పోరాటాల కీర్తి.. యువతకు స్ఫూర్తి

ABN , First Publish Date - 2023-01-26T01:11:24+05:30 IST

చరిత్ర గర్వించే నాటి పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తున్నాయి. జాతీయ పోరాటాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. బ్రిటీష్‌, నిజాం పాలకులకు ఎదురొడ్డి ధీరత్వాన్ని చాటిన వారు ఉన్నారు.

   పోరాటాల కీర్తి.. యువతకు స్ఫూర్తి
సిరిసిల్లలో చేనేత కార్మిక మహాసభ ఉద్యమంలో కార్మికులు

- సిరిసిల్లకు ఘనమైన చరిత్ర

- నేడు గణతంత్ర దినోత్సవం

- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కలెక్టర్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

చరిత్ర గర్వించే నాటి పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తున్నాయి. జాతీయ పోరాటాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. బ్రిటీష్‌, నిజాం పాలకులకు ఎదురొడ్డి ధీరత్వాన్ని చాటిన వారు ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆనాటి పోరాటాలకు సంబంధించిన వీరులు, ఎన్నో ప్రదేశాలు, జ్ఞాపకాలు యువత సంకల్పాన్ని గుర్తు చేస్తున్నాయి. రాజ్యాంగం అములులోకి వచ్చిన జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా జరుపు కుంటున్నాం. ఈ సందర్భంగా పలు ఉద్యమాల్లో జిల్లా పోషించిన పాత్రను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభ ఉమ్మడి జిల్లాకు స్ఫూర్తినిచ్చింది. నాలుగో ఆంధ్రమహాసభ 1935లో సిరిసిల్లలో భీమకవి నగరంగా మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో తెలంగాణ యోధులు బద్దంయెల్లారెడ్డి, రామకృష్ణరావు, కెవి రంగారెడ్డి, జెవి నర్సింగారావు, సురవరం ప్రతాపరెడ్డి, రావినారాయణరెడ్డివంటి నాయకులు పాల్గొన్నారు. మహాసభ నిర్వహణలో సిరిసిల్ల తాలూకలోని గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి ముఖ్య భూమికను పోషించారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు బద్దం ఎల్లారెడ్డి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. అనంతరం జరిగిన ఈ మహాసభకు ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆవునూర్‌ వేణుగోపాల్‌రావు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కొడిమ్యాల భూమయ్య, సంయుక్త కార్యదర్శులుగా బద్దం ఎల్లారెడ్డి, పి నర్సింగరావు వ్యవహరించారు. వేములవాడ భీమకవి నగరంగా నిర్వహించిన మహాసభకు వివిధ ప్రాంతాలనుంచి ఎంతో మంది పాల్గొన్నారు. ఇదే ప్రాంగణంలో 4వ ఆంధ్రా మహిళా సభ నిర్వహించారు. దీనికి మాడపాటి హన్మంతరావు సతీమణి మాణిక్యమ్మ అధ్యక్షత వహించారు. ఈ మహాసభల స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు కొత్త మలుపు తిరిగాయి.

సిరిసిల్లలో చేనేత కార్మిక సభ

ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో సిరిసిల్ల నేత కార్మికులు ముందుకు సాగారు. ప్రజల దైనందిన సమస్యలతోపాటు చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం చేనేత కార్మిక సంఘం ఏర్పడింది. కార్మిక సంఘం తెలంగాణ తృతీయ మహాసభను సిరిసిల్లలో జరుపుకున్నారు. డాక్టర్‌ గాజుల భూపతి, పత్తిపాక విశ్వనాథం ఆహ్వాన సంఘంగా ఏర్పడి 1946లో సభ నిర్వహించారు. సభకు నిజాం నవాబ్‌ వైద్యుడిగా ఉన్న నారాయణదాస్‌ను ఎన్నుకున్నారు. కానీ సభలోని ప్రతినిధులు ఎవరు ఇష్టపడలేదు. సంస్థానం బయట నుంచి వచ్చిన వారిలో ఒకరిని ఎన్నుకోవాలని పట్టుబట్టారు. ఆహ్వాన సంఘం ప్రతినిధి న్యాయవాది కొడిమ్యాల భూమయ్య మాటలను ఎవరూ వినకపోవడంతో కామారెడ్డిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అమృతలాల్‌ శుక్లాను పిలిపించారు. సంస్థానంలో ఉన్నవాడైన ఉద్యమ రీత్యా కొండా లక్ష్మణ్‌ను ఎన్నుకోవాలని సూచించారు. దానికి అందరూ అంగీకరించారు. ఇలా జరిగిన చేనేత కార్మిక మహాసభ ఒక చారిత్రాక్మక సంఘటనగా రూపుదిద్దుకుంది. మహాసభ తర్వాత అమృతలాల్‌ శుక్లాను ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేయగా శుక్లా స్వచ్ఛందగా ఉద్యోగానికి రాజీనామా చేసి పోరాటాన్ని ముందుకు నడిపించారు.

సిరిసిల్ల ఖాదీ ఉద్యమంలోనూ ముందు వరసలో నిలిచింది. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం చెరఖ, గ్రామ పరిశ్రల పునరుద్ధరణ కోసం మహాత్మాగాంధీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 20లక్షల రాట్నాలను నడిపించాలని పిలుపునిస్తూ 1920లో నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ సమావేశంలో తీర్మానించారు. మహాత్మాగాంధీ నేత పని ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సమయంలో అన్నా సహెబ్‌ సహస్రబుద్దే జిల్లాలో ఖాదీ ఉద్యమ నిర్మాణానికి కీలక పాత్ర పోషించారు.

1946లో నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాటం ఉధృతంగా సాగింది. స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న ఉద్యమ కారులపై నిర్బంధాలు ఉండడంతో చెరఖ సంఘాల్లో తల దాచుకునే వారు. నిజాంకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం సాధించిన తరువాత సాయుధ పోరాటం ఉధృతంగా సాగిన క్రమంలో నాడు సిరిసిల్ల పాత తాలూక , ప్రస్తు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మానాల అడవి గెరిల్లా శిక్షణ శిబిరాలకు కేంద్రంగా మారింది. సిరిసిల్ల, రుద్రంగి, కామారెడ్డి, అర్మూర్‌, ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు మానాలలో శిక్షణ పొందేవారు. మానాల గ్రామ భూస్వామి రాజిరెడ్డి శిక్షణ శిబిరాలకు ఎంతో సహకరించేవారు.

గ్రంథాలయోద్యమం...

నిజాం నిరంకుశ పాలన కింద బతుకులీడుస్తున్న ప్రజలను పోరాట బాటలో నడిపించడానికి గ్రంథాలయోద్యమం కూడా ముఖ్యమైంది. 1886లో మందిన ఆదినారాయణ అనే ఉపాధ్యాయుడు విశాఖపట్నంలో మొదట గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఆ క్రమంలోనే గ్రంథాలయాలు స్థాపనకు నాంది పలికాయి. 1925లో సిరిసిల్లలో శ్రీ నారాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. ఇదే క్రమంలో క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా హన్మజిపేటకు చెందిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి నడిపించారు.

గణతంత్ర వేడుకలు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద గణతంత్ర వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 5 నిమిషాల వరకు జాతీయ పతాకావిష్కరణ; 9.05 నుంచి 9.15 వరకు గౌరవ వందనం స్వీకరణ, 9.15 నుంచి 10 గంటల వరకు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు ప్రదానం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.

Updated Date - 2023-01-26T01:11:24+05:30 IST