BANDI SANJAY: పార్టీలో తెలంగాణ పదం తీసేసి ప్రజలను వంచించారు

ABN , First Publish Date - 2023-01-25T03:26:37+05:30 IST

తెలంగాణ కోసం పుట్టినట్లు చెప్పుకొన్న పార్టీ, తన పేరు నుంచి తెలంగాణ పదాన్ని తొలగించి రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించిందంటూ బీఆర్‌ఎ్‌సపై భారతీయ జనతా పార్టీ ధ్వజమెత్తింది.

BANDI SANJAY: పార్టీలో తెలంగాణ పదం తీసేసి ప్రజలను వంచించారు

బీఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయి లేదు!

కాళేశ్వరంలో అవినీతి నిజం..

మాఫియాకు కేరాఫ్‌గా ఆ పార్టీ నేతలు

ధరణితో రూ.వేల కోట్ల అవినీతి..

బీజేపీ రాజకీయ తీర్మానం

కేసీఆర్‌.. మీ ఆస్తులెన్ని?.. శ్వేతపత్రమివ్వాలి: సంజయ్‌

సెవెన్‌స్టార్‌ ఫాంహౌస్‌ నుంచి తాంత్రిక పాలన: తరుణ్‌ ఛుగ్‌

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోసం పుట్టినట్లు చెప్పుకొన్న పార్టీ, తన పేరు నుంచి తెలంగాణ పదాన్ని తొలగించి రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించిందంటూ బీఆర్‌ఎ్‌సపై భారతీయ జనతా పార్టీ ధ్వజమెత్తింది. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సభలో కేసీఆర్‌ ‘జై తెలంగాణ’ అనకుండా సంకుచిత రాజకీయాలు చేశారని ఆరోపించింది. ఇలాంటి పార్టీలేవీ జాతీయ స్థాయికి ఎదిగిన దాఖలాలు లేవని.. బీఆర్‌ఎస్‌ కూడా ఇందుకు మినహాయింపు కాబోదని స్పష్టం చేసింది. అన్ని రంగాల్లో విఫలమైన బీఆర్‌ఎ్‌సను ఓడించి, రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పాటు చేయడమే లక్ష్యమని ప్రకటించింది. ‘‘తెలంగాణ ఏర్పడ్డప్పుడు మిగులు ఆదాయం ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు రూ. 5లక్షల కోట్ల అప్పులకు చేరింది. కార్పొరేషన్లూ అప్పులతోనే నడుస్తున్నాయి. ఒకప్పుడు 5 వేల కోట్ల డిపాజిట్లు ఉన్న జీహెచ్‌ఎంసీ ఇప్పుడు 5 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. లక్ష కోట్లకు పైగా ఖర్చుచేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒరిగిందేమీ లేదు. ఈ ప్రాజెక్టులో ముమ్మాటికీ అవినీతి జరిగింది. బీఆర్‌ఎస్‌ నాయకులకు ఇది ఏటీఎంగా మారిందన్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి కుటుంబం సహా బీఆర్‌ఎస్‌ నాయకులు అన్ని రకాల మాఫియాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారారు. వారి అక్రమ సంపాదనకు అంతు లేకుండా పోయింది. ధరణి పేరుతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ వేలకోట్ల అవినీతికి పాల్పడుతున్నారు’’ అని బీజేపీ ఆరోపించింది.

ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. కేసీఆర్‌ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, మహిళలపై హత్యాచారాలు, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని బీజేపీ ఆరోపించింది. మద్యం అమ్మకాల ద్వారా రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తున్నా, దేశంలో ఎక్కడా లేని విధంగా డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ వేసినా, భూముల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచినా ఆర్థిక పరిస్థితి మాత్రం రోజురోజుకీ దిగజారుతోందని ధ్వజమెత్తింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా సమాఖ్య స్ఫూర్తిని బీఆర్‌ఎస్‌ దెబ్బతీస్తోందని ఆరోపించింది. గ్రామ పంచాయతీలకు నేరుగా కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగచాటుగా దారి మళ్లించిందని.. ఉపాఽధి నిధులను కేంద్రం నిర్దేశించిన కార్యక్రమాలకు కాకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లిస్తోందని పేర్కొంది. అదనపు విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వకుండా అత్యధిక రేట్లతో విద్యుత్తును కొనుగోలు చేస్తోందని.. ప్రైవేటు విద్యుత్తు సంస్థలతో చేసుకున్న అవినీతి ఒప్పందాలతో పాటు డిస్కంలకు చెల్లింపులు జరపకపోవడంతో అవి రూ.70 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని విమర్శించింది. మరోవైపు వివిధ ఛార్జీల పేరిట వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపుతోందని ఆరోపించింది. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ విమర్శించింది. ఆయా వర్గాలకు పెద్దపీట వేసింది తామేనని స్పష్టం చేసింది. కాగా, వ్యవసాయ, విద్యార్థి, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపై కూడా తీర్మానాలు ఆమోదించారు.

10అంశాలపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు

రాష్ట్ర కార్యవర్గ సమావేశం పది అంశాలకు సంబంధించి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తొలిసారిగా జీ-20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశాన్ని దేశానికి కల్పించినందుకు, సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఇచ్చినందుకు, రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించినందుకు, పేదలకు ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీని నవంబరుదాకా పొడిగించినందుకు, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణకు రూ.700 కోట్లు కేటాయింపు తదితర అంశాలకు గాను ప్రధానిని సమావేశం అభినందించింది.

Updated Date - 2023-01-25T03:26:37+05:30 IST