IT అధికారులమంటూ.. రూ. లక్షలు వసూలు

ABN , First Publish Date - 2023-02-06T12:39:02+05:30 IST

ఆదాయపన్ను(ఐటీ) అధికారులమని చెప్పుకొంటూ ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడిని

 IT అధికారులమంటూ.. రూ. లక్షలు వసూలు

హైదరాబాద్‌ సిటీ/పంజాగుట్ట: ఆదాయపన్ను(ఐటీ) అధికారులమని చెప్పుకొంటూ ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడిని అపహరించింది ఐదుగురు దుండగుల బృందం. గత నెల 27న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. యూసు్‌ఫగూడలోని నవోదయ కాలనీకి చెందిన బీవీ మురళీకృష్ణ స్థానికంగా జాబ్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. గత నెల 27న అమీర్‌పేట్‌ వద్ద బైక్‌పై వస్తున్న అతన్ని ఆపిన ఐదుగురు వ్యక్తులు తాము ఐటీ అధికారులమని చెప్పి, ఇన్నోవా కారు (ఏపీ 16డీసీ 6999)లో విజయవాడ హైవేలో బాటసింగారం సమీపంలోకి తీసుకెళ్లారు. రూ. 60లక్షలు టాక్స్‌ చెల్లించాలని లేదంటే జైలుకు తీసుకెళ్తామని బెదిరించారు. అప్పటికే ఆయన బావమరిది రాజేశ్‌ను అపహరించారని చెప్పి, అతడితో మాట్లాడించారు. దీంతో ఆందోళనకు గురైన మురళీకృష్ణ భార్యకు ఫోన్‌ చేసి డబ్బు సమకూర్చమని చెప్పాడు. రూ. 30లక్షలు అప్పు తెచ్చిన బాధితుడి కుటుంబీకులు, అతని బావమరిది ద్వారా నాంపల్లి స్టేషన్‌లో దుండగులకు డబ్బు అందించారు. ఆ తర్వాత నిందితులు మురళీకృష్ణను హయత్‌నగర్‌లో వదిలేసి పరారయ్యారు. డబ్బును ఐటీ శాఖలో జమ చేస్తామని దుండుగులు ఎంతకీ చేయకపోవడంతో మురళీకృష్ణ పోలీసుల్ని ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, దుండగుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-06T12:39:04+05:30 IST