37 వేల కోట్లడిగితే.. 26 వేల కోట్లు కేటాయించారు!

ABN , First Publish Date - 2023-02-07T04:32:41+05:30 IST

నీటిపారుదల శాఖ ప్రతిపాదనలకు, ప్రభుత్వ కేటాయింపులకు భారీ వ్యత్యాసం ఉంది.

37 వేల కోట్లడిగితే.. 26 వేల కోట్లు కేటాయించారు!

నీటిపారుదల శాఖకు నిరాశే.. వడ్డీల చెల్లింపులకే రూ.16 వేల కోట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖ ప్రతిపాదనలకు, ప్రభుత్వ కేటాయింపులకు భారీ వ్యత్యాసం ఉంది. రానున్న ఆర్థిక సంవత్సరం (2023-24)లో ప్రాజెక్టుల నిర్మాణాలు, రుణాల చెల్లింపులకు రూ.37వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. సర్కారు రూ.26,868 కోట్లే కేటాయించింది! ఈ ఆర్థిక సంవత్సరంలో కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల రుణాల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. వీటికే రూ.16 వేల కోట్లవుతాయి. కాళేశ్వరం కార్పొరేషన్‌ రుణాలకు రూ.12,500 కోట్లు, తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ రుణాలకు రూ.3200 కోట్లు చెల్లించాల్సి ఉంది. బడ్జెట్‌ కేటాయింపుల్లో మిగిలేది రూ.10 వేల కోట్లే. భారీ ప్రాజెక్టులకు నిరుడు రూ.8050.70 కోట్లు కేటాయించగా..రూ.6051.70 కోట్లే విడుదలచేశారు. ఈసారి రూ.8051.48 కోట్లు కేటాయించడం గమనార్హం. మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.335.58 కోట్లు, చిన్నతరహా ప్రాజెక్టులకు రూ.1301.58 కోట్లు కేటాయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పనులకు రూ.7 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో బడ్జెట్‌ కేటాయింపులు బకాయిలకే సరిపోతాయి.

Updated Date - 2023-02-07T04:32:42+05:30 IST