‘ధ్రువ’తో వలస కూలీల పిల్లల జీవితాల్లో వెలుగులు

ABN , First Publish Date - 2023-01-26T01:36:59+05:30 IST

పెద్దపల్లి జిల్లాలో వందల సంఖ్యలో ఇటుక బట్టీలు ఉన్నాయి. ఏటా నవంబరు నుంచి జూన్‌ వరకు మట్టి ఇటుకలు తయారు చేస్తుంటారు.

‘ధ్రువ’తో వలస కూలీల పిల్లల జీవితాల్లో వెలుగులు

పెద్దపల్లి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాలో వందల సంఖ్యలో ఇటుక బట్టీలు ఉన్నాయి. ఏటా నవంబరు నుంచి జూన్‌ వరకు మట్టి ఇటుకలు తయారు చేస్తుంటారు. యజమానులు ఒడిషా నుంచి కార్మికులను రప్పించి పనులు చేయిస్తుంటారు. వాళ్లతో పాటు ఉన్న పిల్లలు చదువుసంధ్యలు లేక బట్టీల్లోనే మగ్గిపోవాల్సి వస్తోంది. కొందరు యజమానులు చట్ట విరుద్ధంగా చిన్నారులతోనూ పనులు చేయించుకుంటున్నారు. అలాంటి చోట పాఠశాలలు నడపాల్సిన కార్మిక శాఖ పట్టించుకోవడం లేదు. ఈ విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ రూపేష్‌ నెల రోజుల క్రితం బట్టీల యజమానులతో సమావేశం ఏర్పాటుచేసి పిల్లలతో పనులు చేయిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. అంతటితో ఆగలేదు. 20 మంది పిల్లలు ఉండే ప్రతి ఇటుక బట్టీ దగ్గర ఒక పాఠశాలను, తక్కువ మంది విద్యార్థులు ఉన్న రెండు, మూడు బట్టీల పిల్లలకు కలిపి ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా తరగతి గదులను తీర్చిదిద్దారు. మాతృభాష ఒరియాతో పాటు ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన మొదలుపెట్టారు. అందుకోసం ఒడిషా నుంచి ప్రైవేట్‌ ఉపాధ్యాయులను రప్పించారు. గత నెల 20 నుంచి 19 పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. మూడు నుంచి పదేళ్ల వయసున్న 720 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలకు ‘ధ్రువ’ అని పేరుపెట్టారు. విద్యార్థులకు పలకలు, నోటు బుక్కులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను డీసీపీనే అందజేశారు. ప్రస్తుతం ‘ధ్రువ’ల నిర్వహణ బాధ్యత ఇటుక బట్టీల యజమానులే చూసుకుంటున్నారు.

Updated Date - 2023-01-26T01:36:59+05:30 IST