పంటల బీమా ఇక లేనట్లే!

ABN , First Publish Date - 2023-02-07T04:21:17+05:30 IST

తాజా బడ్జెట్‌లో పంటల బీమా పథకం ప్రస్తావనే లేదు. నయాపైసా నిధులు కేటాయించకపోవటంతో..

పంటల బీమా ఇక లేనట్లే!

రూ. 196.32 కోట్లకు ప్రతిపాదనలు పంపిన వ్యవసాయశాఖ

నయాపైసా కేటాయించని సర్కారు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తాజా బడ్జెట్‌లో పంటల బీమా పథకం ప్రస్తావనే లేదు. నయాపైసా నిధులు కేటాయించకపోవటంతో.. ఇక తెలంగాణలో క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కాలగర్భంలో కలిసిపోయినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలుకావటంలేదు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం నుంచి బయటకు వచ్చిన రాష్ట్రప్రభుత్వం.. సొంతంగా మరో పథకాన్ని తెరపైకి తీసుకొస్తుందని రైతులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం బంగ్లా సస్య బీమా యోజన(బీఎ్‌సబీవై) పేరుతో ఓ పథకాన్ని అమలుచేస్తోంది. తెలంగాణ వ్యవసాయశాఖ కూడా ఈ పథకంపై అధ్యయనం చేయడానికి అధికారుల బృందాన్ని పశ్చిమబెంగాల్‌ పంపించాలని ప్రయత్నాలు చేసింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా సీఎంవో నుంచి అనుకూల సంకేతాలు రావటంతో క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పథకం కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు.

రాష్ట్రప్రభుత్వం సొంతంగా అమలుచేస్తే ఎంత ఆర్థిక భారం పడుతుంది? ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలా? రైతుల నుంచి కూడా ఎంతో కొంత ప్రీమియం వసూలు చేయాలా? గ్రామం యూనిట్‌గా అమలుచేయాలా? మండలం యూనిట్‌గానా? పంటల వారీగానా? అనే అంశాలపై కసరత్తు చేశారు. ఈక్రమంలోనే క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కోసం రాష్ట్రవ్యవసాయశాఖ రూ. 196.32 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి పంటల బీమా పథకం అమలులోకి వస్తుందని రైతులు భావించారు. కానీ బడ్జెట్‌లో ఎక్కడా పంటల బీమా ప్రస్తావన కనిపించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకాన్ని అమలుచేసే ఆలోచనలేదని స్పష్టమవుతోంది. మరోవైపు రైతులు మూడేళ్లుగా అతివృష్టితో నష్టపోతున్నారు. కుండపోత/అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం నుంచి నయాపైసా పరిహారం అందలేదు. కనీసం పెట్టుబడి రాయితీ కూడా ఇచ్చే పరిస్థితిలేదు. ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’(పీఎంఎ్‌ఫబీవై) పథకాన్ని కూడా అమలుచేసే పరిస్థితి కూడా కనిపించటంలేదు.

Updated Date - 2023-02-07T04:21:18+05:30 IST