సమావేశాలతో సరి!

ABN , First Publish Date - 2023-01-25T01:01:23+05:30 IST

గ్రేటర్‌లో ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవించిందంటే నగరంలోని మంత్రులు తక్షణం స్పందిస్తారు. ఘటనాస్థలిని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించడంతో పాటు..

సమావేశాలతో సరి!

ఘటన జరిగిన ప్రతిసారీ అదే తీరు

ప్రమాద ప్రాంతాలకు మంత్రులు

సమావేశాలు, సమీక్షలంటూ హడావిడి

అనంతరం విస్మరిస్తోన్న వైనం

నేడు మరోసారి మీటింగ్‌

ఇప్పుడైనా చర్యలుంటాయా..?

హైదరాబాద్‌ సిటీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవించిందంటే నగరంలోని మంత్రులు తక్షణం స్పందిస్తారు. ఘటనాస్థలిని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించడంతో పాటు.. రెండు, మూడు రోజుల వ్యవధిలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. బోయిగూడ.. రాణిగంజ్‌.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని రూబీ లాడ్జిలో ప్రమాదాలు జరిగిన సమయంలో ఇదే జరిగింది. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌లు అగ్నిమాపక శాఖ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో వేర్వేరుగా/కలిసి సమావేశం నిర్వహించారు. ఇప్పుడు నల్లగుట్టలోని దక్కన్‌ స్పోర్ట్స్‌ నిట్‌ వేర్‌ కాంప్లెక్స్‌లో ప్రమాదం నేపథ్యంలోనూ సమావేశాలు జరిగాయి. నేడు మరోసారి బీఆర్‌కేఆర్‌ భవనంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. గతంలో జరిగిన మీటింగుల్లో నగరంలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు..? ప్రమాదాల తీవ్రత తక్షణం తగ్గించేలా నివాసేతర భవనాల్లో ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు.? తదితర విషయాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే నిర్మించిన భవనాలను తనిఖీ చేసి అగ్నిమాపక ఏర్పాట్లున్నాయా..? లేదా..? అన్నది గుర్తించేందుకు సర్వే నిర్వహించాలని సూచించారు. నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఇప్పటికీ ఆ దిశగా కనీస చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.

ఇప్పుడైనా..?

గ్రేటర్‌లోని దాదాపు 80 శాతానికిపైగా నివాసేతర భవనాల్లో ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు లేవన్నది అధికారులూ అంగీకరించే సత్యం. గతంలోనే తనిఖీలు, నోటీసుల జారీ పేరిట జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం విభాగం హడావిడి చేసింది. గడువులోపు ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని వాణిజ్య, ఆస్పత్రి భవనాల యజమానులను హెచ్చరించింది. తర్వాత ఆ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మొదట్లో దూకుడుగా వ్యవహరించిన ఈవీడీఎం అధికారులు అనంతరం.. మిన్నకుండటంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. సిబ్బంది లేరంటూ అగ్నిమాపక శాఖ తనిఖీలు చేయడాన్ని ఎప్పుడో విస్మరించింది. ఇదే ప్రమాదాలతో పాటు.. అమాయకులు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమవుతోంది. సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో గత కొంతకాలంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 10, 20 అడుగుల వెడల్పు రోడ్లు ఉండే బేగంబజార్‌లో పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడి భవనాలు, సెల్లార్లలో భారీగా సామగ్రి నిల్వ చేస్తుంటారు. దుర్ఘటన జరిగితే సహాయక చర్యలు చేపట్టడమూ కష్టమే. ఇంతటి ప్రమాదకర పరిస్థితులున్నా.. సందర్శనలు, సమావేశాలకే మంత్రులు, అధికారులు పరిమితమవుతుండడం గమనార్హం. నేడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఇప్పుడైనా ప్రభుత్వ విభాగాలు తగిన చర్యలు తీసుకుంటాయా..? ఎప్పటిలానే సమావేశంతో సరిపెడుతారా చూడాలి.

దక్కన్‌ భవనం పూర్తిగా కూల్చివేత..!

నేడు లేదా రేపు పనులు ప్రారంభం

ఒక్కరోజు గడువుతో టెండర్‌

సికింద్రాబాద్‌ నల్లగుట్టలోని దక్కన్‌ స్పోర్ట్స్‌ నిట్‌ వేర్‌ భవనం పూర్తిగా కూల్చివేయనున్నారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో పలు దఫాలుగా తనిఖీ చేసిన నిపుణుల బృందాల నివేదిక మేరకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోం ది. కూల్చివేత పనులకు సంబంధించి మంగళవారం ఒకరోజు గడువుతో టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించారు. నేడు బిడ్‌లు తెరిచి, అర్హత ఉన్న సంస్థతో ఒప్పందం చేసుకుంటామని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. రూ.41 లక్షల అంచనా వ్యయంతో కూల్చివేత పనులకు టెండర్‌ ప్రకటించారు. ముగ్గురి ఆచూకీపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోన్‌ అధికారు లు.. రెవెన్యూ విభాగానికి లేఖ రాశారు. భవనం కూల్చివేయాలనుకుంటున్నాం..? ఆ ముగ్గురి గుర్తింపుపై స్పష్టత ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. కూల్చివేత సమయంలో అవసరమైన బందోబస్తు చేపట్టాలని, బారీకేడింగ్‌ ఏర్పాటు చేయాలని పోలీసులకూ లేఖ పంపారు. నేడు మధ్యాహ్నం టెండర్‌ తెరిచి.. బిడ్‌ దాఖలు చేసిన సంస్థల్లో అర్హత ఉన్న వారికి పనులు అప్పగించనున్నారు. రెవెన్యూ విభాగం సమాధానం, ఎంపికైన ఏజెన్సీ యంత్రాలు సమకూర్చుకోవడాన్ని బట్టి నేడు సాయంత్రం లేదా గురువారం కూల్చివేత మొదలయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-01-25T01:01:23+05:30 IST