వేడినూనెలో వేయించి.. ఎలా ఉందని అడిగినట్టుంది

ABN , First Publish Date - 2023-02-07T03:42:05+05:30 IST

అసెంబ్లీ ఆవరణలోని శాసనసభాపక్ష కార్యాలయాల వద్ద సోమవారం బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

వేడినూనెలో వేయించి.. ఎలా ఉందని అడిగినట్టుంది

పలకరించిన మర్రి జనార్దన్‌రెడ్డితో ఈటల రాజేందర్‌

కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ లేదనే అక్బరుద్దీన్‌ ఫైర్‌: రఘునందన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఆవరణలోని శాసనసభాపక్ష కార్యాలయాల వద్ద సోమవారం బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను బీఆర్‌ఎస్‌ (నాగర్‌కర్నూల్‌) ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా పలకరించారు. దీంతో, ‘‘మాతో మాట్లాడితే మీవాళ్లు భయపడరా? నన్ను పలకరించే ధైర్యం ఉందా?’’ అని ఈటల అన్నారు. ఇందుకు జనార్దన్‌రెడ్డి స్పందిస్తూ, ‘‘దానిదేముందన్నా! రాజకీయం వేరు.. వ్యక్తిగత సంబంధం వేరు’’ అని బదులిచ్చారు. ఎలా ఉన్నారు? అని ఈటలను అడిగారు. ఈటల బదులిస్తూ, ‘‘వేడినూనెలో వేయించి.. ఎలా ఉంది? అని అడిగినట్టుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలిప్పుడు విలువలు ఎక్కడున్నాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. వేర్వేరు పార్టీల నేతలు కనీసం మర్యాదపూర్వకంగా పలకరించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. ‘‘నేను నియోజకవర్గ పనుల కోసం మంత్రి హరీశ్‌రావును కలిస్తే.. బీఆర్‌ఎ్‌సలో చేరతున్నానంటూ ప్రచారం చేశారు. బీఆర్‌ఎ్‌సకు మజ్లిస్‌ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. మంత్రి కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం వల్లే అక్బరుద్దీన్‌ శాసనసభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు’’ అని రఘునందన్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-07T03:42:06+05:30 IST