అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా భువనగిరి, బుద్ధవనం

ABN , First Publish Date - 2023-02-02T02:55:37+05:30 IST

‘స్వదేశీ దర్శన్‌’ ప్రాజెక్టుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం భువనగిరి కోట, నాగార్జునసాగర్‌ సమీపంలోని బుద్ధవనం ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనుంది.

అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా భువనగిరి, బుద్ధవనం

బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయింపు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘స్వదేశీ దర్శన్‌’ ప్రాజెక్టుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం భువనగిరి కోట, నాగార్జునసాగర్‌ సమీపంలోని బుద్ధవనం ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో భువనగిరి కోట ప్రాంతాన్ని హరితవనాలతో తీర్చిదిద్ది.. అడ్వెంచర్‌(ట్రెక్కింగ్‌) టూరిజానికి కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. రోప్‌వేను ఏర్పాటు చేస్తారు. రాత్రివేళల్లో ఆకర్షణీయంగా కన్పించేందుకు లైట్‌ అండ్‌ సౌండ్‌ ప్రాజెక్టును చేపడతారు. ఇక కృష్ణానది తీరంలో.. నాగార్జునసాగర్‌ సమీపంలో సుమారు 274 ఎకరాల్లో విస్తరించిన బుద్ధవనం ప్రాజెక్టును కూడా అంతర్జాతీయ పర్యాటకులను అకట్టుకునేందుకు అనువుగా మరో వంద కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తారు. ఇక్కడ కన్వెన్షన్‌ సెంటర్‌ను, ఆచార్య నాగార్జున పేరుతో అంతర్జాతీయ బౌద్ధ విజ్ఞాన పరిశోధన కేంద్రం, బౌద్ధ విద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.

‘సాలార్‌జంగ్‌’కు మరిన్ని సొబగులు..!

చారిత్రక సాలార్‌జంగ్‌ మ్యూజియానికి మరిన్ని సోబగులు అద్దేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుంది. దేశవ్యాప్తంగా మ్యూజియాల అభివృద్ధికి రూ. 357 కోట్లు కేటాయించింది.

Updated Date - 2023-02-02T02:55:38+05:30 IST