మిగతా రెండు డీఏలూ ఇవ్వండి!

ABN , First Publish Date - 2023-01-25T02:45:51+05:30 IST

కరువు భత్యా లపై ఉద్యోగులు, పెన్షనర్ల డిమాండ్లు మరింత పెరిగాయి.

మిగతా రెండు డీఏలూ ఇవ్వండి!

ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాల డిమాండ్‌

ఇంకా రెండు డీఏల మొత్తం 6.47% రావాలి

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కరువు భత్యా లపై ఉద్యోగులు, పెన్షనర్ల డిమాండ్లు మరింత పెరిగాయి. ఒక్క డీఏతోనే సరిపెట్టకుండా మిగతా రెండు డీఏలను కూడా వెంటనే ప్రకటించి, అమలు చేయాలని కోరుతున్నారు. ఈ జనవరితో ప్రారంభమైన మరో డీఏపైనా కసరత్తు చేయాలని అంటున్నారు. రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభు త్వం సోమవారం ఒక కరువు భత్యాన్ని(డీఏ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫలితంగా మిగతా రెండు డీఏలు ఎప్పుడు? అన్న చర్చ జరుగుతోంది. డీఏలను పెండింగ్‌లో పెట్టడం వల్ల తాము నష్టపోయే ప్రమాదం ఉందని సంఘా ల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మొత్తం మూడు డీఏలు(1.7.2021, 1.1.2022, 1.7.2022) రావాల్సి ఉంది. ఈ మూడు డీఏలను కేంద్రం ఇప్పటికే ప్రకటించి, అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏల మొత్తం 10% మేర వేతనాల్లో కలిసిపోయింది. అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏల మొత్తం 9.1% మేర వేతనాల్లో కలవాలి. కానీ.. సోమవారం రాష్ట్రప్రభుత్వం 1.7.2021కు సంబంధించిన డీఏ 2.73%ను ఉద్యోగుల వేతనాల్లో కలి పింది. ఇంకా రెండు డీఏలు రావాల్సి ఉంది. 1.1.2022కు సంబంధించిన డీఏ 2.73%, 1.7.2022 తాలూకు డీఏ 3.74% మొత్తం 6.47% వేతనాల్లో కలవాలి. వీటిని కూడా వెంటనే విడుదల చేయాలని సంఘాల నేతలు కోరుతున్నారు. మూడు డీఏలను పెండింగ్‌లో పెట్టడం వల్ల తమ వేతనాలు పెరగకుండా పోయాయని తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసి యేషన్‌(టీ) రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్‌ కుమార స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు డీఏలను వేతనాల్లో కలిపితే ఇబ్బంది ఉండదన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని డీఏలను క్రమం తప్పకుండా ప్రకటించా లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్‌ కె.లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్‌ టి.సుభాకర్‌రావు, వైస్‌ చైర్మన్‌ ఎస్‌.జ్ఞానేశ్వర్‌ ఓ ప్రకటనలో కోరారు.

Updated Date - 2023-01-25T02:45:51+05:30 IST