5 శాతం ఫిట్‌మెంట్‌ చాలు

ABN , First Publish Date - 2023-01-25T02:39:41+05:30 IST

విద్యుత్‌ ఉద్యోగులకు 5 శాతమే ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని వేతన సవరణ సంప్రదింపుల కమిటీ నివేదిక ఇచ్చింది.

5 శాతం ఫిట్‌మెంట్‌ చాలు

విద్యుత్‌ సంస్థలకు నివేదిక ఇచ్చిన వేతన సవరణ సంప్రదింపుల కమిటీ.. భగ్గుమన్న ఉద్యోగులు

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఉద్యోగులకు 5 శాతమే ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని వేతన సవరణ సంప్రదింపుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఉద్యోగులకు వేతన సవరణపై ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు నేతృత్వంలో నియమించిన కమిటీ ఇటీవలే నివేదికను సమర్పించింది. విద్యుత్‌ సంస్థల ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 5 శాతానికి మించకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సిఫారసు చేసింది. దీనిపై ఉద్యోగులు భగ్గుమన్నారు. వేతన సవరణపై ఈ నెల 31లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ విద్యుత్‌ సంస్థలకు అల్టిమేటం ఇచ్చింది. మంగళవారం విద్యుత్‌ సౌధలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావును జేఏసీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం ఇచ్చి సమస్యను నివేదించారు. వేతన సవరణ అంశంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఫిట్‌మెంట్‌పై ప్రకటన వచ్చేలా చూస్తామని ప్రభాకర్‌రావు బదులిచ్చారు. 2022 ఏప్రిల్‌ 1 నుంచి వేతన సవరణ అమలు చేయాల్సిందేనని, దీనిపై నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని జేఏసీ కోరింది. లేనిపక్షంలో ఫిబ్రవరి 1న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, 2న విద్యుత్‌ సౌధను ముట్టడిస్తామని ప్రకటించింది.

Updated Date - 2023-01-25T02:39:42+05:30 IST