పేదల బతుకులు మారాలంటే.. కేసీఆర్‌ సర్కారు పోవాలె

ABN , First Publish Date - 2023-02-07T04:15:02+05:30 IST

సీఎం కేసీఆర్‌కు అధికారం దక్కగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన అమరుల త్యాగాలను మరిచిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

పేదల బతుకులు మారాలంటే.. కేసీఆర్‌ సర్కారు పోవాలె

అమరుల త్యాగాలను మరిచిన సీఎం కేసీఆర్‌

రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం

సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకోవడం సిగ్గు చేటు

భర్తకు పింఛన్‌ ఇచ్చి.. భార్యను అవమానిస్తారా?

పది బడ్జెట్లలోని 27 లక్షల కోట్లు ఏమయ్యాయి?

ఈ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడం ఖాయం

రాహుల్‌ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్తాం

హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర లక్ష్యం అదే: రేవంత్‌

మేడారంలో సమ్మక్క సారలమ్మల గద్దెలకు

పూజలతో యాత్రను ప్రారంభించిన పీసీసీ చీఫ్‌

తొలిరోజు పది కిలోమీటర్లు సాగిన పాదయాత్ర

భూపాలపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు అధికారం దక్కగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన అమరుల త్యాగాలను మరిచిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. 1200 మంది ఆత్మబలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కలిగిన తెలంగాణ గడ్డ.. దీన్ని చూస్తూ మౌనంగా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. పేదల బతుకుల్లో మార్పు రావాలంటే.. కేసీఆర్‌ ప్రభుత్వం పోవాలని అన్నారు. సోమవారం ములుగు జిల్లా మేడారంలో ‘హాత్‌సే హాత్‌ జోడో’ యాత్రను సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవిందరావుపేట మండలం పస్రాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి తమది సంక్షేమ ప్రభుత్వమని కేసీఆర్‌ చెప్పుకోవడం సిగ్గుమాలిన చర్య అన్నారు.

సంక్షేమమంటే భర్తకు పింఛన్‌ ఇచ్చి భార్యను అవమానించడమా? లక్ష రుపాయల రుణమాఫీ అని చేయకపోవడమా? పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడమా? పది వేల మంది రైతులు అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడటమా? ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.500 కోట్లు ఎగ్గొట్టడం సంక్షేమమా? అని ప్రశ్నించారు. గత పది బడ్జెట్లలో రూ.27 లక్షల కోట్లు కేటాయించారని, ఈ నిధులను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు కేటాయిస్తే.. ప్రతి నియోజకవర్గానికి రూ.25 వేల కోట్లు వస్తాయని అన్నారు. ఈ నిధులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.25 లక్షల కోట్లను తెలంగాణ రాబంధుల సమితి దోసుకెళ్లిందన్నారు.

అవగాహన కల్పించేందుకే జోడో యాత్ర..

కల్వకుంట్ల కుటుంబం కారణంగా తెలంగాణ బొంద ల గడ్డగా మారిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజరిక పాలనకు ముగింపు పలకాల న్నా, ఇందిరమ్మ ఇళ్లు కావాలన్నా, పంటలకు గిట్టుబాటు ధర రావాలన్నా, రూ.2 లక్షల రుణమాఫీ జరగాలన్నా. కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని, ఆ మార్పు ప్రజల్లో రావాలని పిలుపునిచ్చారు. రాచరికానికి వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. మేడారంలో పడిన తన తొలి అడుగు.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేందుకేనని అన్నారు. కేసీఆర్‌ సర్కారు మేడారం అభివృద్ధిని విస్మరించిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ మధుయాష్కీగౌడ్‌ మాట్లాడుతూ.. గోదావరి పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తే అడ్డుకొని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును కాపాడుకున్నామని, కానీ.. కేసీఆర్‌ నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ మీటింగ్‌ పెట్టి ఎస్సారెస్పీ నీళ్లు తోడుకోమని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల్లో వచ్చిన కమీషన్‌లతో దేశం మీద పడ్డారన్నారు. కాగా, భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌గాంధీ ఇచ్చిన సందేశం.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగే హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర ద్వారా ఇంటింటికీ చేరాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, బలరాం నాయక్‌, సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

తొలిరోజు 10 కి. మీ. యాత్ర

ములుగు: రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర తొలిరోజు ములుగు జిల్లాలో 10 కిలోమీటర్ల మేర సాగింది. ములుగు సమీపంలోని గట్టమ్మతల్లికి రేవంత్‌ తొలిపూజ చేసి మేడారానికి పయనమయ్యారు. ఆయనకు ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్క, కాంగ్రె స్‌ శ్రేణులు బాణసంచా పేల్చుతూ, డోలు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. సీతక్క హారతిచ్చి రేవంత్‌రెడ్డికి వీరతిలకం దిద్ది యాత్రకు శ్రీకారం చుట్టారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మలు, వనదేవతల గద్దెలను దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. తులాభారం వేసి, ఎత్తు బెల్లాన్ని తల్లులకు మొక్కుగా చెల్లించారు. అనంతరం గోవిందరావుపేట మండలం టప్పామంచా వద్ద గల క్యాంపునకు చేరుకున్నారు. అక్కడ భోజనం అనంతరం అక్కడి నుంచి పస్రాకు బయల్దేరారు. అక్కడ రోడ్‌షోలో మాట్లాడి.. గోవిందరావుపేటకు చేరుకున్నారు. వెంకటాపూర్‌(రామప్ప) మండలం పాలంపేటలో రాత్రి బస చేశారు. మంగళవారం రేవంత్‌రెడ్డి.. రామప్ప ఆలయాన్ని సందర్శించి రుద్రేశ్వరుడికి పూజల అనంతరం పాదయాత్రగా రామాంజాపురం, వెల్తుర్లపల్లి క్రాస్‌రోడ్డు, బుద్దారం, కేశవాపురం, నర్సాపురం, బండారుపల్లి మీదుగా ములుగు వస్తారు. సాయంత్రం రోడ్‌షోలో మాట్లాడతారు.

హారతిచ్చి సాగనంపిన కూతురు

హైదరాబాద్‌: పాదయాత్రను ప్రారంభించేందుకు సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి మేడారం బయలుదేరిన రేవంత్‌రెడ్డికి ఆయన కూతురు నైమిష హారతిచ్చి సాగనంపారు. రేవంత్‌కు కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా వీడ్కోలు పలికారు.

Updated Date - 2023-02-07T04:16:02+05:30 IST