వైద్యానికి12,161 కోట్లు

ABN , First Publish Date - 2023-02-07T04:44:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ను పెంచింది. అంకెల్లో పెంచినట్లు కనిపిస్తున్నా.. మొత్తం బడ్జెట్‌లో శాతాల పరంగా చూస్తే మాత్రం నిరుటి కంటే తగ్గింది

వైద్యానికి12,161 కోట్లు

అంకెల్లో పెరిగాయి.. మొత్తం శాతంలో తగ్గాయి!..

మొత్తం కేటాయింపుల్లో వైద్యానికి 4.18 శాతమే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ను పెంచింది. అంకెల్లో పెంచినట్లు కనిపిస్తున్నా.. మొత్తం బడ్జెట్‌లో శాతాల పరంగా చూస్తే మాత్రం నిరుటి కంటే తగ్గింది! ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కంటివెలుగుకు పెద్దగా నిధులు కేటాయించలేదు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాల కోసం గత ఏడాది రూ.1000 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే సగానికి సగం కోత పెట్టారు. హైదరాబాద్‌ నలువైపులా గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, ఆల్వాల్‌, సనత్‌నగర్‌ ప్రాంతాల్లో రూ.2679 కోట్లతో భారీ ఎత్తున సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టినట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ప్రభుత్వం తెలిపింది. అలాగే వరంగల్‌లో హెల్త్‌ సిటీని రూ.1100కోట్లతో చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ వ్యయాలకు తగినట్లుగా బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం చేయలేదు. కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌ను ఈ ఏడాది రాష్ట్రమంతా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు బడ్జెట్‌లో రూ.200కోట్లు కేటాయించింది.

మొత్తంమీద ఈ ఏడాది వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం రూ.12161 కోట్లు కేటాయించింది. ఇది నిరుటి కంటే రూ.924 కోట్లు ఎక్కువ. అలాగే ప్రగతి పద్దు కేటాయింపులనూ పెంచింది. నిరుడు రూ.5743 కోట్లు కేటాయిస్తే.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.6566 కోట్లు చూపింది. అయితే నిరుడు బడ్జెట్‌ మొత్తంలో వైద్య, ఆరోగ్య రంగానికి 4.37 శాతం నిధులు కేటాయిస్తే, ఈ సారి అది 4.18 శాతానికి తగ్గింది. అంటే పైకి కేటాయింపులు పెరిగినట్లు కనిపించినా.. మొత్తంలో అది తగ్గినట్లే. ఈ సారి బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి రూ.1463 కోట్ల కేటాయింపులు చూపారు. నిరుటి కంటే రూ.120 కోట్లు అదనంగా కేటాయించింది. ఈహెచ్‌ఎ్‌సకు నిరుడు, ఇప్పుడు రూ.362కోట్లే కేటాయించారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.115కోట్లు మ్యాచింగ్‌ గ్రాంట్‌గా చూపారు. ఇక కేసీఆర్‌ కిట్‌కు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రూ.443 కోట్లు కేటాయించారు.

ప్రగతి పద్దులో ముఖ్యాంశాలు

జీహెచ్‌ఎంసీ పరిఽధిలోని సర్కారు దవాఖానాల్లో రోగుల సహాయకులకు సబ్సిడీ భోజన సదుపాయానికి రూ.70 కోట్లు కేటాయించారు. ఇలా కేటాయించడం ఇదే తొలిసారి. వైద్య పరిశోధనలు, పబ్లికేషన్స్‌, ఉపకార వేతనాల కోసం రూ.225కోట్లు కేటాయించారు. ఆస్పత్రుల్లో పరికరాల కొనుగోలుకు రూ.275కోట్లు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల అప్‌గ్రెడేషన్‌కు రూ.53.86 కోట్లు, ఔషధాల కొనుగోలుకు రూ.377.43 కోట్లు కేటాయించారు. మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల భవన నిర్మాణాలకు రూ.1033 కోట్ల కేటాయింపులు చేశారు. బోధనాస్పత్రుల అభివృద్ధికి గత బడ్జెట్‌లో కేవలం రూ.58 కోట్లు కేటాయిస్తే ఈసారి దాన్ని రూ.181 కోట్లకు పెంచారు. కాగా, గడిచిన రెండేళ్లలోనే రూ.23398 కోట్ల కేటాయింపులు చేసింది. అయితే బడ్జెట్‌ కేటాయింపులకు, వాస్తవ వ్యయానికి చాలా వ్యత్యాసం ఉంటోంది.

Updated Date - 2023-02-07T04:45:36+05:30 IST