50 వేల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉద్యోగాలు

ABN , First Publish Date - 2023-02-07T03:29:49+05:30 IST

రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, సుమారు 4 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

50 వేల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉద్యోగాలు

రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలివి.. తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ప్రకటించిన కేటీఆర్‌

దేశంలోనే ఇది మొదటిదన్న మంత్రి

ఇప్పటికే 8 వేల కోట్ల పెట్టుబడులు

మొబిలిటీ నెక్స్ట్‌ సదస్సులో కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, సుమారు 4 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ చుట్టూ విద్యుత్తు వాహనాల(ఈవీ) తయారీ, ఎనర్జీ స్టోరేజీ, పరిశోధనలకు సంబంధించి నాలుగు మెగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈవీల తయారీ, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) సంస్థల ఏర్పాటుకు ఊతమిచ్చేలా దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మొబిలిటీ-ఫోకస్డ్‌ క్లస్టర్‌, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ)ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హెచ్‌ఐసీసీలో సోమవారం జరిగిన ‘మొబిలిటీ నెక్ట్స్‌ హైదరాబాద్‌ సమ్మిట్‌-2023’లో ఆయన మాట్లాడారు.

సోలార్‌ విద్యుదుత్పత్తిలో రెండో స్థానం..

క్లీన్‌ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ నిలిచిందని, సోలార్‌ విద్యుదుత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని కేటీఆర్‌ చెప్పారు. 4.6 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో రాష్ట్రంలో 20 శాతం సౌర విద్యుదుత్పత్తి జరుగుతుందన్నారు. ఒలెక్ర్టా, మైట్రా, గ్రావ్టన్‌, ప్యూర్‌ ఈవీ, వన్‌ మోటో, ఈటో, లైట్‌ ఆటో తదితర ప్రముఖ సంస్థలు తెలంగాణలో రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. జహీరాబాద్‌, సీతారాంపూర్‌ ప్రాంతాల్లో వాహనాల తయారీ కేంద్రాలు, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌, వికారాబాద్‌ జిల్లాలోని యెకంతలలో ఇన్నోవేషన్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

2 వారాల్లో మరో రూ.3 వేల కోట్లు..

వినూత్న ఆలోచనలతో వచ్చి స్టార్ట్‌పలు ఏర్పాటు చేయడానికి టీ హబ్‌ సహకరిస్తుందని కేటీఆర్‌ అన్నారు. టీఎంవీలో అమరరాజా, హ్యుండాయ్‌, అలాక్స్‌, ఎట్టెరో, తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. డ్రైవింగ్‌ సామర్ధ్యం పెంచేలా అపోలో సంస్థ(టైర్లు) డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌, యువతలో నైపుణ్యం పెంచేందుకు టాస్క్‌తో కలిసి ప్రభుత్వం కలామ్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమేటివ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఫిస్కర్‌ సంస్థ అమెరికా తర్వాత రాష్ట్రంలోనే ఇంజనీరింగ్‌ పరిశోధన, అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాల తయారీకి సంబంధించి రెండు వారాల్లో మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. స్టార్ట్‌పలకు సహకారమందించేలా ఎంజీ గ్రూపు ఈవీ పార్క్‌ ఏర్పాటు చేయనుందన్నారు. సమావేశంలో పలు సంస్థలతో పరిశ్రమల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. టీఎంవీ నమూనా చిత్రాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ ఆవిష్కరించారు. రాష్ట్రంలో వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల సమాచారం తెలిపే టీఎస్‌ రెడ్కో రూపొందించిన టీఎస్‌వీ యాప్‌ను ఆవిష్కరించారు.

Updated Date - 2023-02-07T03:29:50+05:30 IST