Banjara Hills: కారు కోసం 31 లక్షలు తీసుకొని మోసం

ABN , First Publish Date - 2023-02-02T12:43:01+05:30 IST

ఇన్నోవా కారు కోసం 31 లక్షల రూపాయలు తీసుకొని వాహనం, డబ్బు ఇవ్వకుండా వైద్యుడిని

Banjara Hills: కారు కోసం 31 లక్షలు తీసుకొని మోసం

హైదరాబాద్/బంజారాహిల్స్‌: ఇన్నోవా కారు కోసం 31 లక్షల రూపాయలు తీసుకొని వాహనం, డబ్బు ఇవ్వకుండా వైద్యుడిని మోసం చేసిన రాధాకృష్ణ టయోటా నిర్వాహకులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.....బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 5కు చెందిన డాక్టర్‌ ఎం.హమేద్‌ ఖలీల్‌ వైద్యుడు. 2021 అక్టోబర్‌లో ఇన్నోవా క్రిస్టా కారు కొనుగోలు చేసేందుకు సనత్‌నగర్‌లోని రాధాకృష్ణ టయోటా షోరూంకు వెళ్లి మేనేజింగ్‌ డైరెక్టర్లు మధుసూదన్‌, ఎంవీ.రావులను కలిశాడు. అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటే నెల రోజుల్లో వాహనం అందజేస్తామని వారు చెప్పారు. ఈ మేరకు హమేద్‌ కొంత డబ్బు చెల్లించాడు.

కొద్దిరోజుల తరువాత షోరూం నుంచి ఫోన్‌ చేసి వాహనం సిద్దంగా ఉందని, మిగతా డబ్బు కట్టాలని సిబ్బంది సూచించారు. హమేద్‌ అడ్వాన్స్‌తో కలిపి మొత్తం 31 లక్షల రూపాయలు చెల్లించాడు. వాహనం తీసుకునేందుకు షోరూంకు వెళ్లగా పొరపాటున వాహనం మరొకరికి ఇచ్చామని, త్వరలో మరో వాహనం సిద్దం చేస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. రోజులు గడుస్తున్నా ఎవరూ ఫోన్‌ చేయకపోవడంతో హమేద్‌ మరోసారి షోరూంకు వెళ్లగా అప్పటికే మూసేశారు. మధుసూదన్‌, ఎంవీ.రావుకు ఫోన్‌ చేయగా వాహనం కోసం తీసుకున్న డబ్బును వడ్డీతో కలిపి చెల్లిస్తామని చెప్పారు. ఆ తరువాత ముఖం చాటేస్తూ వచ్చారు. మోసపోయినట్టు గ్రహించిన హమేద్‌ బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించాడు. లేని కారు కోసం తాను ప్రతి నెలా 28 వేల రూపాయల ఈఎంఐను బ్యాంకులో కడుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు మధుసూదన్‌, ఎంవీ.రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-02T12:43:07+05:30 IST