TS Budget: పాత ఇంజను.. కొత్త కారు!

ABN , First Publish Date - 2023-02-07T03:39:15+05:30 IST

అసెంబ్లీలో హరీశ్‌ రావు బడ్జెట్‌ ప్రసంగం చదువుతున్నారు! అందులోని గణాంకాలను చూసిన కొంతమంది..

TS Budget: పాత ఇంజను.. కొత్త కారు!

ఎన్నికళ తప్పిన రాష్ట్ర బడ్జెట్‌.. చాలా పథకాలకు కేటాయింపుల్లో మార్పుల్లేవ్‌

కొత్త పథకాల ఊసు లేదు.. గిరిజన బంధు నో

కనిపించని డబుల్‌ బెడ్‌రూం, నిరుద్యోగ భృతి

మన ఊరు.. మన బడికి కేటాయింపుల్లేవ్‌

చివరి ఏడాది రైతు రుణ మాఫీకి కావాల్సింది

రూ.20 వేల కోట్లపైనే.. ఇచ్చింది రూ.6,385 కోట్లు

గత ఏడాది డబుల్‌కు కేటాయించిన 12 వేల కోట్లు

ఈసారి సొంత జాగాకు.. మార్గదర్శకాలెప్పుడో!?

రాబడి వాస్తవాలకు విరుద్ధంగా మళ్లీ భారీ పద్దు

కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా గ్రాంట్లు

రాకపోయినా మరోసారి భారీ అంచనా

ఏపీ నుంచి రావాల్సిన నిధులకు కొత్తగా గ్రాంటు

ఇంటర్‌ స్టేట్‌ సెటిల్‌మెంట్‌ నిధులకూ కేంద్రంపైనే ఆశ

రెవెన్యూ రాబడుల విషయంలోనూ అంకెల గారడీ

ఎన్నికల ఏడాదిలో ప్రకటనలకు రూ.వెయ్యి కోట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో హరీశ్‌ రావు బడ్జెట్‌ ప్రసంగం చదువుతున్నారు! అందులోని గణాంకాలను చూసిన కొంతమంది.. పొరపాటున ఆయన గత ఏడాది బడ్జెట్‌ ప్రసంగాన్ని చదువుతున్నారా!? అని అనుకున్నారట! తీరా, మొదటి పేజీ చూస్తే.. 2023-24 అనే ఉందట! బడ్జెట్‌ ప్రసంగంలో అక్కడక్కడా కొన్ని గణాంకాలు మారడాన్ని గమనించి.. అప్పుడు ఇది తాజా బడ్జెట్టే అనుకున్నారట!

..ఇదీ ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ తీరు! దళిత బంధు, హౌసింగ్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, రుణ మాఫీ, మహిళా వర్సిటీ, కేసీఆర్‌ కిట్‌, ఆర్టీసీ, ఈహెచ్‌ఎ్‌స, సచివాలయ భవన నిర్మాణం, హైదరాబాద్‌ మెట్రో, వడ్డీ లేని రుణాలు, హరిత హారం, ఆయిల్‌ పామ్‌ తదితర పథకాలకు గత ఏడాది ఎన్ని నిధులు కేటాయించారో.. ఈసారి కూడా అన్నే నిధులను కేటాయించడమే ఇందుకు కారణం! మరో ఎనిమిది నెలల్లోపే అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి! కేసీఆర్‌ సర్కారు రెండో విడతకు సంబంధించి ఇదే చివరి బడ్జెట్‌! దాంతో, తమపై వరాలు కురిపిస్తారని కొన్ని వర్గాలు ఆశించాయి. కేసీఆర్‌ ప్రకటించినట్లే.. ‘బీసీ బంధు’ ఉంటుందని రాష్ట్రంలో సగం వరకూ ఉన్న ఆ వర్గాలు; ‘గిరిజన బంధు’ ప్రకటిస్తారని గిరిజనులు; ఈసారి తప్పనిసరిగా నిరుద్యోగ భృతి ఉంటుందని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, గతానుభవాల నేపథ్యంలో కొత్త పథకాల అమలు జోలికి సర్కారు వెళ్లలేదు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు కాస్త నిధులు పెంచి సరిపెట్టింది. ఈ పథకాల అమలుపైనా సందేహమే! ఎందుకంటే.. గత ఏడాది బడ్జెట్లో దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు. కానీ, ఏడాది కాలంలో ఇందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఒక్క లబ్ధిదారుడినీ ఎంపిక చేయలేదు. ఈ ఏడాది కూడా అంతే బడ్జెట్‌ కేటాయించారు. ఇందులో, ఈ ఏడాది ఎనిమిది నెలల్లో ఎంత ఖర్చు చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం విషయంలోనూ ఇదే పరిస్థితి.

గత ఏడాది డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. సొంత జాగా పథకాన్ని ప్రకటించారు. కానీ, ఇన్ని నిధులు అని స్పష్టంగా పేర్కొనలేదు. అలా అని, ఏడాది కాలంలో ఈ పథకాన్ని అమలు చేయలేదు. కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు చేయలేదు. ఇక, ఈ ఏడాది బడ్జెట్లో డబుల్‌ ఇళ్లకు నిధుల ప్రస్తావన లేదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న డబుల్‌ ఇళ్లకు అవసరమయ్యే నిధులను హడ్కో నుంచి బడ్జెటేతర నిధుల నుంచి తీసుకుని వినియోగించనున్నట్లు పేర్కొంది. గత బడ్జెట్లో ఈ పథకానికి కేటాయించిన రూ.12 వేల కోట్లను ఈసారి సొంత జాగా పథకానికి పెట్టారు. దీనికి మార్గదర్శకాలు ఎప్పుడు ఖరారవుతాయో.. పథకం ఎప్పుడు పట్టాలకు ఎక్కుతుందో వేచి చూడాల్సిందే! అలాగే, రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు భూ పరిహారం కోసం రాష్ట్ర వాటా కింద రూ.2600 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. ఇందులో గత బడ్జెట్లో రూ.500 కోట్లను కేటాయించింది. కానీ, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తాజా బడ్జెట్లోనూ రూ.500 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇక, రుణ మాఫీ పథకానిది ఇదే పరిస్థితి. గత ఏడాది బడ్జెట్లో రుణమాఫీకి రూ.4000 కోట్లు కేటాయించారు. కానీ, రూ.443 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. గత ఐదేళ్లుగా ఈ పథకానికి రూ.26,363 కోట్లు కేటాయించి.. కేవలం రూ.1206 కోట్లే ఖర్చు చేశారు. ఎన్నికల్లోపు ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.20వేల కోట్లకుపైగా నిధులు అవసరం. కానీ, ఈ ఏడాది కేటాయించింది కేవలం రూ.6,385 కోట్లు. చివరికి, వచ్చేసరికి ఇందులో ఎన్ని ఖర్చు చేస్తారన్న అంశంపైనా సందేహమే.

భారీ పద్దు సరే.. రాబడులేవీ!?

రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా.. ఎప్పట్లాగే, నేల విడిచి సాము చేసిందన్న అభిప్రాయాలున్నాయి. వాస్తవాల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించలేదని, గత ఏడాది తరహాలోనే కేంద్రంపై అతి నమ్మకం పెట్టుకుందని అంటున్నారు. నిజానికి, గత సంవత్సరం రూ.2,56,958.51 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించి, రూ.2,37,611.52 కోట్లకు సవరించింది. అయినా.. ఈసారి సవరించిన బడ్జెట్‌కు 22.21శాతం (రూ.52,784.48 కోట్లు) పెంచి రూ.2.90 లక్షల కోట్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్‌లో అంచనా వేసిన గ్రాంట్లు లక్ష్యం మేర సమకూరే పరిస్థితులు లేవు. దీనికింద గత బడ్జెట్లో రూ.41,001 కోట్లు వస్తాయని సర్కారు అంచనా వేసింది. కానీ, డిసెంబరు నాటికి కేవలం రూ.7,700 కోట్లే వచ్చాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎంతో కొంత నిధులు వచ్చినా.. మొత్తంమీద, రూ.10-12వేల కోట్ల మధ్య ఉండొచ్చు. అయినా, మళ్లీ కొత్త బడ్జెట్‌లో రూ.41వేలకోట్ల గ్రాంట్లను ఆశించడం విశేషం. అప్పుల విషయంలో మాత్రమే సర్కారు వాస్తవాల ఆధారంగా అంచనాలను ఉంచింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం... ఈసారి బహిరంగ మార్కెట్‌ రుణాల కింద రూ.40,615 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఎప్పట్లాగే, గ్రాంట్లు, అప్పుల ద్వారానే రూ.80వేల కోట్లకుపైగా చూపించింది.

ఈసారి ప్రభుత్వం కొత్తగా ‘ఇంటర్‌ స్టేట్‌ సెటిల్‌మెంట్‌’ అనే కొత్త గ్రాంటును సృష్టించింది. దీని కింద రూ.17,828 కోట్లు ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సి ఉందని, దానిని కేంద్రం ఇప్పిస్తుందని అంచనా వేసింది. విద్యుత్తు సరఫరాకు సంబంధించి రూ.3,441.78కోట్లను అసలు కింద, రూ.3,315.14 కోట్లను వడ్డీ కింద తెలంగాణ డిస్కంలు ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కోకు చెల్లించాలంటూ కేంద్రం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ప్రతిగా, తమకు ఏపీ నుంచి రావాల్సిన రూ.17,828 కోట్లను ఇప్పించాలని బడ్జెట్‌లో డిమాండ్‌ చేసింది. ఈ మూడు పద్దులను నమ్ముకునే దాదాపు లక్ష కోట్లు వస్తాయని అంచనా వేసింది. వీటిలో అప్పులు సరే కానీ.. మిగిలిన వాటి నుంచి ఎన్ని నిధులు వస్తాయన్నది సందేహమే. అయినా, ఈ ఏడాది కేవలం వడ్డీ చెల్లింపుల కింద రూ.22,400 కోట్లు; గతంలో తీసుకున్న అప్పులకు అసలు చెల్లింపుల కింద రూ.12 వేల కోట్లు చెల్లించాల్సి రావడం గమనార్హం.

ఈ పథకాల ఊసు లేదు

ఎన్నికల బడ్జెట్‌ అయినా కొత్త పథకాలను ప్రకటించలేదు. సరికదా, పాత పథకాల్లో కొన్నిటి ప్రస్తావన కూడా లేదు. గిరిజనులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో గిరిజన బంధు పథకాన్ని ప్రకటిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ పథకానికి బడ్జెట్‌లో తప్పకుండా చోటు లభిస్తుందని గిరిజనులు ఆశించారు. కానీ, దాని ప్రస్తావనే లేదు. ఇక, గతంలో బడ్జెట్లలో కనిపించిన నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ప్రస్తావన కూడా ఈ బడ్జెట్లో లేదు. 2018 ఎన్నికల సందర్భంగా ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3,016 చొప్పున భృతిని అందజేస్తామని సర్కారు ప్రకటించింది. ఎనిమిది నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ పథకం అమలు ఊసు లేదు. ఈ బడ్జెట్లో దానికి అసలు చోటు లేదు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన నేపథ్యంలో, ఈసారి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారని రైతులు ఆశించారు. కానీ, బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు. ఇక, మరో ముఖ్య పథకం.. ముఖ్యమంత్రి మానస పుత్రిక ‘మన ఊరు మన బడి’. పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఈ పథకం బడ్జెట్లో ఎక్కడా కనిపించలేదు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 26,065 పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఇందుకు మూడు దశల్లో రూ.7,289 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది.

గత బడ్జెట్లో మొదటి దశ కింద రూ.3,497కోట్లను కేటాయించింది. ఇటీవలే ఈ పథకాన్ని ప్రారంభించింది కూడా. కానీ, తాజా బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. విద్యుత్తు శాఖకు ఈసారి కొద్దిగా ప్రాధాన్యమిచ్చింది. విద్యుత్తు సబ్సిడీ పథకానికి గత బడ్జెట్లో రూ.10,500 కోట్లు కేటాయించగా... ఈసారి అదనంగా రూ.1500కోట్లు పెంచారు. ఎన్నికల ఏడాది కారణంగా ఈసారి సమాచార, పౌర సంబంధాల శాఖకు భారీగా నిధులను కేటాయించింది. ఏకంగా రూ.1000 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్లో ఈ మొత్తం రూ.148 కోట్లే. ఆసరా పింఛన్లకు ఈసారి రూ.271కోట్లు పెంచి రూ.12వేల కోట్లను కేటాయించింది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 61 నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో అదనంగా 8లక్షల మంది అర్హత సాధించనున్నారు. వీరికి గత ఏడాది నిధులు కేటాయించలేదు. ఈసారి అదనంగా రూ.271 కోట్లను కేటాయించినందున.. కొత్తగా ఎంతమందికి ‘ఆసరా’ లభిస్తుందో వేచి చూడాల్సిందే. ఆర్‌ అండ్‌ బీలోని రోడ్ల బ్లాక్‌ టాపింగ్‌ కోసం కొత్తగా ఈసారి రూ.2,500 కోట్లను ప్రత్యేకించడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణకు రూ.2000 కోట్లను కేటాయించింది. గతంలో ఇలాంటి పద్దు లేకపోవడం గమనార్హం.

పన్ను రాబడులపైనే ఆశలు..

రెవెన్యూ రాబడుల విషయంలోనూ వాస్తవాలకు విరుద్ధంగానే సర్కారు బడ్జెట్లో అంచనా వేసింది. కేవలం బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచడానికే అంచనాలను పెంచేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం రూ.1.93 లక్షల కోట్లు రెవెన్యూ రాబడుల కింద వస్తాయని అంచనా వేసింది. కానీ, దానిని బడ్జెట్లో రూ.1.75 లక్షల కోట్లకు సవరించింది. అంటే, ఇక్కడే రూ.17 వేల కోట్లను కుదించింది. అయినా.. ఈసారి దీని అంచనాను మరో రూ.40,764.79 కోట్లను పెంచేసింది. మొత్తంగా రూ.2.16 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ నిధులు రావడంపై ఆర్థిక నిపుణులు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. రాష్ట్ర స్వీయ పన్ను రాబడి కింద రూ.1.26 లక్షల కోట్లు వస్తాయని గత బడ్జెట్లో పేర్కొంది. తాజాగా దానిని రూ.1.10 లక్షల కోట్లకు సవరించింది. అయినా.. ఇప్పుడు మరో రూ.21 వేల కోట్లు పెంచేసి రూ.1.31 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, పన్నేతర రాబడులదీ ఇదే పరిస్థితి. ఈ పద్దు కింద ఈసారి రూ.22,801 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇందులో భూముల అమ్మకం ద్వారా రూ.13,754 కోట్లు వస్తాయని ఆశిస్తోంది. నిజానికి గత సంవత్సరం భూముల అమ్మకం ద్వారా రూ.15,500 కోట్లు వస్తాయని ఆశించినా... పెద్దగా ఫలితం కనిపించలేదు. డిసెంబరు నాటికి రూ.9,962 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే, ప్రతిసారీ సర్కారు భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, ఆచరణలో తక్కువ వ్యయాలు చూపడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం ఆశించిన మేర నిధులు కేంద్రం నుంచి రాకపోతే పథకాల అమలులో పాత కథే పునరావృతం అవుతుందని అంటున్నారు.

Updated Date - 2023-02-07T03:40:13+05:30 IST