పుర నిధుల్లో హైదరాబాద్‌కే అధికం!

ABN , First Publish Date - 2023-02-07T04:25:58+05:30 IST

బడ్జెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిధుల్లో అధికంగా హైదరాబాద్‌కే మళ్లించారు. రూ.11,372 కోట్లను కేటాయించగా..

పుర నిధుల్లో హైదరాబాద్‌కే  అధికం!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిధుల్లో అధికంగా హైదరాబాద్‌కే మళ్లించారు. రూ.11,372 కోట్లను కేటాయించగా.. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైలు కనెక్టివిటీకి రూ.500 కోట్లు, పాతనగర మెట్రో లైన్‌ కోసం రూ.500 కోట్లు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు, హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ ఉన్న గ్రామాలు, మునిసిపాలిటీల్లో నీటి సరఫరా కోసం రూ.300కోట్లు, వాటర్‌వర్క్స్‌ ద్వారా వివిధ పనులకు రూ.300 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు కోసం ఈసారి రూ.1,474 కోట్లు, పట్టణాల్లో మిషన్‌ భగీరథ నిర్వహణకు రూ.900 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్ల నిర్మాణానికి రూ.400 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. 2021-22 బడ్జెట్లో రూ.15,030కోట్లు కేటాయించగా 2022-23లో రూ.4,127కోట్లను తగ్గించారు. ఈసారీ నిధులు స్వల్పంగా రూ.469కోట్లు మాత్రమే పెరిగాయి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నిధుల పెంపుపై దృష్టి పెట్టలేదని ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-02-07T04:25:59+05:30 IST