పకడ్బందీగా మహాశివరాత్రి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-01-26T00:44:01+05:30 IST

మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు.

    పకడ్బందీగా మహాశివరాత్రి ఏర్పాట్లు
ఏర్పాట్లు పరిశీలిస్తున్న దేవాదాయ కమిషనర్‌ అనిల్‌కుమార్‌

- భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

- రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌

వేములవాడ, జనవరి 25: మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన ఆలయం, ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ధర్మగుండం, కల్యాణకట్ట, వసతి గదులు, అన్నదాన సత్రం, గుడి చెరువు ఆవరణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ వేములవాడ రాజరాజేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 17, 18, 19వ తేదీల్లో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం 3.70 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాట్లు చేపట్టామన్నారు. గతంలో ఎదురైన అనుభవాలను దృష్ట్యా పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, మహాశివరాత్రి రోజున సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌, ఈఈ రాజేశ్‌ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Updated Date - 2023-01-26T00:44:07+05:30 IST