Secretariat: 17న సచివాలయ ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2023-01-25T03:08:34+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల సమయంలో సీఎం కేసీఆర్‌ ఈ నూతన పరిపాలనా భవనాన్ని ఆవిష్కరిస్తారు.

Secretariat: 17న సచివాలయ ప్రారంభోత్సవం

మంగళవారం పనులను పరిశీలించిన కేసీఆర్‌

సీఎం చాంబర్‌లో మార్పులకు సూచన..

ప్రారంభోత్సవానికి శృంగేరి పండితులు

వాస్తు పూజ.. చండీ, సుదర్శన యాగాలు..

ఆ రోజు ఆరో అంతస్తే ప్రారంభం

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల సమయంలో సీఎం కేసీఆర్‌ ఈ నూతన పరిపాలనా భవనాన్ని ఆవిష్కరిస్తారు. ఆయన జన్మదినం రోజునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం. ప్రారంభోత్సవానికి ముందు సీఎం.. వాస్తుపూజ, చండీయాగం, సుదర్శన యాగం తదితర క్రతువులను నిర్వహించనున్నారు. అనంతరం ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌ సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఆరో అంతస్తులో నిర్మాణమవుతున్న సీఎం చాంబర్‌కు వెళ్లి, సీలింగ్‌, వుడ్‌ ప్యానెలింగ్‌, తదితర పనులను పరిశీలించారు. పలు మార్పులు చేయాలని అధికారులకు సూచించారు.

ప్రారంభోత్సవానికి శృంగేరి పీఠం పండితులు..

సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా వైదిక క్రతువులను నిర్వహించేందుకు కర్ణాటక నుంచి శృంగేరీ పీఠం పండితులు రానున్నారు. వీరు ఋగ్వేదంలో పూజలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో ఈ ప్రాంత ఆచారం ప్రకారం యజుర్వేదంలో ఇక్కడి పండితులు పూజలు నిర్వహిస్తున్నారు.

నిర్మాణం పూర్తికి మరో మూడు నెలలు..

ఫిబ్రవరి 17 నాటికి సచివాలయంలో ఆరో అంతస్తు మాత్రమే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం జరుగుతున్న పనులు సైతం ఆరో అంతస్తు ప్రారంభమే లక్ష్యంగా నడుస్తున్నాయి. ఇందులోనూ సీఎం చాంబర్‌పైనే ప్రధానంగా దృష్టి సారించారు. సెక్రెటేరియట్‌ పనులు మొత్తం పూర్తయి అందుబాటులోకి రావాలంటే మరో మూడు నెలలు పట్టనుంది. వాస్తవానికి సంక్రాంతి నాడే సచివాలయాన్ని ప్రారంభించాలని భావించినా పనులు పూర్తికాలేదు.

ఇవీ ప్రత్యేకతలు..

మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్న సచివాలయంలో రక్షణ వ్యవస్థ నుంచి వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు అనువుగా కూడా ఎక్కడికక్కడ ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటుచేశారు. 10,51,676 చదరపు అడుగుల్లో అన్ని రకాల భవనాలు నిర్మితమవుతున్నాయి. ప్రధాన సచివాలయ భవనం లోయర్‌ గ్రౌండ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌ కలుపుకుని మొత్తం ఆరు అంతస్తులు ఉండనుంది. ఇది 7,88,904 చదరపు అడుగుల్లో నిర్మాణం అవుతోంది. డోమ్‌లు ఏడు నుంచి 11 అంతస్తుల ఎత్తులో 1,54,256 చ.అ విస్తీర్ణంలో ఉండగా, బిల్డింగ్‌ ఎత్తు 265 అడుగులు. కాగా దక్షిణ భాగంలో 25వేల చ.అడుగుల్లో బిల్డింగ్‌లు, పశ్చిమ భాగంలో 15,600 చ.అడుగులు, 27,328చ.అడుగులతో భవనాలు నిర్మాణం కానున్నాయి. కాగా యుటిలిటీ బ్లాక్‌కు 6,590చ.అడుగులు కేటాయించనున్నారు. మందిరం 2,713 చ.అ, చర్చి 1,911చ.అ, మసీదును గ్రౌండ్‌ ప్లోర్‌తో కలిపి మూడు అంతస్తులతో 4,334 చ.అడుగుల్లో నిర్మించనున్నారు. ఇక, వర్షపు నీరు వృఽథా కాకుండా ఉండేందుకు సచివాలయం అండర్‌ గ్రౌండ్‌లో రెండున్నర లక్షల నీటిని నిల్వ చేసే విధంగా ఒక ట్యాంకును నిర్మిస్తున్నారు.

మంత్రులు, అధికారుల సిబ్బందికి ప్రత్యేక గదులు..

మంత్రులు, వారి సిబ్బందికి రెండు, ఐదో అంతస్తుల్లో కార్యాలయాలు ఉండనున్నాయి. సాధారణ పరిపాలన విభాగం, ఆర్థిక శాఖను మొదటి, రెండు అంతసుల్లో.. ఇతర విభాగాలకు మూడు, ఐదో అంతస్తుల్లో కార్యాలయాలను కేటాయించనున్నారు. వీటిలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు, ప్రిన్పిపల్‌ సెక్రటరీలు, సెక్రటరీలకు కలిపి 59 కార్యాలయాలు, అడిషనల్‌ సెక్రటరీలు, జాయింట్‌ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలకు 90 కార్యాలయాలు, అసిస్టెంట్‌ సెక్రటరీ క్యాడర్‌ అధికారులకు 121 కార్యాలయాలను కేటాయించనున్నారు. మంత్రులు వారి సిబ్బందికి సైతం కార్యాలయాలను కేటాయించనున్నారు. సర్వర్‌ రూంలు, సచివాలయ సిబ్బంది కోసం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గదులు ఏర్పాటుకానున్నాయి.

Updated Date - 2023-01-25T03:08:35+05:30 IST