Singer Saichand Death : తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం!
ABN , First Publish Date - 2023-06-30T03:39:43+05:30 IST
తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపునిచ్చిన ఓ గొంతు మూగబోయింది.
● సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలనివాళి
● టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంతాపం
● అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదు:? ప్రవీణ్
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపునిచ్చిన ఓ గొంతు మూగబోయింది. సభలు, సమావేశాల్లో తన గళాన్ని వినిపించి.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను పల్లె పల్లెకు చేరేలా చేసిన గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (39) ఇక లేరు. గురువారం తెల్లవారుజామున తీవ్ర గుండెపోటుతో మృతి చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని తన వ్యవసాయ క్షేత్రంలో సాయిచంద్ బుధవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు నాగర్‌కర్నూల్‌లోని ఆస్పత్రికి, హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే సాయిచంద్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య రజని (33), కుమారుడు చెర్రీ (9), కుమార్తె నది (4) ఉన్నారు. సాయిచంద్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా అమరచింత. పదేళ్ల క్రితం బడంగ్‌పేట్ కార్పొరేషన్ గుర్రంగూడ వచ్చి స్థిరపడ్డారు. సాయిచంద్ మృతి తెలిసి మంత్రి హరీశ్ తెల్లవారుజామున 3:30కు ఆస్పత్రికి చేరుకున్నారు. భౌతికకాయాన్ని చూసి కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో సాయించంద్ అంత్యక్రియలు జరిగాయి. చీఫ్ విప్ బాల్క సుమన్, కౌశిక్ రెడ్డి, పీసీసీ నేత మల్లు రవి తదితరులు సాయిచంద్ పాడె మోశారు. కాగా, 2009 నుంచి తెలంగాణ ఉద్యమానికి సాయిచంద్ గొంతు కలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సభల్లో సాయిచంద్ బృందం ప్రదర్శనలిచ్చేది. 2021 డిసెంబరులో సాయిచంద్‌ను ప్రభుత్వం గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా నియమించింది. వచ్చే ఎన్నికల్లో అలంపూర్ లేదా, ఏదైనా లోక్‌సభ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని ఆయన బీఆర్‌ఎస్ పెద్దలను కోరుతూ వస్తున్నారు.

ఉన్నత స్థాయికి వెళ్లేవారు: కేసీఆర్
సాయిచంద్ అకాల మరణం తీవ్ర ఆవేదన కలిగించిందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. సాయిచంద్ మృతి తీవ్రంగా కలిచి వేసిందని, ఉన్నతస్థాయికి ఎదిగే దశలో మృతిచెందడం బాధాకరమని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసంలో భౌతికకాయాన్ని చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఉద్యమ సహచరుడి మరణం తీరని లోటని మంత్రి కేటీఆర్ అన్నారు. భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీరు పెట్టుకున్నారు. స్పీకర్ పోచారం, మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి, తలసాని, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల, ఎంపీ సంతోష్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గద్దర్, విమలక్క, సుద్దాల అశోక్‌తేజ, జూలూరు గౌరీశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. సాయిచంద్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించకపోవడం పట్ల బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిచంద్ పార్థివ దేహం వద్ద ప్రవీణ్ నివాళులర్పించారు.