కేంద్రాన్ని మీరు ఏం అడిగారు?

ABN , First Publish Date - 2023-02-02T02:57:58+05:30 IST

‘కరువు ప్రాంతమని కర్ణాటక ప్రతిపాదనలు పంపింది కాబట్టే ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. మరి మీరు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపారు..

కేంద్రాన్ని మీరు ఏం అడిగారు?

రాష్ట్ర సర్కారుకు బండి సంజయ్‌ ప్రశ్న

కరువు ప్రాంతంగా చూపారు కాబట్టే..

కర్ణాటకకు నిధులు ఇచ్చారని వ్యాఖ్య

ఉజ్వల భవిష్యత్తును ఇచ్చే బడ్జెట్‌ : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘‘కరువు ప్రాంతమని కర్ణాటక ప్రతిపాదనలు పంపింది కాబట్టే ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. మరి మీరు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపారు..?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది అమృతకాల బడ్జెట్‌ అని, ఆశాజనక బడ్జెట్‌గా ప్రపంచం గుర్తిస్తుందని పేర్కొన్నారు. బడ్జెట్‌లో అన్ని రంగాలు, అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించారని, దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారని అన్నారు. పన్ను రాయితీల్లో పేద మధ్య తరగతి వారికి ఊరట లభించిందని చెప్పారు. కేసీఆర్‌ సర్కార్‌ ముందు రైతులకు రుణ మాఫీ చేయాలని, ఫసల్‌ బీమా ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని ఆవాస్‌ యోజనకు కేంద్రం నిధులిస్తే కేసీఆర్‌ ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌ను ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన తప్పుబట్టారు.

బీఆర్‌ఎస్‌ సర్కారు నీతులు చెప్పొద్దు

సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్‌ రూపొందించారని.. ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ తీసుకొచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పారిశుధ్య కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు.. మెషినరీ స్కావెంజింగ్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించడం.. పీఎం ఆవాస్‌ యో జన నిధులను 66ు పెంచడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రాచీ న తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలను డిజిటలైజ్‌ చేసే ‘భారత్‌ శ్రీ’ పథకంలో భాగంగా హైదరాబాద్‌లో ఎపీగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధిని చూడలేని స్థితిలో కల్వకుంట్ల కుటుంబం ఉందని విమర్శించారు. ‘అమృత్‌ కాల్‌’లో కీలకంగా మారనున్న నాలుగు అంశాల్లో ఒకటిగా పర్యాటక రంగాన్ని బడ్జెట్‌ గుర్తించిందని చెప్పారు. గతేడాదిలానే ఈ ఏడాది కూడా రూ. 2,400 కోట్లు కేటాయించి పర్యాటకానికి పెద్దపీఠ వేసినందుకు ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్‌ కేంద్రంగా ‘శ్రీ అన్న’ పథకం రీసెర్చ్‌: లక్ష్మణ్‌

టెక్నాలజీ ఆధారిత చిరుఽధాన్యాల అభివృద్ధి కోసం అధ్యయనం చేపడుతున్న హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు కేంద్రం సహకారం అందించనున్నదని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఇందులో భాగంగానే ‘‘శ్రీ అన్న’’ పథకాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు హైదరాబాద్‌లోని మిల్లెట్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా మార్చబోతున్నదని తెలిపారు. కాగా, కేంద్ర బడ్జెట్‌ బడుగు, బలహీన వర్గాలకు ఊతం ఇవ్వడంతో పాటు, ప్రగతికి దోహదపడేలా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

Updated Date - 2023-02-02T02:59:25+05:30 IST