Hyderabad City: అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతి ఇక..

ABN , First Publish Date - 2023-02-06T12:46:26+05:30 IST

వేసవికాలం రాబోతుంది. ఈ కాలంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో

Hyderabad City: అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతి ఇక..

హైదరాబాద్‌ సిటీ: వేసవికాలం రాబోతుంది. ఈ కాలంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో గ్యాస్‌ సిలిండర్లు పేలుతుంటాయి. అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశముంది. సిలిండర్లను జాగ్రత్తగా వినియోగిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చు. సిలిండర్‌కు ఉపయోగించే రబ్బర్‌ ట్యూబ్‌ సరిగా లేకపోవడం, నాబ్‌ను వినియోగించడంలో అజాగ్రత్తగా వ్యవహరించడం, రబ్బర్‌ ట్యూబ్‌కు ఏర్పడిన రంధ్రాల ద్వారా గ్యాస్‌ లీకవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. సిలిండర్లను జాగ్రత్తగా వినియోగించాలని వారు సూచిస్తున్నారు.

వీటిని పరిశీలించాలి

సేఫ్టీ క్యాప్‌ని తొలగించడానికి, దాని తాడుని లాగి ఆ క్యాప్‌ వాల్వు మీద నుంచి పైకి తీయాలి.

రెగ్యులేటర్‌ స్విచ్‌ నాబ్‌ ‘ఆఫ్‌’ స్థానంలో ఉందో లేదో సరి చూసుకోవాలి.

రెగ్యులేటర్‌కు ఉన్న నల్లని ప్లాస్టిక్‌ బుష్‌ పైకి లాగాలి

రెగ్యులేటర్‌ను నిలువుగా వాల్వు మీద ఉంచి కిందకు నొక్కాలి.

ఉపయోగంలో లేని సమయంలో రెగ్యులేటర్‌ స్విచ్‌ను ‘ఆఫ్‌’ స్థానంలో ఉంచాలి.

రెగ్యులేటర్‌ స్విచ్‌ నాబ్‌ను ఆన్‌ స్థానంలో మీదకు ఉండేలా తిప్పాలి. ఇలా చేయడం వల్ల సిలిండర్‌ మీద ఉన్న వాల్వు తెరుచుకుంటుంది. తద్వారా గ్యాస్‌ రెగ్యులేటర్‌ ద్వారా స్టౌవ్‌ మీద గల బర్నర్‌కు చేరుతుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

సిలిండర్‌ను పడుకోపెట్టవద్దు, నిలువుగా ఉంచాలి.

స్టౌవ్‌ను సిలిండర్‌ కంటే ఎత్తులో ఉంచాలి.

సిలిండర్‌ నుంచి స్టౌవ్‌ వరకు ఒకే రబ్బర్‌ ట్యూబ్‌ను వినియోగించాలి.

గ్యాస్‌ ఏజెన్సీలో విక్రయించే రబ్బర్‌ ట్యూబ్‌లనే వాడాలి

సిలిండర్‌ను కప్‌బోర్డులో ఉంచాల్సి వస్తే గాలి, వెలుతురు ఉండేలా చూడాలి.

రబ్బర్‌ ట్యూబ్‌ను ఏడాది నుంచి రెండు సంవత్సరాలకు మార్చాలి.

లీకేజీ వాసన వస్తే..

కొన్నిసార్లు ఇంట్లో గ్యాస్‌ లీకేజీ వాసన వస్తుంది. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

లైట్లు, అగ్గిపుల్ల వెలిగించడం, ఫ్యాన్‌ వేయడం వంటివి చేయవద్దు.

కిటికీలు, తలుపులు తెరిచి, గాలి, వెలుతురు వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

గ్యాస్‌ స్టౌవ్‌ నాబ్‌ మూసి ఉందో లేదో పరిశీలించాలి.

మంటలు వస్తుంటే ఆర్పే ప్రయత్నం చేయాలి.

గ్యాస్‌ పైప్‌ ఊడిందా.. రంధ్రాలు ఉన్నాయా అని గమనించాలి.

వాసన ఎక్కువగా వస్తుంటే సమీపంలోని గ్యాస్‌ ఏజెన్సీకి ఫోన్‌ చేయాలి.

సిలిండర్‌ పక్కనే కిరోసిన్‌, పెట్రోల్‌ వంటి మండడానికి ఆస్కారమున్న వాటిని ఏర్పాటు చేయవద్దు.

ఇలా చేయొద్దు

గ్యాస్‌ అయిపోయిన తరువాత కొందరు సిలిండర్‌ ను పడుకోపెట్టి స్టౌవ్‌ వెలిగిస్తారు. ఇలా చేయడం ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో సిలిండర్‌ను పడుకోపెట్టవద్దు.

సిలిండర్‌ ఎత్తుభాగంలో, స్టౌవ్‌ కింద భాగంలో ఉంచి వంటలు చేయవద్దు.

గ్యాస్‌ పైపునకు ‘టీ’ వంటి వాటిని అమర్చవద్దు. రెండు పైపులను జోడించి ఉపయోగించవద్దు.

ఫుట్‌పాత్‌, బజార్లలో విక్రయించే రబ్బర్‌ ట్యూబ్‌లను వాడొద్దు. రబ్బర్‌ ట్యూబ్‌కు కవర్లు తొడగవద్దు.

వంటగదిలో మంటలు వచ్చిన సమయంలో సిలిండర్‌ను వేరు చేయవద్దు.

ముందుగా బర్నర్‌ మీద గల అన్ని రంధ్రాలను మూసి ఉంచాలి.

రెగ్యులేటర్‌ స్విచ్‌నాబ్‌ను ‘ఆన్‌’ స్థానం నుంచి ‘ఆఫ్‌’ స్థానంలోకి తిప్పాలి.

రెగ్యులేటర్‌ను గట్టిగా పట్టుకుని బుష్‌ (నల్లని ప్లాస్టిక్‌ లాకింగ్‌ రింగ్‌)ను పైకి లాగాలి.

వాల్వుపైన సేఫ్టీ క్యాప్‌ని పెట్టాలి. క్లిక్‌ మనే శబ్ధం వినిపించే వరకు క్యాప్‌ను సరిసమానంగా కిందకు నొక్కాలి. అప్పుడు ఖాళీ సిలిండర్‌ను తొలగించాలి.

Updated Date - 2023-02-06T12:46:28+05:30 IST