Etela Rajender: బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపాటు

ABN , First Publish Date - 2023-01-25T14:12:50+05:30 IST

బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.)పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (bjp mla Etela Rajender) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షామీర్‌పేటలో ఆయన మీడియాతో

Etela Rajender: బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపాటు
ఆగ్రహం

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.)పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (bjp mla Etela Rajender) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షామీర్‌పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు జనవరి 26. కరోనా కారణంగా గణతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహించలేకపోతున్నాం. మీ రాజ్‌భవన్‌లోనే నిర్వహించుకోండి అని కేసీఆర్ లేఖ రాయడం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడమే. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం కూడా పద్ధతి కాదు. ఇలా చేయడం రాజ్యాంగాన్ని, ప్రజలను అవమానించడమే. మా హక్కులను కాలరాస్తూ... మమ్మల్ని అసెంబ్లీ నుంచి బయటికి గెంటివేస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని చూస్తున్నారు. రాచరికపు పోకడలకు పరాకాష్ట ఇది. ఒక్కనాడు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు. జాతీయ పార్టీ అయిన బీజేపీ (bjp)‌ని కూడా ఐదుగురు సభ్యులు లేరని, ముగ్గురు సభ్యులే ఉన్నారని బీఏసీ (BAC) సమావేశానికి కూడా పిలవడం లేదు. గత ప్రభుత్వాలు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా... బీఏసీ (BAC) సమావేశానికి పిలిచేవారు. ఎమ్మెల్యేలు కనీసం సీఎంను కలిసే పరిస్థితి కూడా లేదు. పార్టీల మధ్య ఇనుప గోడలు పెట్టి, రాచరికపు పోకడలను అణువణువునా అమలు చేస్తున్న నీచమైన, నికృష్టమైన సీఎం కేసీఆర్ (cm kcr).’’ అంటూ ఈటల మండిపడ్డారు.

‘‘మొత్తం ఎన్నికల ప్రక్రియను డబ్బుతో ముడిపెట్టి కొనేస్తున్నారు. కేసీఆర్ అధికార దుర్వినియోగంతో పోలీసులను వాడుకుంటూ... ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్క హుజురాబాద్‌లోనే రూ.600 కోట్లు ఖర్చు చేశారు. మునుగోడులో 100 కోట్ల ఖర్చు పెట్టారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు... మొత్తం నిర్వీర్యం అయిపోయింది. పోలీసులు కేసీఆర్‌కు కొమ్ముకాస్తున్నారు. పోలీసుల వలయంలోనే డబ్బులు పంచుతున్నారు. BRS పార్టీ పెట్టి, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? 'ధరణి' పేరుతో పేదల భూములను లాక్కుని, దండుకుంటున్నారు. ఇవాళ పైసలు లేకపోతే ఎన్నికలు లేవు. 20 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటి రాజకీయ పరిస్థితులను నేనెప్పుడూ చూడలేదు. తెలంగాణ (Telangana) లోని దుర్నీతి, చిల్లర సాంప్రదాయాన్ని దేశంలో రుద్దడం కోసమే BRS పార్టీ. డబ్బులు పెట్టి ఖమ్మంలో సభ పెట్టుకున్నారు. కేసీఆర్.. బీహార్, యూపీ, తమిళనాడులో ఖర్చు పెట్టే ఖర్చులు కేసీఆర్‌వి కావు, ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము.’’ అని తెలిపారు.

‘‘వ్యవసాయానికి ఎక్కడా కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఏసీడీ (ACD) పేరుతో విద్యుత్ బిల్లులో కూడా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. దళిత కాలనీల్లో ఫ్యూజ్‌లు పీకేసి కరెంట్ కట్ చేస్తున్నారు. దళితబంధు, దళితులకు 3 ఎకరాల భూమి లేదు. రూ.60 వేల కోట్ల అప్పుల్లో డిస్కమ్‌లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నిష్ణాతులైన ఇంజినీర్లు అడుగుపెట్టే పరిస్థితి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు మునిగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని పంపులు మునిగాయో.. ఎంత నష్టం వచ్చిందో... శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ టీవీ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్‌ను కొనేసి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. పోలీసు అభ్యర్థుల ఆందోళనలు పట్టించుకోరు. పోలీసు అభ్యర్థుల ఉసురు ఊరికే పోదు. బషీర్‌బాగ్ కాల్పుల్లో చంద్రబాబు‌కు పట్టిన గతే... కేసీఆర్‌కు పడుతుంది. ప్రభుత్వ ఉపాద్యాయులు 317 జీవోకు వ్యతిరేకంగా నిరసన చేస్తుంటే... వాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 10300 బస్సులు ఉంటే... ఇప్పుడు 9000 బస్సులకు పడిపోయాయి. ఆ 9000 బస్సుల్లో 3000 ప్రైవేట్ బస్సుల. స్టూడెంట్ బస్ పాస్ (Student bus pass) చార్జీలు పెంచారు. ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. రైతుబంధు పేరుతో... రైతులకు రావాల్సిన మిగిలిన అన్ని సబ్సిడీలను బంద్ చేశారు. రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమే. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి రాచరికపు పాలన చేస్తున్న మీకు త్వరలోనే చరమగీతం పాడుతాం.’’ అని హెచ్చరించారు.

‘‘2018లో కాంగ్రెస్ పార్టీ (Congress party) అభ్యర్థికి రూ.100 కోట్లు ఇచ్చి కేసీఆర్ నన్ను ఓడించే ప్రయత్నం చేశారు. ఎల్లమ్మబండలో పేదల పక్షాన కొట్లాడింది నేను. ఈటల రాజేందర్ చరిత్ర తెరిచిన పుస్తకం. హైదరాబాద్ నగరంలో కొల్లగొట్టబడుతున్న భూములు అన్నిటిపై దమ్ముంటే సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ చర్యల వల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే... నా భూమి కాగితాలే కుదవపెట్టి అప్పు తెచ్చుకున్నా. కేసీఆర్ (kcr) రాజ్యంలో డబ్బులు లేకుండా ఎన్నికలు లేవు. కేసీఆర్ మనుషులు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. తెలంగాణపై మోడీ (Modi), అమిత్ షా, నడ్డా ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మా కార్యాచరణ ఉంటుంది. కేసీఆర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా... ఈటల రాజేందర్ ఏం చేస్తున్నాడా?... ఈటలను ఎవరు కలుస్తున్నారా? అనే చూస్తోంది. నేను హుజురాబాద్‌లో గెలిచి 13 నెలలు అయినా... ఒక్క అధికార కార్యక్రమానికి ఆహ్వానం లేదు. ఈ ఎకిలి, మకిలి చేష్టలు ఎన్నిరోజులో ఉండవు.’’ అని ఈటల వార్నింగ్ ఇచ్చారు.

Updated Date - 2023-01-25T14:12:52+05:30 IST