ఎన్నికల స్టంట్‌.. డొల్ల బడ్జెట్‌

ABN , First Publish Date - 2023-02-07T04:01:45+05:30 IST

అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా డొల్లేనని, ఎలక్షన్‌ స్టంట్‌ తప్ప మరొకటి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు.

ఎన్నికల స్టంట్‌.. డొల్ల బడ్జెట్‌

సీఎం కేసీఆర్‌.. అన్ని వర్గాలను వంచించారు: సంజయ్‌

సాహిత్యం ఎక్కువ.. సమాచారం తక్కువ: కిషన్‌రెడ్డి

ఏనుగులా బడ్జెట్‌.. ఎలుక తోకలా కేటాయింపులు: లక్ష్మణ్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా డొల్లేనని, ఎలక్షన్‌ స్టంట్‌ తప్ప మరొకటి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహా అన్ని వర్గాలను వంచించేలా కేసీఆర్‌ సర్కార్‌ బడ్జెట్‌ను రూపొందించిందని ఆరోపించారు. రూ.2,90,396కోట్ల అంచనాతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. రూ.1.31లక్షల కోట్ల ఆదాయాన్నే చూపిందని పేర్కొన్నారు. మిగతా రూ.1.60లక్షల కోట్లలో కేంద్రం గ్రాంట్లు, పన్నుల వాటా రూపేణా రూ.62వేల కోట్లు వస్తాయనుకున్నా.. మిగిలిన లక్ష కోట్ల మాటేమిటని నిలదీశారు. కేసీఆర్‌ సర్కారు తీరును బీజేపీ పక్షాన ప్రజల్లో ఎండగడతామని ప్రకటించారు. రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేయాలంటే రూ.19,700కోట్లు కావాల్సి ఉండగా.. బడ్జెట్‌లో రూ.6,285కోట్లే కేటాయించారని పేర్కొన్నారు. ‘దళిత బంధు’ పేరిట మరోసారి దగా చేశారని, రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలంటే మరో శతాబ్దం కూడా సరిపోదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో 52శాతానికిపైగా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో 2శాతం నిధులే కేటాయించడం బాధాకరమని అన్నారు. పరిపాలనా వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నదే కేసీఆర్‌ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొనడం మిలీనియం ఆఫ్‌ ది జోక్‌గా అభివర్ణించారు. చెప్పేది గొప్ప.. చేసేది సున్నా.. ఇదీ బీఆర్‌ఎస్‌ బడ్జెట్‌.. అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేస్తారా? లేదా? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.2.90లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ ప్రవేశపెట్టినా.. ఉద్యోగులకు మొదటివారంలో జీతాలివ్వలేకపోవడం ఏం గొప్పదనం? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఓ గిమ్మిక్కు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇందులో సాహిత్యం ఎక్కువగా, సమాచారం తక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రచారం కోసం రూ.1000 కోట్లను కేటాయించిన ప్రభుత్వం...పేదలకు భరోసాను ఇచ్చే ‘ఆరోగ్య శ్రీ’ పథకానికీ దాదాపుగా అంతే మొత్తాన్ని కేటాయించడం దారుణమని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఏనుగు తొండంలా ఉందని, కేటాయింపులు మాత్రం ఎలుక తోకలా ఉన్నాయని ఎంపీ లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో అంకెలను భారీగా పెంచి ప్రజలను భ్రమపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.

Updated Date - 2023-02-07T04:01:46+05:30 IST