బడ్జెట్‌ బుక్కు దొడ్డుగుంది కానీ లోపల మాల్‌ మసాలా లేదు

ABN , First Publish Date - 2023-02-07T03:46:55+05:30 IST

‘‘రాష్ట్ర బడ్జెట్‌ పుస్తకాలు దొడ్డుగా ఉన్నయి. అవి చూసి మాల్‌ మసాలా బాగుంటదని అనుకున్నం.

బడ్జెట్‌ బుక్కు దొడ్డుగుంది కానీ లోపల మాల్‌ మసాలా లేదు

తెచ్చిన్రు.. సదివిన్రు.. బల్లలు కొట్టిన్రు

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైర్లు

సంగారెడ్డి, సదాశివపేట్‌కు మెట్రో రైలు, పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని డిమాండ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర బడ్జెట్‌ పుస్తకాలు దొడ్డుగా ఉన్నయి. అవి చూసి మాల్‌ మసాలా బాగుంటదని అనుకున్నం. కానీ మాల్‌ లేదు.. మసాలా కూడా లేదు’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గవర్నర్‌ ప్రసంగంలో రాకపోవడంతో వాటిని సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆ సమస్యలకు బడ్జెట్లోనైనా పరిష్కారం దొరుకుతుందని, ప్రజలకు సంతో షం కలిగేలా బడ్జెట్‌ ఉంటుందని భావించామని.. కానీ, అలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులతో కలిసి ఆయన మాట్లాడారు. షాదీ ముబారక్‌, కళ్యాణ లక్ష్మి పథకాలకు మరో రూ.2 లక్షల చొప్పునపెంచాలని తాము డిమాండ్‌ చేశామని.. కానీ ప్రభుత్వం పెంచలేదన్నారు. ఒకే కిస్తీలో పంట రుణాల మాఫీ కోరినా చేయలేదని ధ్వజమెత్తారు. ఆర్‌ఎంపీ డాక్టర్ల సమస్యలనూ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చామని, వారికి గుర్తిం పు కార్డులు ఇవ్వాలని కోరామన్నారు. వీఆర్‌ఏ, ఐకేపీ ఉద్యోగుల సమస్యల ప్రస్తావనే లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను పునరుద్ధరించి సంగారెడ్డి సహా రాష్ట్రవ్యాప్తంగా పేదలకు వంద గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరామన్నారు. కానీ, పేదలు సహా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావనే లేదన్నారు.

ఉద్యమంలో పని చేసిన జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని జగ్గారెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. సంగారెడ్డి, సదాశివపేట్‌కు, యాదాద్రికి మెట్రో రైల్‌ పొడిగించాలని సభలో కోరానని.. కానీ చప్పుడే లేదని వాపోయారు. నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే ఒక్కరికే వృద్ధాప్య పెన్షన్‌ ఇస్తున్నారని.. ఇద్దరికీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు. బడ్జెట్‌.. ప్రజల సమస్యలను పరిష్కరించేలా ఉంటుందనుకున్నానని.. కానీ అలా లేదని వ్యాఖ్యానించారు. ‘‘పుస్తకం తెచ్చి సదివిన్రు.. బల్లలు కొట్టిన్రు.. పోయిన్రు!’’ అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. అనాథ పిల్లలకు వసతి గృహాల ఏర్పాటు ప్రస్తావనా లేదన్నారు. క్యాన్సర్‌ రోగులకు వైద్య ఖర్చును ప్రభుత్వమే భరించాలంటూ తాను కోరానని, దానిపైనా ప్రభుత్వం స్పందించలేదన్నారు. వీఆర్‌ఏలు, ఐకేపీల సమస్యలూ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అనాథ పిల్లలకు వసతి గృహాలను ఏర్పాటుపై కేసీఆర్‌ హామీని అమలు చేయాలన్నారు. ఈ డిమాండ్లన్నీ నెరవేరే వరకూ పోరాడుతూనే ఉంటామన్నారు. కాగా.. అసెంబ్లీలో గవర్నర్‌ తీరుపైన బీజేపీ అసంతృప్తిగా ఉందని, ఆమెను మార్చే అవకాశం ఉంద న్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్ని గేమ్‌లు ఆడినా ఇక్కడ ఆ పార్టీ అధికారంలోకి రాబోదని ఆయన జోస్యం చెప్పారు.

ఎవరికీ బానిస కాను..

తాను ఎవరికీ బానిసను కానని, ఎవరితో లాలూచీ కూడా పడబోననీ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పేదలకు ఉపయోగపడుతుందనుకునే విషయాల్లో.. ఎదుటివాళ్లు ఎంతటి బలవంతులైనా చూడబోనన్నారు. రాజకీయంగా టీఆర్‌ఎ్‌సను తిట్టి ఆహా.. ఓహా అనిపించుకోవడం కంటే సమస్యలను సభలో ప్రస్తావించి సీఎం దృష్టికి తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టానన్నారు. కేసీఆర్‌ కిట్‌తో మహిళకు లబ్ధి జరుగుతుందని, కళ్యాణ లక్ష్మి కూడా మంచి పథకమేనని.. మంచిని మంచి అనాల్సిందేనన్నారు. యాదగిరి గుట్ట పునర్మిర్మాణమూ మంచి నిర్ణయమేనన్నారు.

Updated Date - 2023-02-07T03:46:56+05:30 IST