నుంచి బదిలీపై వచ్చినవాళ్లు, ఇక్కడినుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు తమకు కూడా బదిలీలు చేపట్టాలని, కనీసం రెండేళ్ల సర్వీస్‌ నిబంధన నుంచి తమకు మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో సదరు ఉపాధ్యాయులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వీరికి అవకాశం కల్పిస్తే లీగల్‌ సమస్యలు తలెత్తవచ్చని రాష్ట్ర విద్యా శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చేపట్టనున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు, ఎవరు కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండేందుకు 27న రాత్రి షెడ్యూల్‌ విడుదల కావచ్చని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

ఫ జిల్లాలో 240 పోస్టులు ఖాళీ..

జిల్లాలో 2511 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 2271 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 240 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టుల్లో 148 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. తద్వారా ఖాళీ ఏర్పడే ఎస్జీటీ, పండిట్‌, పీఈటీ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎం గ్రేడ్‌ 1 పోస్టులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టులను వందకు వంద శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. మిగతా కేటగిరీ పోస్టుల్లో 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా, మిగతా పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నారు. పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు 8 ఏళ్ల నుంచి, బదిలీల కోసం ఐదేళ్ల నుంచి ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వతీరుపై ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారని గమనించిన ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. జిల్లాల వారీగా కేటగిరీలు, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను సిద్ధం చేస్తున్నారు. తమకు పదోన్నతి రావచ్చని భావిస్తున్న ఉపాధ్యాయులు రెండు రోజులుగా పెద్దపల్లిలో నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కనీసం రెండేళ్ల సర్వీస్‌ పూర్తిచేసి ఉండాలి. ఐదేళ్ల సర్వీస్‌ నిండిన జీహెచ్‌ఎంకు, ఎనిమిదేళ్లు నిండిన స్కూల్‌అసిస్టెంట్‌, ఇతర ఉపాధ్యాయులకు నిర్బంధ బదిలీ తప్పనిసరిగా ఉంటుంది. ఇతర ప్రభుత్వ శాఖల్లో బదిలీలను 20 శాతం నిర్వహిస్తారు. కానీ విద్యా శాఖలో మాత్రం అలాంటి నిబంధన ఏమీ ఉండదు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన జోన్లు, 95 శాతం స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టేందుకు గత ఏడాది జీవో 317ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ఆధారంగా చాలామంది ఉపాధ్యాయులు పెద్దపల్లి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు, ఇతర జిల్లాల నుంచి అంతే మొత్తంలో ఉపాధ్యాయులు వచ్చారు. అయితే వాళ్లంతా తమకు కూడా బదిలీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బదిలీ ఉత్తర్వుల ప్రకారం కనీసం రెండేళ్ల సర్వీస్‌ నిండినవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆ నిబంధనను తమ కోసం తాత్కాలికంగా సడలించాలని సదరు ఉపాధ్యాయులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేనట్లుగా కనబడుతున్నది. గతంలో వలే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశాలు లేవని తెలుస్తున్నది. ముందుగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను, ఖాళీ స్థానాల జాబితాలను విడుదల చేయనున్నారు. దానిని అనుసరించి ఉపాధ్యాయుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించి షెడ్యూల్‌ ప్రకారం బదిలీలు, పదోన్నతులు చేపట్టవచ్చని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2023-01-26T00:46:02+05:30 IST