ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదు

ABN , First Publish Date - 2023-02-07T00:48:09+05:30 IST

‘సదరం సర్టిఫికేట్ల కోసం దివ్యాంగులైన వృద్ధులు, మహిళలు, యువకులు, చిన్నపిల్లలు వచ్చి ఎక్కడ పరీక్షలు చేసి సరిఫికేట్లు ఇస్తారో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. డబ్బులు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడుతున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలకు దివ్యాంగులనే మానవత్వం లేదు.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు’ అని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అన్నారు.

ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదు
జడ్పీటీసీలు, అధికారులతో మాట్లాడుతున్న కనుమల్ల విజయ

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 6: ‘సదరం సర్టిఫికేట్ల కోసం దివ్యాంగులైన వృద్ధులు, మహిళలు, యువకులు, చిన్నపిల్లలు వచ్చి ఎక్కడ పరీక్షలు చేసి సరిఫికేట్లు ఇస్తారో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. డబ్బులు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడుతున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలకు దివ్యాంగులనే మానవత్వం లేదు.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు’ అని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అన్నారు. సోమవారం జడ్పీ చైర్‌పర్సన్‌ కార్యాలయంలో జరిగిన ఏడు స్థాయీ సంఘాల సమావేశాల్లో ఆమె పాల్గొని ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు జవాబుదారీగా పనిచేయాలని ఆదేశించారు. ఐదో స్థాయీ సంఘ సమావేశానికి అధ్యక్షురాలు పిట్టల కరుణ గైర్హాజరు కాగా జడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షత వహించారు. 1,2,3,4,6,7 స్థాయి సంఘాలకు చైర్మన్లుగా జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, ఉపాధ్యక్షుడు తేరాల గోపాల్‌రావు, మాచర్ల సౌజన్య వ్యవహరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ మాట్లాడుతూ హుజురాబాద్‌ ఆర్టీసీ డీఎంకు తాను ఫోన్‌ చేస్తే అయితే ఏంటీ.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని, తనతోనే ఇలా మాట్లాడితే ప్రయాణికులతో ఎలా వ్యవహరిస్తారో తెలుస్తోందని, ఆమెను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయండి... అని ఆర్టీసీ ఆర్‌ఎంను ఆదేశించారు. మిషన్‌ భగీరథ పైపులైన్లు పలిగిన చోట వాటికి మరమ్మతు చేసి వేసవిలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. చిన్నగౌడపల్లిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలివేయడంతో ఇళ్లులేని నిరుపేదలు గుడిసెల్లో ఇబ్బందులుపడుతున్నారని, వాటిని పూర్తయ్యేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు ఎన్ని కోట్లు బకాయిలను త్వరగా చెల్లించాలని సూచించారు.

జడ్పీ సీఈవో ప్రియాంక మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇష్టమైన పండ్ల మొక్కలను పంపిణీ చేయాలన్నారు. కేశవపట్నం జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ డీఈవోకు ఫోన్‌ చేస్తే ఎత్తరని, ఎప్పుడు కార్యాలయంలో ఉండరని, ఈ సమావేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సీఈవో ప్రియాంక స్పందిస్తూ వెంటనే డీఈవోకు నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. హర్యానా నుంచి తెచ్చిన గేదెల్లో కొన్ని పాలు ఇవ్వక పోవడంతో దళితబంధు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని జడ్పీటీసీలు తెలిపారు. సీఈవో ప్రియాంకకర్ణన్‌ మాట్లాడుతూ గేదెలు ఎందుకు పాలు ఇవ్వడం లేదో చూసి లబ్దిదారులకు అవగాహన కల్పించాలని పశుసంవర్థక శాఖ అధికారులకు సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్‌మెంట్‌ కమిటీ సమావేశాలను ఎందుకు నిర్వహించడం లేదని శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించగా దీనిపై సమాధానమివ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. సదరం శిబిరాలను నిర్వహించే తేదీల సమాచారాన్ని అందిస్తే బస్‌పాస్‌లను అక్కడే ఇస్తామని, ఆ విధంగా సమాచారమిప్పించాలని ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం చందర్‌రావు కోరారు. చిగురుమామిడి మెడల్‌ స్కూల్‌ బాలికలు స్కూల్‌ నుంచి వెళ్లే సమయంలో బస్సులను ఆపక పోవడంతో వాళ్లు రాత్రి వరకు వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. బస్సులు ఆపేలా చూడాలని జడ్పీటీసీ గీకురు రవీందర్‌ కోరగా ఇకపై అలా జరుగకుండా బస్సులను నిలిపేలా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం అన్నారు. 1 నుంచి 7 స్థాయి సంఘాల సమావేశాలు జరుగగా వివిధశాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో పవన్‌కుమార్‌, ఇతరశాఖల అధికారులు, సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పి బక్కారెడ్డి, తాళ్లపల్లి శేఖర్‌గౌడ్‌, పురమల్ల లతిత, గీకురు రవీందర్‌, పులకం సరోజన పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:48:11+05:30 IST