అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలి

ABN , First Publish Date - 2023-02-07T00:55:53+05:30 IST

నగరంలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతిరోజు 66 మిలియన్‌ లీటర్ల నీటిని అందించాలని, ఇందుకోసం అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలి
మంచినీటి సరఫరాపై మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌ సునీల్‌రావు

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 6: నగరంలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతిరోజు 66 మిలియన్‌ లీటర్ల నీటిని అందించాలని, ఇందుకోసం అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఎల్‌ఎండీ సమీపంలోని మున్సిపల్‌ మంచినీటి శుద్దీకరణ కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఎల్‌ఎండీలోని మంచినీటి నిలువలను, ఫిల్టర్‌బెడ్‌లోని సంపులు, మోటార్ల పంపుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. మూడురోజుల నుంచి నగరంలో నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు, వచ్చే వేసవికాలంలో ప్రజలకు అందించే మంచినీటి సరఫరా ప్రణాళికపై చర్చించారు. ఎల్‌ఎండీలో నీటి నిలువలు తగ్గినప్పటికీ నగరంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా మంచినీటిని సరఫరా చేసేందుకు ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండేళ్లుగా ముందస్తు ప్రణాళికలతో వేసవిలో శుద్ధి చేసిన మంచినీటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఎల్‌ఎండీలో 14 టీఎంసీల నీరు ఉందని, వేసవిలో నీటి నిలువలు తగ్గిపోతాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ఫిల్టర్‌ బెడ్స్‌లో మోటార్లు, స్పేర్‌ పంపులు, బూస్టర్ల వద్ద మోటారు పంపుసెట్లు, జనరేటర్లు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. అదనంగా మరో విద్యుత్‌ మోటారును తీసుకువచ్చి స్పేర్‌గా ఉంచుకోవాలని అన్నారు. సమావేశంలో కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, ఎస్‌ఈ నాగమల్లేశ్వర్‌రావు, ఈఈ కిష్టయ్య, డీఈ లచ్చిరెడ్డి, ఓంప్రకాశ్‌, ప్రజారోగ్యశాఖ ఈఈ సంపత్‌రావు, ఏఈ దేవేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:55:55+05:30 IST