Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-02-07T11:14:18+05:30 IST

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Purchase Case)లో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ వేయనుంది.

Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Purchase Case)లో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ వేయనుంది. సింగిల్ బెంచ్ (Single Bench) ఇచ్చిన తీర్పు తమ పరిధిలోకి రాదని డివిజన్ బెంచ్ (Division Bench) తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సింగిల్ బెంచ్ ఈ కేసును సీబీఐ (CBI) విచారణకు ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో రిట్ అప్పీల్ పిటిషన్ వేసింది. దీనిపై సోమవారం (నిన్న) విచారించిన డివిజన్ బెంచ్.. ప్రభుత్వ రిట్ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా సుప్రీం కోర్టుకు వెళ్లేంత వరకు సీబీఐ విచారణ నిలిపి వేయాలని అడ్వకేట్ జనరల్ కోరారు. ఏజీ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఏ క్షణంలోనైనా ఈ కేసుఫై సీబీఐ ఎఫ్ఐఆర్ చేయనుంది. ఇప్పటికే కేసు వివరాలు ఇవ్వాలని చీఫ్ సెక్రెటరీకి సీబీఐ అధికారులు లేఖ రాశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, సిట్‌ దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. ప్రభుత్వ అప్పీల్‌ పిటిషన్‌లకు విచారణార్హత లేదని పేర్కొంటూ చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీంకోర్టుకే వెళ్లాలని తేల్చిచెప్పింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్‌ అప్పటివరకూ చేసిన దర్యాప్తును.. ఎవరూ అడగకముందే సింగిల్‌ జడ్జి క్వాష్‌ చేశారని.. సిట్‌ జీవోను కొట్టేశారని.. అత్యంత అసాధారణమైన ఆదేశాలను జారీచేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎటువంటి ఆధారాలను పరిశీలించకుండానే దర్యాప్తును సీబీఐకి ఇచ్చారని.. ఇది రాష్ట్రపోలీసుల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. అత్యంత సమర్థులైన ఐపీఎస్‌ అధికారులు కలిగిన సిట్‌ను కాదని.. కేసును సీబీఐకి బదిలీ చేయడానికి సరైన కారణాలు లేవని అభ్యంతరం చెప్పారు.

ముఖ్యమంత్రి దీనిపై పత్రికా సమావేశం పెట్టడం దర్యాప్తులో జోక్యం కిందికి రాదని.. ఒక రాజకీయ పార్టీ చట్టబద్ధంగా, తన రాజకీయ లక్ష్యాల మేరకు చేసిన రాజకీయ కార్యక్రమంగానే చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వాధినేతగా తన ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉందని సీఎం చెప్పడంలో తప్పులేదని తెలిపారు. నిందితులకు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి మధ్య జరిగిన సంభాషణల ఎలక్ట్రానిక్ ఆధారాలు అప్పటికే జనబాహుళ్యంలో ఉన్నాయని.. వాటిని ముఖ్యమంత్రికి పోలీసులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఆ ఆధారాలను సీఎం వివిధ హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు పంపడం దర్యాప్తులో జోక్యం చేసుకోవడం కిందికి రాదని పేర్కొన్నారు. నిందితులు బేరసారాలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని.. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని గుర్తుచేశారు.

సింగిల్‌ జడ్జి క్రిమినల్‌ అధికార పరిధిలో ఆదేశాలు జారీచేసినందున డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ ఉండదని.. ‘రామ్‌కిషన్‌ ఫౌజీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హరియాణా’ కేసులో సుప్రీం తీర్పు ప్రకారం క్రిమినల్‌ కేసుల్లో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చే ఆదేశాలపై నేరుగా సుప్రీంకోర్టులోనే అప్పీల్‌ ఉంటుందని నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి ధర్మాసనానికి గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోపాటు తెలంగాణ హైకోర్టు లెటర్స్‌ పేటెంట్‌ రూల్స్‌లోని క్లాజ్‌ 15ను ఆయన ప్రస్తావించారు. సింగిల్‌ జడ్జి ఎదుట ఉన్నవి ఆర్టికల్‌ 226 ప్రకారం దాఖలైన రిట్‌ పిటిషన్‌లే అయినా.. సింగిల్‌ జడ్జి తన క్రిమినల్‌ అధికార పరిధిని ఉపయోగించి ఆదేశాలు జారీచేశారని తెలిపారు. సిట్‌ అప్పటివరకు చేసిన దర్యాప్తును క్వాష్‌ (కొట్టేయడం) చేశారని.. ఆ అధికారం కేవలం క్రిమినల్‌ అధికార పరిధిలోనే ఉంటుందని తెలిపారు. క్రిమినల్‌ అధికార పరిధిలో ఇచ్చిన ఏ ఆదేశంపైనా ఇంట్రా కోర్టు అప్పీల్‌ ఉండదని.. నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అన్నివర్గాల వాదనలు విస్తృతంగా పరిశీలించిన ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఎదుట ఉన్న పిటిషన్లు క్రిమినల్‌ సబ్జెక్ట్‌ మ్యాటర్లని చెప్పడంలో తమకు ఎలాంటి అనుమానం లేదని వ్యాఖ్యానించింది. వాటిపై సింగిల్‌ జడ్జి తన క్రిమినల్‌ అధికార పరిధి (క్రిమినల్‌ జ్యూరి్‌సడిక్షన్‌)ను ఉపయోగించి ఆదేశాలు జారీచేశారని స్పష్టంచేసింది. సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన ‘రామ్‌కిషన్‌ ఫౌజీ’ తీర్పులో పేర్కొన్న నిర్వచనం పరిధిలోకే వస్తుందని తెలిపింది. లెటర్‌ పెటెంట్‌ రూల్స్‌ ప్రకారం సింగిల్‌ జడ్జి ఆదేశాలపై ఇంట్రా కోర్టు అప్పీల్‌ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, సిట్‌ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌లకు విచారణార్హత లేదని.. విచారణాధికారం సుప్రీంకోర్టుకే ఉందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ రిట్‌ అప్పీళ్లను కొట్టేస్తున్నట్లు తుది ఆదేశాలను ప్రకటించింది.

Updated Date - 2023-02-07T11:14:21+05:30 IST