Secunderabad Railway Station: ఓన్లీ పే టాయిలెట్స్‌

ABN , First Publish Date - 2023-01-25T08:37:52+05:30 IST

దక్షిణ మధ్య రైల్వేకు అత్యధిక ఆదాయం వస్తునప్పటికీ సాధారణ రైలు ప్రయాణికులకు కష్టాలు

Secunderabad Railway Station: ఓన్లీ పే టాయిలెట్స్‌

హైదరాబాద్/సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వేకు అత్యధిక ఆదాయం వస్తునప్పటికీ సాధారణ రైలు ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉచిత టాయిలెట్స్‌ కనిపించడం లేదు. స్టేషన్‌లో ఎక్కడ చూసినా పే మరుగుదొడ్లే కనిపిస్తున్నాయి. దీంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో రైల్వే యంత్రాంగం విఫలమవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సికింద్రాబాద్‌కు వచ్చే ప్రయాణికులకు రైల్వేస్టేషన్‌లో ఉచిత మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు చిన్నపిల్లలు సైతం తీవ్ర ఇబ్బందులు అనుభవిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లోని పది ప్లాట్‌పాంలలో ఒకటవ నెంబరు ప్లాట్‌పాంపై పే, ఏసీ టాయిలెట్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సాధారణ ప్రయాణికులు ఈ టాయిలెట్స్‌కు వెళ్లేందుకు అనుమతి లేదు. రిజర్వేషన్‌ తీసుకున్న ప్రయాణికులకు మాత్రమే సౌకర్యాలు కల్పించి జనరల్‌ బోగిల్లోని ప్రయాణికులకు మాత్రం ఉచితంగా వెళ్లేందుకు మరుగుదొడ్లు సౌకర్యాలు లేకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పాటు రైల్వే ఉన్నతాధికారులు సైతం ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

స్నానాలకు ఇబ్బందులు

సూదూర ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు అధిక సంఖ్యలో వ్యాపారులు వస్తుంటారు. చాలా మంది సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో టాయిలెట్స్‌నే ఉపయోగిస్తుంటారు. అక్కడ పే టాయిలెట్స్‌ నిర్వాహకులకు 50 రూపాయలు ముట్టజెప్పందే పెయింగ్‌ టాయిలెట్స్‌లో లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. లాడ్జీలకు వెళ్లాలంటే దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుండడంతో చాలా మంది స్టేషన్‌లో స్నానాలు చేస్తుంటారు. ఇక్కడ ఉచిత టాయిలెట్‌ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని ప్రయాణికులు భావిస్తున్నారు.

అందినంత దోపిడీ

రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ నెంబర్‌ 10లో ఉన్న ప్రైవేట్‌ టాయిలెట్స్‌ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. మూత్రవిసర్జనకు రూ.10, కాలకృత్యాలకు రూ.20 వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే కాంట్రాక్టర్‌ చెప్పినంత చార్జీలు వసూలు చేస్తున్నామంటూ దబాయిస్తున్నారు.

ప్లాట్‌ ఫాం నెంబర్‌-1లో పెయింగ్‌ టాయిలెట్స్‌ మాత్రం అందుబాటులో ఉన్నాయి - రేతిఫైల్‌ బస్టాండు వైపు స్టేషన్‌కు వెళ్లే దారిలో రెండో పేయింగ్‌ టాయిలెట్‌ ఉంది.

ప్లాట్‌ ఫాం నెంబర్‌-6లో వద్ద పేయింగ్‌ సౌకర్యం

ప్టాట్‌ ఫాం నెంబరు 10లో హైటెక్‌ టాయిలెట్‌ ఉంది. కానీ ఇక్కడ ఉచితంగా టాయిలెట్‌కు వెళ్లేందుకు నిర్వాహకులు అనుమతివ్వరు.

రోజూ రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఈ స్టేషన్‌లో ఉచిత మరగుదొడ్లు లేకపోవడం విడ్డూరం.

కనీసం పేయింగ్‌ మరుగుదొడ్డిలో డబ్బులు ఇచ్చినా వెళ్లనివ్వరు. కేవలం రిజర్వేషన్‌ ప్రయాణికులకు మాత్రమే అనుమతి.

రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న ప్లాట్‌పాం 10 బస్టాపులో ప్రవేట్‌ టాయిలెట్‌ ఉన్నప్పటికీ దూరంగా ఉండడంతో అక్కడికి వెళ్లొచ్చే సరికి రైలు వెళ్లిపోతుందోనన్న ప్రయాణికుల భయం.

Updated Date - 2023-01-25T08:37:54+05:30 IST