కొత్తగా ఈహెచ్‌ఎస్‌

ABN , First Publish Date - 2023-02-07T04:05:20+05:30 IST

‘‘దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బడుగు, బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలు..

కొత్తగా ఈహెచ్‌ఎస్‌

పథకం అమలుకు హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌.. ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తాం

రైతుల కళ్లల్లో దీనత్వం బదులు ధీరత్వం

ఎన్ని కుట్రలు చేసినా ప్రజాబలం తగ్గదు

మూలధన వ్యయం రూ.37,525 కోట్లు

కొత్త ఉద్యోగులకు అదనంగా వెయ్యి కోట్లు

33 జిల్లాల్లోనూ కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌

వరుసగా నాలుగోసారి హరీశ్‌రావు బడ్జెట్‌

సబ్బండ వర్గాల సంపూర్ణ వికాసమే లక్ష్యం: హరీశ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘‘దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బడుగు, బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలు.. ఇలా అందరి జీవితాల్లో సంపూర్ణ వికాసం సాధించేంత వరకూ విరామం లేకుండా పరిశ్రమిస్తూనే ఉంటాం. ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తాం. దేశంలో ప్రతిఘాత శక్తులు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణలో గంగా జమునా తెహజీబ్‌ను పరిరక్షిస్తున్నాం. శాంతి, సామరస్యాలను కంటికి రెప్పలా కాపాడుతున్నాం. ఎవరెన్ని కుట్రలు చేసినా మా మనోబలం, మాకున్న ప్రజాబలం చెక్కు చెదరదు. సీఎం కేసీఆర్‌ పాలనలో రైతుల కళ్లలో దీనత్వం తగ్గి.. ధీరత్వం తొణికిసలాడుతోంది. ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అని చెప్పుకొనే స్థాయికి చేరుకుంది. మానవీయ దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచన, దార్శనిక ప్రణాళిక, పారదర్శక పరిపాలన మేలు కలయిక అయిన తెలంగాణ మోడల్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటోంది’’ అని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాష్ట్రానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సోమవారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన హరీశ్‌ 10.15 గంటలకు బ్రీఫ్‌ కేస్‌తో సభలో అడుగు పెట్టారు. ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి కండువాను ఆయనకు కప్పారు. సరిగ్గా పదిన్నరకు హరీశ్‌ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ రూ.2,90,396 కోట్లుగా ఉంటుందని, ఇందులో రెవెన్యూ వ్యయంరూ.2,11,685 కోట్లుగా, మూలధన వ్యయాన్ని రూ.37,525 కోట్లుగా ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ‘‘దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.9 శాతం మాత్రమే. కానీ, 2014-15లో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం అయితే.. 2020-21 నాటికి 4.9 శాతానికి చేరింది. 2015-16 నుంచి 2020-21 దాకా జీఎస్డీపీ 12.6 శాతం పెరిగింది. సగటు వార్షిక వృద్ధి రేటులో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఇక, 2013-14లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,12,162 అయితే.. 2022-23లో రూ.3,17,115 కోట్లుగా ఉండే అవకాశం ఉంది’’ అని వివరించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఏప్రిల్‌ నుంచి క్రమబద్ధీకరిస్తామని, సెర్ప్‌ ఉద్యోగుల వేతన సవరణ చేస్తామని ప్రకటించారు.

ఇక 33 జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌

గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రస్తుతం ఆదిలాబాద్‌, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల, ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌ కర్నూలు, వికారాబాద్‌ జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ ఏడాది నుంచి దీనిని 33జిల్లాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు హరీశ్‌ వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఏటా 4 లక్షల మంది గర్భిణులు లబ్ధి పొందనున్నారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 60 జూనియర్‌, సీనియర్‌, జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు హరీశ్‌ తెలిపారు. 23 జిల్లా కోర్టులు, న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేశామని, వీటి నిర్వహణకు 1721పోస్టులను మంజూరు చేశామని, రూ.1,050 కోట్లతో కొత్త కోర్టు భవనాల నిర్మాణం చేపట్టామని చెప్పారు.

ఆహార పరిశ్రమలకు ఊతం

హైదరాబాద్‌ మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో 7,150 ఎకరాల్లో 21 కొత్త స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు హరీశ్‌ ప్రకటించారు. వీటికి అవసరమైన అప్రోచ్‌, అంతర్గత రోడ్లు, విద్యుత్‌, నీటి సౌకర్యాలతోపాటు గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మార్చినాటికి అంబేడ్కర్‌ విగ్రహం

125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం మార్చి నాటికి పూర్తికానుందని హరీశ్‌ చెప్పారు. అమరుల స్మృతివనం ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. 29 జిల్లాల్లో రూ.1,581 కోట్లతో సమీకృత కలెక్టరేట్లు కడుతున్నామని, వీటిలో 17 పూర్తయ్యాయని, మిగిలినవి తుది దశలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.500 కోట్లు వెచ్చించనున్నామని తెలిపారు.

13 లక్షల ఎకరాల అడవికి పునరుజ్జీవం

రూ.1500 కోట్ల వ్యయంతో 13 లక్షల ఎకరాల్లోని అడవికి పునరుజ్జీవం కల్పించామని హరీశ్‌ తెలిపారు. రాష్ట్రంలో పులుల సంఖ్య 26కు; చిరుతల సంఖ్య 341కి చేరిందన్నారు. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ 7.70 శాతానికి పెరిగిందన్నారు. ఇది 5.13 లక్షల ఎకరాలకు సమానమన్నారు.

ఈ ఏడాదే కొత్త ఈహెచ్‌ఎస్‌ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తితో ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎ్‌స) నూతన విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తేనున్నామని హరీశ్‌ తెలిపారు. ఇందుకు ఎంప్లాయీస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని, అందులో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములను చేస్తామని వెల్లడించారు.

కొత్త ఉద్యోగులకు వెయ్యి కోట్లు

కొత్తగా నియమించనున్న ఉద్యోగుల జీతభత్యాల కోసం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు అదనంగా ప్రతిపాదించినట్లు హరీశ్‌ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,41,735 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిందని, 80,039పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేస్తామన్నారు.

Updated Date - 2023-02-07T04:05:23+05:30 IST