రాష్ట్ర బడ్జెట్‌ కరుణించేనా?

ABN , First Publish Date - 2023-02-06T10:19:44+05:30 IST

అంతర్జాతీయ ఖ్యాతి.. పెట్టుబడుల స్వర్గధామంగా చెప్పుకునే మహానగరానికి కేంద్ర బడ్జెట్‌లో నిరాశే

రాష్ట్ర బడ్జెట్‌ కరుణించేనా?

అంతర్జాతీయ ఖ్యాతి.. పెట్టుబడుల స్వర్గధామంగా చెప్పుకునే మహానగరానికి కేంద్ర బడ్జెట్‌లో నిరాశే మిగిలింది. ఇప్పుడిక రాష్ట్ర బడ్జెట్‌ వంతు. అభివృద్ధి.. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయిస్తుందా? వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం భవిష్యత్‌ ఏమిటీ? ఏటా వర్షాలు వచ్చినప్పుడు నీట మునిగే ముంపు ప్రాంతాల కోసం ఉద్దేశించిన వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమానికి నిధులు దక్కుతాయా? నగర రోడ్లపై నిత్యం ఏరులై పారుతున్న మురుగు నీటి నిర్వహణపై ఈ బడ్జెట్‌ దృష్టి పెడుతుందా? పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తారా? ఇతర విభాగాలకు కేటాయింపు ఎలా ఉండనున్నాయి? అనేది నేటి రాష్ట్ర బడ్జెట్‌లో తేలనుంది.

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ ఇప్పటికే అప్పుల కుప్పగా మారింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పనులకూ పైసలు లేవు. గ్రాంట్ల రూపంలో సర్కారు నామమాత్రంగానే నిధులు విడుదల చేస్తోంది. 2020-21 బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి రూ.10 వేల కోట్లు కేటాయించిన సర్కారు ఆ తర్వాత పైసా విదల్చలేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ రెండో దశ, లింక్‌/మిస్సింగ్‌ రోడ్లకు నిధులు ఇవ్వాలని ఇప్పటికే బల్దియా ప్రభుత్వాన్ని కోరింది. ఇక గత బడ్జెట్‌లో వాటర్‌ బోర్డుకు రూ. 1,925 కోట్లు కేటాయించగా, అందులో ఎక్కువగా అప్పులకే ప్రాధాన్యం ఇచ్చారు. హెచ్‌ఎండీఏ ఔటర్‌ కాంట్రాక్టర్లకు యూన్యూటీ కింద ఏటా రూ. 338.52 కోట్ల వరకు చెల్లిస్తోంది. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఏళ్లుగా సంస్థే దీనిని చెల్లిస్తోంది. శివారు ప్రాంతాల్లో చేపడుతున్న భారీ ప్రాజెక్టులు, అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో నిధులివ్వాలని సంస్థ కోరుతోంది.

హెల్త్‌కు హెల్ప్‌ చేస్తారా..

గ్రేటర్‌లో ఆస్పత్రుల అభివృద్ధికి ఈసారి ఎక్కువ కేటాయింపులు ఉంటాయనే భావనతో వైద్యశాఖాధికారులున్నారు. నగరానికి నాలుగు వైపులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులకు ప్రభుత్వం భూమి పూజ చేసింది. త్వరలో కొత్త ఆస్పత్రుల నిర్మాణ పనులు మొదలవుతాయనే ఆశతో ప్రజలున్నారు. నిమ్స్‌, నిలోఫర్‌, ఎంఎన్‌జే ఆస్పత్రులలో కొత్తగా నిర్మాణం చేపట్టనున్న అదనపు బ్లాక్‌లకు అవసరమైన నిధులు కేటాయింపులపై ఆశలు పెట్టుకున్నారు. ఉస్మానియా, చెస్ట్‌ ఆస్పత్రుల కొత్త భవనాలకు ఈ సారైనా బడ్జెట్‌లో మోక్షం ఉంటుందనే ఆశతో ఉన్నారు.

ఎంఎంటీ‘ఎస్‌’.. అనేనా..!

కేంద్ర బడ్జెట్‌లో రూ.600 కోట్లు దక్కించుకున్న ఎంఎంటీఎస్‌ రెండో దశ విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా దక్కుతుందా అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. రెండోదశ ప్రాజెక్టు కింద సికింద్రాబాద్‌-భువనగిరి, సికింద్రాబాద్‌-మనోహరాబాద్‌, ఫలక్‌నుమా-ఉందానగర్‌, మౌలాలి-సనత్‌నగర్‌ బైపాస్‌ మార్గాల్లో ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. రూ.817 కోట్ల అంచనా వ్యయంలో మూడొంతుల నిధులు రాష్ట్రం, రెండొంతుల నిధులు కేంద్రం ఇవ్వాలని నిర్ణయించాయి. కేంద్రం తన వాటా కింద ఇప్పటివరకు రూ.434 కోట్లు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం వరకు రూ.129 కోట్లు ఇచ్చింది. ఇటీవల మరో రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అయితే, రాష్ట్రం సహకరించడంలేదనే భావనతో కేంద్రం 2023-24 వార్షిక బడ్జెట్‌లో ఏకంగా రూ.600 కోట్లు కేటాయించింది. 2024 మార్చి నాటికి 20 కొత్త రైళ్లను కొనుగోలు చేసి ఆయా మార్గాల్లో నడిపిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్‌ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర బడ్జెట్‌పై ఆశలు..

ఎంఎంటీఎస్‌ రెండోదశ విస్తరణ పనుల వ్యయం ప్రస్తుతం రూ.1,150 కోట్లకు చేరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను అందజేసి మాట నిలబెట్టుకుంటుందా.. గాలికి వదిలేస్తుందా.. అనేదానిపై నగరవాసులు నిరీక్షిస్తున్నారు.

ఆశల పల్లకిలో ఆర్టీసీ

2025 నాటికి గ్రేటర్‌లో మొత్తం ఎలక్ర్టిక్‌ బస్సులను అందుబాటులోకి తెస్తామని టీఎ్‌సఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాటి కొనుగోళ్లకు వెయ్యికోట్లకు పైగా నిధులు అవసరం. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించే దిశగా అడుగులు పడుతాయని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. ఎంజీబీఎస్‌, జేబీఎ్‌సలో జిల్లా ప్రయాణికుల రద్దీ రెట్టింపయిన నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో నాలుగు అత్యాధునిక బస్టాండ్లు నిర్మించాలని టీఎ్‌సఆర్టీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌పై టీఎస్‌ ఆర్టీసీ భారీగా ఆశలు పెట్టుకుంది.

‘మెట్రో’ రెండో దశ తిరిగేనా..!

నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రోరైలు రెండో దశ విస్తరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2017 నవంబర్‌ 29న మొదటి దశ రైళ్లు పట్టాలెక్కి విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో రెండో దశ విస్తరణకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో రాయదుర్గం రహేజా మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31కి.మీ. బీహెచ్‌ఈఎల్‌ నుంచి కొండాపూర్‌ వయా మెహిదీపట్నం, లక్డీకా పూల్‌ వరకు 26 కి.మీ., నాగోలు-ఎల్‌బీనగర్‌ మధ్యలో 5 కి.మీ. పూర్తి చేసి ఆయా ప్రాంతాల ప్రజలకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 31 కి.మీ. మార్గాన్ని పూర్తి చేసేందుకు రూ.6,250 కోట్లు కేటాయించింది. గతేడాది డిసెంబర్‌ 9న హెచ్‌ఎండీఏ రూ.625 కోట్లు, జీఎంఆర్‌ సంస్థ రూ.625 కోట్లు అందజేసి పనుల్లో భాగస్వామ్యం పంచుకున్నాయి. మూడేళ్ల లోపు పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంల్‌) ఇప్పటికే రెండు విడతలుగా సర్వే చేపట్టింది. అయితే బడ్జెట్‌లో ఎయిర్‌పోర్టు కారిడార్‌తోపాటు రెండో దశలోని బీహెచ్‌ఈఎల్‌-లక్డీకాపూల్‌, నాగోలు-ఎల్‌బీనగర్‌ మార్గానికి ఎన్ని నిధులు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

పాతబస్తీ మార్గాన్ని పట్టించుకోరూ..

కారిడార్‌-2లో జేబీఎ్‌స-ఫలక్‌నుమా మార్గంలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మిగిలిన 5.5 కి.మీ. పనులను పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటివరకు చర్యలు చేపట్టడంలేదు. శనివారం శాసనసభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ పాతబస్తీ మెట్రో విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు. ఈ తరుణంలో తాజా బడ్జెట్‌పై మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. గత బడ్జెట్‌లో పాతబస్తీ వరకు మెట్రో పూర్తి చేసేందుకు రూ.500కోట్లను కేటాయించినా రూపాయి ఖర్చు చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఈసారి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోనని పాతబస్తీవాసులు ఎదురుచూస్తున్నారు.

ప్రత్యేక సెల్‌కు మోక్షం లభించేనా..

నగరంలో విస్తరిస్తున్న డ్రగ్స్‌ మాఫియాను వేళ్లతో సహా పెకిలించేందుకు వెయ్యి మంది పోలీస్‌ సిబ్బందితో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏడాదైనా కార్యరూపం దాల్చలేదు. ప్రత్యేక సిబ్బంది, కార్యాలయానికి నిధుల కేటాయింపునకు సోమవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో స్థానముంటుందనే అంచనాలు ఉన్నాయి. ట్రై కమిషనరేట్లలో నాలుగు కొత్త జోన్‌లు, 15 కొత్త డివిజన్లు, 29 కొత్త పీఎ్‌సల కార్యాలయాల ఏర్పాటుకు నిధులు కేటాయించే అవకాశముందని పోలీ్‌సశాఖ భావిస్తోంది. మరోవైపు పాత భవనాల్లోనే కొనసాగుతున్న పోలీ్‌సస్టేషన్లకు సైతం కొత్త భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తారనే ఆశతో పోలీసులు ఎదురుచూస్తున్నారు.

ఇళ్లపై తీగలు.. తొలగేనా వెతలు

గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో ఇళ్లపై నుంచి వెళ్తున్న ఓవర్‌ హెడ్‌ లైన్లు (విద్యుత్‌ తీగలు) తొలగించేందుకు రూ. 600 కోట్లు ఖర్చవుతోందని విద్యుత్‌శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్‌లో ఇళ్లపై ప్రమాదంగా మారిన విద్యుత్‌తీగలు తొలగిస్తామని ఐదేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో అయినా నిధులు కేటాయిస్తారని విద్యుత్‌శాఖ ఆశిస్తోంది.

Updated Date - 2023-02-06T10:19:46+05:30 IST