దేవాదాయ శాఖ స్థలంలో ఇంటి నిర్మాణం

ABN , First Publish Date - 2023-02-07T00:18:43+05:30 IST

పెద్దపల్లి పట్టణంలోని సీతారామస్వామి దేవాలయం స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారని సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ అధికారులు సోమవారం పనులను నిలిపి వేయించారు.

దేవాదాయ శాఖ స్థలంలో ఇంటి నిర్మాణం
కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపట్టిన స్థలాన్ని పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు

- పనులను నిలిపి వేసిన దేవాదాయ శాఖ అధికారులు

పెద్దపలి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణంలోని సీతారామస్వామి దేవాలయం స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారని సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ అధికారులు సోమవారం పనులను నిలిపి వేయించారు. సాగర్‌ రోడ్డు సమీపంలో సర్వే నంబర్‌ 791లో 1.04 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. ఈ స్థలం గతంలో కొంత మంది ఆధీనంలో ఉండగా 2009లో దేవాదాయ శాఖాధికారులు అప్పటి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిని రెవెన్యూ కోర్టులో పరిష్కరించారు. ఆ స్థలం దేవాదాయ శాఖదేనని తేల్చారు. ఆ మేరకు 2014లో రెవెన్యూ అధికారులు ఆ భూమిని సర్వే చేశారు. అప్పటికే 13 ఇళ్లు అక్కడ నిర్మాణమై ఉన్నాయి. సుమారు ఆరు గుంటల వరకు ఖాళీ స్థలం ఉండగా, ఆ స్థలంలో దేవాదాయ శాఖాధికారులు బోర్డులు పెట్టారు. ఈ స్థలం సుమారు కోటి రూపాయలకు పైగా విలువ చేస్తుంది. రెండు గుంటల విస్తీర్ణంలో పాత రాజు అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. పిల్లర్ల దశలో పనులు నడుస్తున్నాయి. దేవాదాయ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారని పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్‌ బాధ్యులు దేవాదాయ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, ఆలయ ఈవో సాయి శంకర్‌, సిబ్బంది పని జరుగుతున్న ప్రాంతానికి వచ్చి ఇంటి నిర్మాణాన్ని నిలిపి వేయించారు. ఈ విషయమై సదరు అధికారులు విలేకరులతో మాట్లాడుతూ సర్వే నంబర్‌ 791లో దేవాదాయ శాఖ భూమి 1.04 ఎకరాలు ఉందని చెప్పారు. ఇందులో ఎవరైనా ఇళ్లు నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2023-02-07T00:19:00+05:30 IST