ఇది జీరో బడ్జెట్‌!

ABN , First Publish Date - 2023-02-07T04:07:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జీరో బడ్జెట్‌ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం జోడో యాత్రలో భాగంగా ములుగు జిల్లా ప్రాజెక్టునగర్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ..

ఇది జీరో బడ్జెట్‌!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ఇది మేడి పండు బడ్జెట్‌: భట్టి

దిశానిర్దేశం లేని పద్దు: ఉత్తమ్‌

భూపాలపల్లి/హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జీరో బడ్జెట్‌ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం జోడో యాత్రలో భాగంగా ములుగు జిల్లా ప్రాజెక్టునగర్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ వచ్చాక బడ్జెట్‌ కేటాయింపులకు, ఖర్చులకు పొంతన ఉండడం లేదన్నారు. గత బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.15 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తే పైసా ఖర్చు చేయలేదని చెప్పారు. అనేక పథకాలకు, అభివృద్ధి పనులకు, కేటాయింపులకు, ఖర్చులకు 30 శాతం పైగా తేడా ఉంటుందని పేర్కొన్నారు. భూప్రపంచంలో ఇంత వ్యత్యాసం ఉన్న బడ్జెట్‌ ఎవరూ ప్రవేశ పెట్టలేదన్నారు. ‘ఇచ్చేది లేదు.. చచ్చేది లేదు.. రాస్కో సాంబా..?’ అన్నట్టు రాసుకొని, అసెంబ్లీలో చదివారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మేడిపండు చందంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. అంకెల గారడీ, మాయమాటలతో రంగుల ప్రపంచాన్ని చూపారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ అనేక జిల్లాల్లో విద్యుత్తు కోతలపై రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే వెలుగులు, జిలుగులంటూ గొప్పగా చెప్పుకోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో రూ.6,229 కోట్లు కేటాయించారని, దీన్నిబట్టే బీసీలంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో స్పష్టమవుతోందని అన్నారు. గతంలో మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు దిశానిర్దేశం లేదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆదాయానికి, ఖర్చులకు ఎక్కడా పొంతన కుదరడం లేదన్నారు. హరీశ్‌రావు ప్రసంగమంతా కేసీఆర్‌ను పొగడడానికే పరిమితం చేశారని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో బలహీన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఇది ప్రగల్భాల బడ్జెట్‌ అని మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2023-02-07T04:07:19+05:30 IST